Murali Akunuri: శభాష్ రంగనాథ్.. మంచి పని చేస్తున్నారు!
ABN, Publish Date - Aug 15 , 2024 | 07:01 PM
హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. ఆ సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ వెనకడుగు వేయకపోవడంపై మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి(Murali Akunuri) ప్రశంసించారు.
హైదరాబాద్: హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. ఆ సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ వెనకడుగు వేయకపోవడం పట్ల మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి(Murali Akunuri) ప్రశంసించారు. భాగ్యనగర వ్యాప్తంగా హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై మురళి గురువారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఏవీ రంగనాథ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతోపాటు ఓ పాలనపరమైన సూచన కూడ చేశారు.
భవిష్యత్తు తరాలకు..
"రంగనాథ్ శభాష్.. మంచి పని చేస్తున్నారు. అలాగే ముందుకు సాగండి. ప్రజాప్రతినిధులు చాలా మంది దీనిని సహజంగా తీసుకొని అడ్డగోలుగా ప్రభుత్వ, చెరువు శిఖం భూములను ఆక్రమిస్తున్నారు. గత పాలకులు మేం తింటాం మీరు తినండి అని అందరిని దొంగలుగా మార్చారు. లక్షల కోట్ల భూములను, ప్రాణాలను రక్షించే చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. భవిష్యత్తు తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలి" అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కి తెలంగాణ సీఎంవో, డీజీపీ అధికారిక ఎక్స్ అకౌంట్లను ట్యాగ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రంగనాథ్‌కి పూర్తి ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ఆయన కోరారు. మనం విధుల్లో పారదర్శకంగా ఉండడమే కాదు ఉన్నట్టు కూడా కనిపించాలని, ఇది రంగనాథ్‌కి తాను ఇస్తున్న అడ్మినిస్ట్రేటివ్ టిప్ అని ఎక్స్‌లో రాసుకొచ్చారు. ముఖ్యమంత్రి హైడ్రాని మరింత బలోపేతం చేయాలని ఆయన కోరారు. దీంతో పాటు మురళి తన ఎక్స్ పోస్ట్‌లో ఆంధ్రజ్యోతి ప్రచురితమైన వార్తను షేర్ చేశారు.
కూల్చివేతలపై అభ్యంతరాలు..
హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా వ్యతిరేకిస్తున్నారు. ఆగస్టు 13న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆ సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథపై తీవ్ర విమర్శలు చేయగా, నిన్న ఎంఐఎం కార్పొరేటర్లు హైడ్రా తీరుపై మేయర్, కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ ఏజెన్సీని రద్దు చేయాలని కౌన్సిల్లో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని మజ్లిస్ కార్పొరేటర్లు బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలి కాటలను కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతో ఇన్నాళ్లూ దూకుడుగా వ్యవహరించిన హైడ్రా.. ఇప్పుడు ఏం చేయనుందన్నది చర్చనీయాంశంగా మారింది. చెరువులు, పార్కులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) ఏర్పాటు చేసింది. ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ) స్థాయి ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్‌ని కమిషనర్‌గా నియమించింది.
Updated Date - Aug 15 , 2024 | 07:19 PM