ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రగతి ఫలాలు అందేనా..?

ABN, Publish Date - Nov 30 , 2024 | 12:06 AM

గిరిజనులపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లోపించింది.ఏ ప్రభుత్వానిదైనా ఒకటే తీరన్నట్లు తయారైంది సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పరిస్థితి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పాలకమండలి సమావేశాలు మూడున్నర ఏళ్లైనా పట్టించుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ లోగా ఎన్నికలు రావడం..కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా పాలకమండలి సమావేశాలపై ఊసే లేకుండా పోయింది.

మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం

ఐటీడీఏ పాలక మండలి సమావేశాలపై నిర్లక్ష్యం

2019 నుంచి ఇప్పటి వరకు దిక్కులేని వైనం

తిష్టవేసిన సమస్యలు

సకాలంలో అమలుకానీ పథకాలు

అవస్థలు పడుతున్న గిరిజనులు

ఏటూరునాగారం రూరల్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): గిరిజనులపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లోపించింది.ఏ ప్రభుత్వానిదైనా ఒకటే తీరన్నట్లు తయారైంది సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పరిస్థితి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పాలకమండలి సమావేశాలు మూడున్నర ఏళ్లైనా పట్టించుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ లోగా ఎన్నికలు రావడం..కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా పాలకమండలి సమావేశాలపై ఊసే లేకుండా పోయింది. దీంతో ఐటీడీఏ పాలనంతా నిర్లక్ష్యపు నీడన మగ్గుతోంది. ఐటీడీఏ ద్వారా గిరిజనులకు అందిస్తున్న పథకాలు, వాటి అమలు తీరును ఎప్పటికపుడు పర్యవేక్షించాల్సిన పాలకవర్గం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో శాపంగా మారింది. ప్రతి మూడునెలలకోసారి ఐటీడీఏ పాలనపై పాలక మండలి సమావేశాలు చేపట్టి పాలనలో లోపాలను సరిచేయాల్సి ఉండగా మూడున్నర ఏళ్లు దాటినా దాని ఊసే లేదు. దీంతో అధికారులదే ఇష్టారాజ్యంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు సకాలంలో అమలుకాక ఏళ్ల తరబడి లబ్ధిదారులు ఐటీడీఏ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుగానే ఈ ప్రభుత్వం ఐటీడీఏ చిన్నచూపు చూస్తోందని గిరిజనులు ఆరోపిస్తున్నారు.

ఐదేళ్లైనా ఊసే లేకపాయే..

పాలకమండలి సమావేశాలు జరిగి సుమారుగా ఐదేళ్లు కావస్తోంది. ప్రతీ మూడు నెలలకొకసారి జరగాల్సిన పాలక మండలి సమావేశాలు ఐదేళ్లైనా జరగకపోవడంపై గిరిజనులు ప్రభుత్వాల తీరును ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వాల మారిన వాటి తీరులో దొందూ దొందే అన్నట్లుగా తయారైందని గిరిజన సంఘాలు బాహాటం గానే విమర్శిస్తున్నాయి. ఐటీడీఏ పరిధిలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 13 ఏజెన్సీ మండలాలు, 177 ఏజెన్సీ గ్రామాలున్నాయి. ఈ ప్రాంతాల్లోని గిరిజనుల పాలనంతా ఐటీడీఏ ద్వారానే కొనసాగుతుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులన్నీ ఐటీడీఏ పర్యవేక్షిస్తుంది. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా పనిచేయా ల్సిన ఐటీడీఏలో పాలకుల పట్టింపు కరువై నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ఐటీడీఏ పాలనపై ప్రతీ మూడునెలల కొకసారి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, మిగతా ప్రతినిధుల సమక్షంలో సమావేశాలు జరిపి ఐటీడీఏ ద్వారా గిరిజనులకు అమలవుతున్న పథకా ల అమలు, దానిలోని లోపాలను గుర్తించి గిరిజను లకు లబ్ధిచేకూర్చేందుకు ప్రణాళికలు సిద్దం చేయాల్సి ఉంటుం ది. కానీ గత 59 నెలలుగా పాలక మండలి సమావేశాల నిర్వహణే లేకుండా పోయింది. చివరిగా 2019 డిసెంబరు నెలలో అప్పటి కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అధ్యక్షతన పాలక మండలి సమావేశాలను చేపట్టగా అప్పటి గిరిజన, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఽథోడ్‌ ముఖ్య అతిఽథిగా హాజరై సంక్షేమ, అభివృద్ధి పథకాలపై సమీక్షించి పలు తీర్మానాలను ఆమోదించారు. ఆ సమావేశంలోనే ఐటీడీఏ పాలకమండలి సమావేశాలను ప్రతి మూడునెలలకొకసారి చేపట్టి గిరిజనులకు అందుబాటులో ఉంటామని హామీనివ్వడం జరిగింది. కానీ మంత్రి ఇచ్చిన హామీ ఆచరణకు నోచుకోలేదు. మూడునెలలు కాదు కదా మూడున్నర ఏళ్లు దాటినా పాలక మండలి సమావేశాల ఊసే లేకుండా పోయింది. దీంతో గిరిజనుల పై పాలకులకు చిత్తశుద్ది లేదని ఆదివాసీ సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

