యాదగిరీశుడికి శాస్త్రోక్తంగా నిత్యపూజలు
ABN, Publish Date - Nov 21 , 2024 | 12:33 AM
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రంలో నిత్య పూజలు బుధవారం వైభ వంగా నిర్వహించారు.
భువనగిరి అర్బన్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రంలో నిత్య పూజలు బుధవారం వైభ వంగా నిర్వహించారు. సుప్రభాతంతో స్వామిఅమ్మవారిని మేల్కొల్పిన అర్చకులు గర్భగుడిలో కొలువుదీరిన స్వయంభువులను, సువర్ణ ప్రతిష్టామూర్తులను అభిషేకరించి తులసీ దళాలతో సహస్రనార్చనలు నిర్వహించారు. ప్రధానాలయం అష్టభుజి ప్రాకార మండపంలో స్వామిఅమ్మవారిని అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్ది సుదర్శన శతక పఠనాలతో హవనం నిర్వహించారు. అనంతరం గజవాహన సేవలో ఊరేగించి విశ్వక్సేనుడి తొలిపూజలతో నిత్య తిరుకల్యాణోత్సవ పర్వాలు ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. సాయంత్రం ముఖ మండపంలో దర్బారు సేవోత్సవం చేపట్టిన ఆచార్యులు అంకార వెండి జోడు సేవలు, సహస్రనార్చనలు నిర్వహిం చారు. పాతగుట్ట ఆల యంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ నిత్య పూజలు కొనసాగాయి. కొండపైన శివాలయంలో శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామికి రుద్రహవనం శైవాగమ పద్ధతిలో నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.26,38,814ల ఆదాయం సమ కూరినట్లు ఈవో ఏ. భాస్కర్‌రావు తెలిపారు. కార్తీక మాసం సంద ర్భంగా 618 జంటలు వ్రతాల్లో పాల్గొన్నాయి. మహిళా భక్తులు కార్తీక దీపారాధనలు చేశారు.
స్వామివారి సేవలో మంత్రి శ్రీధర్‌బాబు
ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్వామివారిని దర్శించుకున్నారు. గర్భాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ముఖ మండపంలోని ధ్వజస్థంభానికి మొక్కులు చెల్లించారు. వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో ఏ. భాస్కర్‌రావు మంత్రికి స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదాలు అందజేశారు.
Updated Date - Nov 21 , 2024 | 12:33 AM