వుడా ఆవిర్భావం
ABN, Publish Date - Oct 21 , 2024 | 11:59 PM
జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీలు, 20 మండలాల పరిఽధిలోని 493 గ్రామ పంచాయతీలతో కలిసి వికారాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వుడా)ని ఏర్పాట్లు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
4 మునిసిపాలిటీలు.. 493 గ్రామ పంచాయతీలతో ఏర్పాటు..
వుడా చైర్మన్‌గా వ్యవహరించనున్న జిల్లా కలెక్టర్
వైస్ చైర్మన్‌గా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్
ఉత్తర్వులు జారీ చేసిన మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ
వికారాబాద్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీలు, 20 మండలాల పరిఽధిలోని 493 గ్రామ పంచాయతీలతో కలిసి వికారాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వుడా)ని ఏర్పాట్లు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో నాలుగు మునిసిపాలిటీలతో పాటు 585 గ్రామ పంచాయతీలు ఉండగా, వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మునిసిపాలిటీలతో పాటు 493 గ్రామ పంచాయతీలను అభివృద్ధి పరిచే విధంగా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేశారు. కొడంగల్ మండలంలో 17 గ్రామ పంచాయతీలు, వికారాబాద్‌లో 24, తాండూరులో 39, పరిగిలో 36, బొంరాస్‌పేట్‌లో 17, దుద్యాల్‌లో 12, కులకచర్లలో 16, బషీరాబాద్‌లో 31, మోమిన్‌పేట్‌లో 23, నవాబ్‌పేట్‌లో 22, ధారూరు మండల పరిధిలోని 34 గ్రామ పంచాయతీలను వుడా పరిధిలోకి చేర్చారు. దౌల్తాబాద్ మండలంలో 25, యాలాల్‌లో 33, బంట్వారంలో 13, కోట్‌పల్లిలో 18, పూడూరులో 34, మర్పల్లిలో 28, దోమలో 28, పెద్దేముల్‌లో 31, చౌడాపూర్ మండలంలో 14 గ్రామ పంచాయతీలను వికారాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి తీసుకువచ్చారు. అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి వచ్చే నాలుగు మునిసిపాలిటీలతో పాటు 493 పంచాయతీలను పట్టణాల్లో మాదిరిగా మౌళిక వసతులను కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పాటైన వికారాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్ధలు) వైస్ చైర్మన్‌గా, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ/ప్రిన్సిపల్ సెక్రటరీ/సెక్రటరీ లేదా వారి నామినీ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్/డైరెక్టర్ లేదా వారి నామినీ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ లేదా వారి నామినీ సభ్యులుగా వికారాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.
వుడా ఏర్పాటు హర్షణీయం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్, అక్టోబర్ 21 : వికారాబాద్ జిల్లా పూర్తిగా అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీగా ఏర్పాటు కావడం హర్షనీయమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వుడా ఏర్పాటు ద్వారా వికారాబాద్ జిల్లాలో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందన్నారు. ముఖ్యంగా మునిసిపాలిటీల పరిధిలో రవాణా సదుపాయాలు మెరుగుపర్చడంతో పాటుగా ట్రాఫిక్ సులభతరం చేయడానికి నూతనంగా ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించవచన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జిల్లా ప్రజల తరుపున ధన్యవాదాలు తెలిపారు.
Updated Date - Oct 21 , 2024 | 11:59 PM