Weather Update: తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక.. రేపు, ఎల్లుండి జాగ్రత్త
ABN, Publish Date - Apr 24 , 2024 | 05:27 AM
ఇంకా మే నెల రాలేదు కానీ.. దేశంలో ఎండలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకోవడంతో వడగాలులు వీస్తున్నాయి. తెలంగాణలోనూ...
రేపట్నుంచి వడగాలులు
గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని 9 జిల్లాలకు అలర్ట్
నల్లగొండ జిల్లా టిక్యా తండాలో 45.1 డిగ్రీలు
ఐదు రోజులపాటు దేశమంతటా వడగాలులు
భారత వాతావరణ శాఖ హెచ్చరిక
పోలింగ్ శాతంపై ప్రభావం చూపే అవకాశం
వేసవి ఆరంభంలోనే నీటి కష్టాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 22 రాష్ట్రాల్లో
అడుగంటుతున్న జలాశయాలు
దక్షిణాదిలో ఏడు జలాశయాలు ‘డెడ్ జోన్’కు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
ఇంకా మే నెల రాలేదు కానీ.. దేశంలో ఎండలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకోవడంతో వడగాలులు వీస్తున్నాయి. తెలంగాణలోనూ పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని 9 జిల్లాల్లో వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. వడగాలులకు సంబంధించి గురు, శుక్రవారాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేయగా... శనివారం మాత్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాగా బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక, నల్లగొండ జిల్లా టిక్యా తండాలో మంగళవారం అత్యధికంగా 45.1 డిగ్రీలు నమోదైంది. భద్రాచలంలో 44.9 నల్గొండ జిల్లా బుగ్గబాయి గూడ, ములుగు జిల్లా మల్లూరులో 44.5, నల్గొండ జిల్లా తిమ్మాపూర్‌లో 44.4, అదే జిల్లా తిర్మలగిరి, ఇబ్రహీంపేట, ఖమ్మం జిల్లా కల్లూరులో 44.2, వనపర్తి జిల్లా పానగల్‌లో 44.3, సూర్యాపేట జిల్లా నూతనకల్‌లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో, సికింద్రాబాద్ న్యూ మెట్టుగూడలో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజుల పాటు ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, సాయంత్రం, రాత్రి వేళల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశముంటుందన్నారు. నగరంలో ఎండల ప్రభావంతో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఇక, వడదెబ్బ వల్ల మంగళవారం రాష్ట్రంలో ఐదుగురు మరణించారు. వికారాబాద్ జిల్లా మాదిరెడ్డిపల్లికి చెందిన కుమ్మరి కిష్టయ్య(57), సూర్యాపేట జిల్లా కోటి నాయక్ తండాకు చెందిన ధరావత్ గోలియా(70), రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బాలరాజుపల్లికి చెందిన నాగుల బాలయ్య(55), పెద్దపల్లి జిల్లా విలోచవరం గ్రామానికి చెందిన అక్కపాక లక్ష్మి(55), ములుగు జిల్లా మహ్మద్‌గౌస్ పల్లికి చెందిన చింతల రాజు(36) చనిపోయారు.
ఐదు రాష్ట్రాలకు వడగాలుల హెచ్చరిక
వచ్చే ఐదు రోజులు దేశ మంతటా వడగాలుల ప్రభావం ఉంటుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) తెలిపింది. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో (పశ్చిమబెంగాల్, కర్ణాటక, ఒడిసా, ఉత్తరప్రదేశ్, బిహార్) వడగాలులు తీవ్రం కానున్నాయని హెచ్చరించింది. తెలంగాణ, ఏపీ సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే 40-45 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయని పేర్కొంది. రానున్న ఐదు రోజులపాటు వడగాలులు కొనసాగుతాయని, రాత్రి వేళ కూడా వేడి వాతావరణ నెలకొంటుందని హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని.. కర్ణాటక, ఒడిసా, ఉత్తరప్రదేశ్, బిహార్‌లో నిర్దిష్ట సమయాల్లో వడగాలుల వీస్తాయని పేర్కొంది. రానున్న రెండు రోజుల్లో వాయవ్య భారతంలో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో స్వల్ప మార్పులు చేసుకుంటాయని, ఆ తర్వాత క్రమంగా 2 నుంచి 4 డిగ్రీలు పెరుగుతాయని తెలిపింది. ఈశాన్య అసోం, ఈశాన్య బంగ్లాదేశ్‌లో తుఫాను వాతావరణం నెలకొందని, ఫలితంగా అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, సిక్కిం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. కాగా, ఎండల దెబ్బ ఈ నెల 26న జరిగే రెండో ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. వడగాలులపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో శుక్రవారం జరిగే పోలింగ్‌లో ఓటింగ్ శాతం తగ్గుతుందని ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.
Updated Date - Apr 24 , 2024 | 12:07 PM