ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hospitals: జిల్లాల్లో ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రాలు

ABN, Publish Date - Oct 16 , 2024 | 03:58 AM

రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంతాన సాఫల్య సేవలు (ఐవీఎఫ్‌) అందుబాటులోకి వచ్చాయి. గాంధీ దవాఖానలోని ఫర్టిలిటీ సెంటర్‌లో ఐవీఎఫ్‌ సౌకర్యాన్ని ఆరోగ్యశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.

  • దశలవారీగా ఏర్పాటు.. గాంధీలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి ..

  • ప్రైవేటు దవాఖానాల్లో రూ. లక్షల వసూలు

  • సంతానలేమి దంపతులకు వరంగా సర్కారీ నిర్ణయం

హైదరాబాద్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంతాన సాఫల్య సేవలు (ఐవీఎఫ్‌) అందుబాటులోకి వచ్చాయి. గాంధీ దవాఖానలోని ఫర్టిలిటీ సెంటర్‌లో ఐవీఎఫ్‌ సౌకర్యాన్ని ఆరోగ్యశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పాటుగా హైదరాబాద్‌లో మరో రెండు, వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం వంటి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనూ ఫర్టిలిటీ సెంటర్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతులకు సంతాన సాఫల్య కేంద్రాలు వరంగా మారనున్నాయి. రూ. లక్షలు ఖర్చయ్యే ఐవీఎఫ్‌ సేవలు ఉచితంగా అందనున్నాయి. రాష్ట్రంలో సంతాన సమస్యలతో బాధపడే యువ జంటల సంఖ్య సాధారణం కంటే ఎక్కువగా ఉంటోంది. ప్రతి వంద జంటల్లో 30-40 జంటలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్‌ఫర్టిలిటీకి చికిత్స అందించే సౌకర్యాలు లేకపోవడం, ప్రైవేటు దవాఖానాల్లో రూ. లక్షలు వసూలు చేస్తుండడంతో ఎంతో మంది మానసికంగా, ఆర్థికంగా కుంగిపోతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బ్రహ్మోత్సవాల సందర్భంగా చిలుకూరి బాలాజీ ఆలయంలో ఇచ్చే గరుడ ప్రసాదం స్వీకరిస్తే సంతానం కలుగుతుందని అక్కడి పూజారులు చెబితే, ఏకంగా ఒకే రోజు లక్ష మంది మహిళలు ప్రసాదం కోసం ఆ గుడికి పోటెత్తారంటే రాష్ట్రంలో సమస్య తీవ్రత ఎంతుందో అర్థం చేసుకోవచ్చు.


జిల్లా ఆస్పత్రుల్లో ఐవీఎఫ్‌ కేంద్రాలు

ప్రస్తుతం స్త్రీ, పురుషులిద్దరిలోనూ సంతాన సమస్యలు బాగా పెరిగాయి. అందుకు ప్రధాన కారణం మారిన జీవనశైలి. పిల్లలు పుట్టకపోవడంతో కొత్త జంటలు మానసిక వేదనకు లోనవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే నాటి బీఆర్‌ఎస్‌ సర్కారు ప్రభుత్వ దవాఖానాల్లో ఫర్టిలిటీ సెంటర్లు పెడతామని 2017లో ప్రకటించింది. అయితే 2023 వరకు ఒక్క గాంధీలో మాత్రమే ఫర్టిలిటీ సెంటర్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్టోబరులో అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఈ కేంద్రాన్ని హడావుడిగా ప్రారంభించారు. కానీ అక్కడ ఒక్కరికి కూడా ఐవీఎఫ్‌ చేయలేదు. సామగ్రి, మందులు లేకపోవడం ఎంబ్రయాలజిస్టును నియమించకపోవడమే ఇందుకు కారణం. నెల రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో పర్యటించిన ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి ఈ విషయాన్ని అధికారులు తీసుకొచ్చారు. దీంతో ఆయన ఎంబ్రయాలజిస్టును నియమించాలని, సామగ్రి, మందులు కొనుగోలు చేయాలని ఆరోగ్య కార్యదర్శిని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫర్టిలిటీ, ఐవీఎఫ్‌ సేవలను అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. గాంధీతో పాటు పేట్లబుర్జు ఆస్పత్రి, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లోనూ ఐవీఎఫ్‌ కేంద్రాల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ సెంటర్లు ప్రారంభించాక మిగిలిన ఉమ్మడి జిల్లా కేంద్రాలకూ ఫర్టిలిటీ, ఐవీఎఫ్‌ సేవలను విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉందని చెబుతున్నారు.


దంపతుల్లో పెరుగుతున్న అవగాహన

కనీసం ఏడాది పాటు లైంగిక జీవితం గడిపినా.. గర్భం దాల్చకపోతే ఇన్‌ఫర్టిలిటీ సమస్య ఉన్నట్టుగా డాక్టర్లు చెబుతున్నారు. మన దేశంలో ఈ సమస్య వేగంగా పెరుగుతోంది. అయితే ఇంతకుముందు సంతానలేమి సమస్యకు మహిళలను మాత్రమే కారణంగా చూపేవారని, ఇప్పుడు పెరిగిన అవగాహనతో సమస్య ఎవరిలో ఉందో తెలుసుకోవడం కోసం పురుషులు కూడా ముందుకు వస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు.

రూ. లక్షలు వసూలు చేస్తున్న ప్రైవేటు కేంద్రాలు

ప్రైవేటు ఆసుపత్రులు మార్కెటింగ్‌ జిమ్మిక్కులతో బాధిత దంపతులను మభ్యపెట్టి లక్షల్లో దండుకుంటున్నాయి. కొంత మంది డాక్టర్లు సమస్య తీవ్రతను అర్థం చేసుకుని వందల సంఖ్యలో ఫర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసుకుని రూ. లక్షలు దండుకుంటున్నారు. సంతానలేమి సమస్య ప్రభుత్వ దవాఖానాల్లో అసలు ఫర్టిలిటీ చికిత్స అందుబాటులో లేకపోవడం వీరికి మరింత కలిసొచ్చింది. ఫర్టిలిటీ చికిత్స పేరిట ప్రత్యేక ప్యాకేజీలు పెట్టి మరీ బాధితుల వద్ద రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. రూ.50-80 వేల మధ్యలో పూర్తయ్యే ఐవీఎఫ్‌ చికిత్సకు, రూ.3-6 లక్షల మధ్య వసూలు చేస్తున్నారు. ఇంత ఖర్చు చేస్తున్నా.. సగం మందికి ఫలితం దక్కడం లేదు. ఈ దందాపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని సంతానలేమి దంపతులు కోరుతున్నారు.

Updated Date - Oct 16 , 2024 | 03:58 AM