ట్యాపింగ్ తొలి బాధితుణ్ని నేనే
ABN, Publish Date - Apr 08 , 2024 | 04:34 AM
ఫోన్ ట్యాపింగ్‌లో మొదటి బాధితుడిని నేనే. నా ఫోన్, నా కుటుంబసభ్యులు, డ్రైవర్, వంట మనుషుల నుంచి ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాప్ చేశారు. దాని వల్లే నేను ఈ పరిస్థితిలో ఉన్నా’ అని మల్కాజిగిరి బీజేపీ
దాని వల్లే ఈ పరిస్థితిలో ఉన్నా
భార్యాభర్తల సంభాషణలూ విన్నారు
ట్యాపింగ్ వల్ల కాపురాలు కూలాయి
కేసీఆర్ పీడపోవాలని కాంగ్రెస్‌కు
పట్టం.. వాళ్లదీ అదే తరహా పాలన
మీట్ ద ప్రెస్‌లో ఈటల రాజేందర్
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): ‘ఫోన్ ట్యాపింగ్‌లో మొదటి బాధితుడిని నేనే. నా ఫోన్, నా కుటుంబసభ్యులు, డ్రైవర్, వంట మనుషుల నుంచి ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాప్ చేశారు. దాని వల్లే నేను ఈ పరిస్థితిలో ఉన్నా’ అని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. అమీర్‌పేటలోని ఓ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన మీట్ ద ప్రెస్‌లో ఈటల మాట్లాడారు. కేసీఆర్ తన క్యాబినెట్ లోని 17 మంది మంత్రులను కూడా నమ్మలేదని.. వాళ్ల ఫోన్లు, భార్య భర్తల సంభాషణలు కూడా విన్నారని ఆరోపించారు. ట్యాపింగ్ వల్ల కాపురాలు కూలిపోయాయని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం గెలిచిన ఎమ్మెల్యేలను కాదని.. ఓడిన ఎమ్మెల్యేలతో ప్రారంభోత్సవాలు జరిపించిందని.. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తోందని పేర్కొన్నారు. కేసీఆర్ పీడ విరగడ కావాలని ప్రజలు కాంగ్రె్‌సకు ఓటేశారని.. అయితే వారు కూడా కేసీఆర్ పాలననే కొనసాగిస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని చెబుతున్న కాంగ్రెస్.. ఆరు గ్యారెంటీలు ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించారు. ధరణి సమస్యలు అలాగే ఉన్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని.. వీటిపై సమగ్ర దృష్టి పెట్టి రైతులను ఆదుకోవాలన్నారు. జర్నలిస్టుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎవరినీ వరించని అదృష్టం రేవంత్‌ను వరించిందని తెలిపారు. మోదీని పెద్దన్న అని పిలిచిన ఆయన.. ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని ఈటల అన్నారు.
17 సీట్లతో రాహుల్ ప్రధాని అవుతారా..?
రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని రేవంత్ చెప్పారని.. ఇప్పుడేమో తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రె్‌సను గెలిపిస్తే రాహుల్ ప్రధాని అవుతారని.. అప్పుడు అమలు చేస్తామని అంటున్నారని పేర్కొన్నారు. దేశంలో కాంగ్రె్‌సకు 60 సీట్లు కూడా దాటవని చెప్పారు. రాష్ట్రంలో 17 సీట్లిస్తే రాహుల్ ప్రధాని ఎలా అవుతారని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ 12కుపైగా సీట్లలో గెలుస్తుందన్నారు. కొడంగల్‌లో రేవంత్‌ను ఓడించిన పట్నం నరేందర్‌రెడ్డి కుటుంబీకులనే ఆయన మల్కాజిగిరి బరిలో దింపారని చెప్పారు. రాజీవ్ గాంధీ ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చారని.. రాహుల్ గాంధీ మరో అడుగు ముందుకేసి.. పార్టీ మారే వారు రాజీనామా చేయకుండా వస్తే వేటు వేస్తామని తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోలో చెప్పారని పేర్కొన్నారు. మరి కాంగ్రె్‌సలో చేరిన ఇతర పార్టీల వారు ఎంతమంది రాజీనామా చేశారని ప్రశ్నించారు. దేశం సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలంటే మోదీ మరోసారి ప్రధాని కావాలని ఈటల అన్నారు.
Updated Date - Apr 08 , 2024 | 04:34 AM