ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అమల్లోకి పెరిగిన చార్జీలు..

ABN, Publish Date - Dec 15 , 2024 | 01:11 AM

ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థుల మెస్‌చార్జీలు, కాస్మెటిక్‌ చార్జీలను గత నెల 1వ తేదీన ప్రభుత్వం పెంచించింది. శనివారం నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఇక నుంచి విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందనున్నది.

విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న కలెక్టర్‌ కోయ శ్రీహర్ష,

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థుల మెస్‌చార్జీలు, కాస్మెటిక్‌ చార్జీలను గత నెల 1వ తేదీన ప్రభుత్వం పెంచించింది. శనివారం నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఇక నుంచి విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందనున్నది. ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ చార్జీలు పెరిగాయి. బహిరంగ మార్కెట్‌లో ఉన్న నిత్యావసర సరుకులు, కూరగాయలు, కోడిగుడ్లు, చికెన్‌, మాంసానికి అనుగుణంగా 40 శాతం మెస్‌ చార్జీలను, 200 శాతం వరకు కాస్మెటిక్‌ చార్జీలను పెంచడం వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 3 నుంచి 7వ తరగతి చదివే విద్యార్థులకు నెలకు 950 రూపాయలు ఇస్తుండగా, ప్రస్తుతం 1330 రూపాయలకు పెంచారు. 8 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు 1100 నుంచి 1540 రూపాయలకు పెంచారు. ఇంటర్‌ నుంచి పీజీ చదివే విద్యార్థులకు 1500 నుంచి 2100 రూపాయలకు పెంచారు. కాస్మెటిక్‌ చార్జీలను బాలికలకు 7వ తరగతి వరకు 55 నుంచి 175 రూపాయల వరకు, 11 సంవత్సరాల వయస్సు పైబడిన బాలికలకు 75 నుంచి 275 రూపాయలకు పెంచారు. దీంతో పెరిగిన చార్జీలతో విద్యార్థులకు ప్రయోజనం చేకూరనున్నది. బాలురకు 7వ తరగతి వరకు 62 నుంచి 150 రూపాయలకు, 11 సంవత్సరాల వయస్సు పైబడిన బాలురకు 62 నుంచి 200 రూపాయల వరకు పెంచారు. ఈ మెస్‌ చార్జీలకు అనుగుణంగా ప్రభుత్వం రూపొందించిన న్యూ కామన్‌ డైట్‌ మెనూను వివిధ గురుకుల విద్యాలయాల్లో ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అన్నయ్యగౌడ్‌, కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్‌ డి వేణు, ఆయా శాఖల అధికారులు ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి భోజనాలు చేశారు. రాష్ట్రంలో చివరగా ఎనిమిదేళ్ల క్రితం మెస్‌ చార్జీలను పెంచారు. ఆ తర్వాత నుంచి మెస్‌ చార్జీలు, కాస్మెటిక్‌ చార్జీలు పెరగక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎప్పుడో పెంచిన మెస్‌ చార్జీలు అమల్లో ఉన్నాయి. గడిచిన ఐదేళ్లలో నిత్యావసర వస్తువులు, కూరగాయలు, కిరాణ సరుకులు రెండు, మూడింతలు పెరిగినా కూడా విద్యార్థులకు ఇచ్చే మెస్‌ చార్జీలు మాత్రం పెరగలేదు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం లభించక తంటాలుపడ్డారు. గత ఏడాది మార్చిలో అన్ని విభాగాల్లోని వసతి గృహాలు, గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థులకు ఇచ్చే మెస్‌ చార్జీలను 25 శాతం పెంచుతున్నామని అప్పటి సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో విద్యార్థులు ఎంతో సంబరపడ్డారు. కానీ ఆ ప్రకటన అమల్లోకి రాలేదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పటివరకు అంతంత మాత్రంగానే ఉన్న గురుకుల విద్యాలయాల సంఖ్యను పెంచింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు చొప్పున బీసీ గురుకులాలు, ఒక మైనార్టీ, రెండు ఎస్సీ గురుకులాల విద్యాలయాలను మంజూరుచేసి ఏర్పాటు చేసింది. వీటితో పాటు సాధారణ వసతి గృహాలు, కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాల్లో చదివే విద్యార్థులకు ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనం, సాయంత్రం స్నాక్స్‌, పాలు, టీ అందజేసేందుకు ప్రభుత్వం మెస్‌ చార్జీలతో పాటు రూపాయికే కిలో బియ్యం అందజేసింది. ప్రభుత్వం ఇచ్చే మెస్‌ చార్జీలతో విద్యార్థులకు వంట చేసేందుకు గ్యాస్‌, కూరగాయలు, మాంసం, కోడిగుడ్లు, పండ్లు, కిరాణ సరుకులను కొనుగోలు చేసి నిర్ధేశించిన మెనూ ప్రకారం భోజనాలు, టిఫిన్లు, స్నాక్స్‌ పెట్టాల్సి ఉంటుంది. 3 నుంచి 7వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 950 రూపాయలు, 8 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 1100 రూపాయలు, ఇంటర్‌, డిగ్రీ, ఆపై చదువులు చదువుతున్న విద్యార్థులకు నెలకు 1500 రూపాయలు అందజేశారు. ఈ చార్జీలను 25 శాతానికి పెంచుతామని ప్రకటించారు. ఆ మేరకు 3 నుంచి 7వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 1200 రూపాయలు, 8 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 1400 రూపాయలు, ఇంటర్‌, డిగ్రీ, ఆపై చదువులు చదువుతున్న విద్యార్థులకు నెలకు 1875 రూపాయలు అందజేస్తామని ప్రకటించింది. కానీ అమల్లోకి తీసుకరాలేదు. ఈ విషయమై విద్యార్థి సంఘాల నాయకులు ఎన్నో పోరాటాలు చేశారు. ఎట్టకేలకు ప్రస్తుత ప్రభుత్వం 40 శాతం చార్జీలను పెంచింది. ఆ చార్జీలను శనివారం నుంచి అమల్లోకి తీసుకవచ్చారు. జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ ఆధ్వర్యంలో 8 గురుకులాలు, ఒక మినీ గురుకుల పాఠశాల నడుస్తున్నది. వీటిలో దాదాపు 5,600 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకులాలు 7 నడుస్తుండగా, వీటిలో 3,080 మంది విద్యార్థులు చదువుతున్నారు. మైనార్టీ గురుకుల విద్యాలయాలు 3 ఉండగా, వీటిలో 1054 మంది విద్యార్థులు చదువుతున్నారు. తెలంగాణ రెసిడెన్షియల్‌ స్కూళ్లు రెండు ఉండగా వాటిలో 680 మంది చదువుతున్నారు. ఇవేగాకుండా ఎస్సీ బాల, బాలికల హాస్టళ్లు 11 ఉండగా, వీటిలో 630 మంది వరకు విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. కళాశాల వసతిగృహాలు ఆరు నడుస్తుండగా, వీటిలో 520 మంది వరకు విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. బీసీ వసతి గృహాలు 6 ఉండగా వీటిలో 439 మంది విద్యార్థులు, కళాశాల స్థాయి వసతి గృహాలు 8 ఉండగా 770 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పెంచిన చార్జీలతో ఇక నుంచి విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందనున్నది.

