Lagacherla Incident: ప్రభుత్వ తీరు వల్లే లగచర్ల రచ్చ: డీకే అరుణ
ABN, Publish Date - Nov 14 , 2024 | 04:03 AM
ప్రభుత్వ తీరు వల్లే లగచర్ల ఘటన చోటు చేసుకుందని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. లగచర్లలో 144 సెక్షన్, శాంతిభద్రతల సమస్య ఎందుకొచ్చిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
వికారాబాద్/పూడూరు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ తీరు వల్లే లగచర్ల ఘటన చోటు చేసుకుందని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. లగచర్లలో 144 సెక్షన్, శాంతిభద్రతల సమస్య ఎందుకొచ్చిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నప్పుడు రైతులకు అర్థమయ్యే రీతిలో చెప్పి ఒప్పించి ప్రాజెక్టులు తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. వికారాబాద్ కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రతీక్‌జైన్‌ను బుధవారం కలిసిన ఆమె.. లగచర్ల ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికైనా సీఎం లగచర్లకు వెళ్లి రైతులకు భరోసా కల్పించాలని, వారు కోరుకునే పరిహారం అందించి ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు. పరిశ్రమలను ఎవరూ అడ్డుకోరని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే పరిశ్రమలు రావద్దన్నారు. అనంతరం లగచర్లకు వెళ్తున్న ఎంపీ అరుణను మన్నెగూడ వద్ద చెన్‌గోముల్ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - Nov 14 , 2024 | 04:03 AM