పథకాల అమలుపై తీవ్ర ప్రభావం...

ఐటీడీఏలో పాలక మండలి సమావేశాలు నిర్వహణ సకాలంలో జరగకపోవడంతో ప్రభుత్వం గిరిజనుల కోసం అమలు చేస్తున్న పథకాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పథకాలు సకాలంలో అమలు కాకపోవడంతో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా పథకాల ఫలా లు గిరిజనుల చెంతకు చేరడం లేదు. ఎకనామిక్‌ సపోర్ట్‌ స్కీం, గిరివికాసం, స్వయం ఉపాధి పథకాలు సక్రమంగా అమలు కావడం లేదు. ఈఎస్‌ఎస్‌ స్కీం ద్వారా 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తం 6761 యూనిట్లు మంజూరు చేసింది. కానీ ఇప్పటి వరకు 3911 యూనిట్లకు మాత్రమే సబ్సిడి రూపం 34.06 కోట్లను ఇచ్చి 956 యూనిట్లకు ట్రైకార్‌ ద్వారా బ్యాంకులకు రూ. 8.56 కోట్లను మాత్రమే సబ్సిడీని విడుదల చేసింది. ఇందులో గిరిజనులకు 90 యూనిట్లకు మాత్రమే గ్రౌండింగ్‌ ప్రక్రియను పూర్తి చేసింది. అదేవిధంగా రైతులకు మేలు చేసే సీఎం గిరి వికాసం వంటి పథకాలు నీరుగారి పోతున్నాయి. గిరిజన వద్ద నుంచి తమ దరఖాస్తులు వచ్చిన వాటి అమలుకు బడ్జెట్లు లేకపోవడంతో పథకం సరిగా అమలుకావడం లేదు. అంతేకాకుండా పాలకుల పట్టింపులేకపోవడంతో ఐటీడీఏ పాలన అంతంత మాత్రంగానే సాగుతోంది.

- ఐటీడీఏపై దృష్టి సారించని ప్రభుత్వాలు

ఐటీడీఏలపై ప్రభుత్వాలు చిన్నచూపుతాయన్న విమర్శలు గిరిజనుల వైపు నుంచి వినిపిస్తున్నాయి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఐటీడీఏల నిర్వహణ సక్రమంగా జరగలేదని పలు గిరిజన సంఘాలు విమర్శించాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోయి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై గిరిజనులు ఆశలు పెట్టుకున్నారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న ఐటీడీఏపై ధృష్టి పెట్టకపోవడంపై గిరిజనుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడితే ఐటీడీఏలను ప్రక్షాళన చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీడీఏలను విస్మరిస్తోందని గిరిజన సంఘాలు విమర్శిస్తున్నాయి. పంచాయతీరాజ్‌, స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క త్వరలోనే పాలకమండలి సమావేశాల నిర్వహణ చేపడుతామని చెపుతున్న కార్యాచరణకు నోచుకోవడం లేదు. ఏళ్లు గడస్తున్నా పాలకమండలి సమావేశాలు జరగకపోవడంతో ఐటీడీఏలో ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిమూడు నెలలకొకసారి సమావేశాల నిర్వహణ చేపట్టి లోటుపాట్లను గుర్తించి వాటిని పరిష్కరించే విధంగా కృషి చేయాల్సిన పాలకవర్గం ఆ దిశగా అడుగులు వేయలేకపోతుంది. దీంతో గిరిజనులు ఆశించిన మేర అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - Nov 30 , 2024 | 12:06 AM