ఫ పెంచిన చార్జీలతో పౌష్టికాహారం అందనున్నది..

- సంజన, ఇంటర్‌ విద్యార్థి, గర్రెపల్లి గురుకుల పాఠశాల

మెస్‌ చార్జీలు, కాస్మెటిక్‌ చార్జీలు పెంచడం వల్ల ఇక నుంచి మాకు పౌష్టికాహారం అందనున్నది. గత ఏడాదే పెంచినట్లు ప్రకటించారు. కానీ చార్జీలు పెరగలేదు. ప్రస్తుతం గురుకులాలపై చొరవ చూపుతున్నది. 40 శాతం మెస్‌ చార్జీలు, 200 శాతం వరకు కాస్మెటిక్‌ చార్జీలు పెంచడం వల్ల మాకు మరింత ప్రయోజనం చేకూరనున్నది. చాలా ఆనందంగా ఉంది.

ఫ మంచి ఫలితాలు సాధిస్తాం..

- సుదీప, 9వ తరగతి, గర్రెపల్లి గురుకుల పాఠశాల

ప్రభుత్వం పెంచిన చార్జీలతో మాకు మేలు జరగనున్నది. మెస్‌ చార్జీలు ఎప్పుడు పెంచుతారా అని ఎదురుచూశాం. కాస్మొటిక్‌ చార్జీలు కూడా ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ధరలకు అనుగుణంగా పెంచారు. కొత్తగా రూపొందించిన మెనూ కూడా బాగా ఉంది. ఇక నుంచి బాగా చదువుకుని మెరుగైన ఫలితాలను సాధిస్తాం.

ఫ చార్జీలు పెంచడం సంతోషం..

- వి విజ్ఞాన్‌, పదో తరగతి, జ్యోతిబా ఫూలే బీసీ గురుకులం, గోదావరిఖని

చార్జీలు పెంచడం సంతోషంగా ఉంది. గతంలో తక్కువ చార్జీలు ఉండడం వల్ల ఇబ్బంది పడ్డాం. గతంలో పెంచినట్లే పెంచి అమలు చేయలేదు. చార్జీలు పెంచాలని వినతి పత్రాలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం పెంచిన చార్జీలు శనివారం నుంచి అమల్లోకి తీసుకవచ్చింది. అలాగే కొత్త మెనూ కూడా బాగుంది.

ఫ గతంలో కాస్మెటిక్‌ చార్జీలు సరిపోయేవి కావు..

- అబ్దుల్‌ జునైద్‌, 9వ తరగతి, మైనార్టీ గురుకులం గోదావరిఖని

చాలా రోజుల తర్వాత మెస్‌ చార్జీలు, కాస్మెటిక్‌ చార్జీలు పెంచడం సంతోషంగా ఉంది. చార్జీలు పెంచని కారణంగా మెను సక్రమంగా అమలుకాలేదు. చార్జీలను 40 శాతం పెంచడం వల్ల పౌష్టికాహారం అందనున్నది. గతంలో ఇచ్చే కాస్మెటిక్‌ చార్జీలతో కటింగ్‌ చేసుకోవడానికి, సబ్బులకు అందరికీ 62 రూపాయలే ఇచ్చేవాళ్లు. అవి సరిపోక ఇంటి నుంచి డబ్బులు తెచ్చుకునే వాళ్లం. ఇప్పుడు 200 రూపాయలకు పెంచారు.

Updated Date - Dec 15 , 2024 | 01:11 AM