Harish Rao: రేవంత్‌కు కేసీఆర్ భయం..
ABN, Publish Date - Nov 21 , 2024 | 04:16 AM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసీఆర్ అంటే భయం పట్టుకుందని, అందుకే వరంగల్ సభలో మాజీ సీఎం పేరును 50 సార్లు ప్రస్తావించారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.
వరంగల్ సభలో 50 సార్లు ప్రస్తావన
రాష్ట్రంలో బీఆర్‌యూ ట్యాక్స్
ప్రతి బిల్లుపై 8-10 శాతం వసూళ్లు
మోసం చేయడం, మాట తప్పడం
రేవంత్‌రెడ్డి డీఎన్‌ఏలోనే ఉంది
పాలమూరు పర్యటనలో హరీశ్‌రావు
మహబూబ్‌నగర్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసీఆర్ అంటే భయం పట్టుకుందని, అందుకే వరంగల్ సభలో మాజీ సీఎం పేరును 50 సార్లు ప్రస్తావించారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో బీ.ఆర్.యూ(బ్రూ) ట్యాక్స్ అమలవుతోందని, ప్రతీ బిల్లుకు 8 నుంచి 10 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఇల్లు నిర్మాణం చేపడితే ఆర్ ట్యాక్స్ పేరిట వసూళ్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో బుధవారం పాల్గొన్న హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు. కురుమూర్తి స్వామి మీద ఒట్టు పెట్టి పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తానన్న రేవంత్‌రెడ్డి ఇప్పటికీ సగం మంది రైతులకు మాఫీ చేయలేదన్నారు. పాలకుడు చేసిన పాపం ప్రజలకు చుట్టుకోకూడదని ఆయన ఒట్టు వేసిన దేవాలయాల్లో తాము పూజలు చేస్తున్నామని వివరించారు. మోసం చేయడం, మాట తప్పడం, అబద్ధాలాడటం రేవంత్ డీఎన్‌ఏలోనే ఉందని విమర్శించారు. వరంగల్ సభలో 45 నిమిషాలు ప్రసంగించిన ముఖ్యమంత్రి.. రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన తొమ్మిది హామీలను ప్రస్తావించకుండా 50 సార్లు కేసీఆర్ పేరు యాదికి చేసుకున్నారని అన్నారు. ఎన్నో త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పేరును కనుమరుగు చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు.
రేవంత్ పొందిన పీసీసీ, సీఎం పదవులు కేసీఆర్ భిక్షేనని అన్నారు. అయితే ఒట్లు లేకపోతే తిట్టు అన్నచందంగా రేవంత్ రెడ్డి పాలన తయారైందని ఎద్దేవా చేశారు. రైతు భరోసా, పంటలకు బోనస్, రుణమాఫీ, కూలీలు, కౌలు రైతులకు సాయం ఇలా ఏ హామీ అమలు కాలేదని గుర్తు చేశారు. పాలమూరుకు ఉన్న మంచి పేరును సీఎం రేవంత్ చెడగొడుతున్నారని దుయ్యబట్టారు. రైతుబంధు, కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్, బీసీ బంధు, దళిత బంధు, గొర్రెపిల్లలు, చేపపిల్లల పంపిణీ కార్యక్రమాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి మెడలు వంచి ఆరు గ్యారంటీలను అమలు చేయిస్తామని స్పష్టం చేశారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ పీఆర్‌ఎల్‌ఐ ప్రాజెక్టును పడావు పెట్టారని, ఈ ఏడు వరదలు వచ్చినా నీరంతా సముద్రం పాలైందని హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర మహిళలకు ఇచ్చిన హామీ మేరకు రూ.2500 ఇవ్వలేకపోయిన రేవంత్ రెడ్డి.. మహారాష్ట్ర పోయి అక్కడి మహిళలకు రూ.3వేలు ఇస్తామని అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కలుపు మొక్క కాదని, కల్పవృక్షమని, ప్రతిపక్షాలపై పగ సాధిస్తూ రేవంత్ ప్రజలను దగా చేస్తున్నారని తెలిపారు. శబ్దం ఎక్కువ, విషయం తక్కువలా పరిస్థితి తయారైందని అన్నారు. ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదని, పత్తికి మద్దతు ధర లభించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు సరిగ్గా లేవని ఎక్సైజ్ శాఖ అధికారులకు నోటీసులిచ్చారని, ప్రజలతో మద్యం తాగించడమే పరిపాలనా ? అని ప్రశ్నించారు. రూ.లక్ష కోట్లతో విద్యుత్ వ్యవస్థను కేసీఆర్ బాగుచేస్తే 11 నెలల్లో ఒక్క ట్రాన్స్‌కోకే నలుగురు సీఎండీలను మార్చారని విమర్శించారు.
Updated Date - Nov 21 , 2024 | 04:16 AM