KCR: వచ్చేది హంగ్.. మనమే కింగ్
ABN, Publish Date - Apr 29 , 2024 | 05:37 AM
కేంద్రంలో వచ్చేది హంగ్..! ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం లేదు..! హంగ్ వస్తే.. మనమే కింగ్ అవుతాం. నరేంద్ర మోదీకి 200 సీట్లకు మించి రావు.
ఈ మోకాను వదలొద్దు.. 14-15 సీట్లివ్వండి
కేంద్రంలో చక్రం తిప్పేది మనమే
పేగులు తెగేదాకా కొట్లాడేది మనమే
జైళ్లకు.. తోకమట్టకు నేను భయపడతానా?
భయపడి ఉంటే తెలంగాణ వచ్చేదా??
నా గుడ్లు పీకుతాడట.. చెడ్డీ లాక్కొంటాడట
ఇదేనా సీఎం మాట్లాడే భాష?
వరంగల్ రోడ్‌షోలో బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్
ఘన్‌పూర్‌కు మూణ్నెల్లలో ఉప ఎన్నికని వ్యాఖ్య
బీజేపీ చెప్పినట్లు అచ్చేదిన్ కాదు.. సచ్చేదిన్
గోదావరి నీళ్లను తరలించే కుట్ర.. మోదీపై ఫైర్
వరంగల్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘కేంద్రంలో వచ్చేది హంగ్..! ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం లేదు..! హంగ్ వస్తే.. మనమే కింగ్ అవుతాం. నరేంద్ర మోదీకి 200 సీట్లకు మించి రావు. ఈ మోకా(అవకాశం)లో తెలంగాణలో 14-15 ఎంపీ సీట్లిస్తే.. పేగులు తెగేదాకా కొట్లాడేది మనమే’’ అని బీఆర్‌ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. కేంద్రంలో కీలకంగా మారితే.. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడవచ్చని వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి ఆయన హనుమకొండ చౌరస్తాలో జరిగిన బీఆర్‌ఎస్ రోడ్ షోలో మాట్లాడారు. గోదావరి నీళ్లను తమిళనాడు, కర్ణాటకకు తరలించేందుకు ప్రధాని మోదీ కుట్రలు చేస్తున్నారని, ఆ మేరకు నోటీసులు పంపితే.. రాష్ట్ర ప్రభుత్వం నోరుమూసుకుని కూర్చోవడంలో మతలబేంటని ప్రశ్నించారు. ‘‘ఇప్పటికే కృష్ణా నీళ్లను కేఎంబీఆర్‌కు అప్పగించారు. బీజేపీకి ఓటేస్తే మోసపోతాం. కాంగ్రెస్ వాగ్దానాలను నిలబెట్టుకోలేదు’’ అని విమర్శించారు. ప్రజల తరఫున కొట్లాడే పంచ్ ఎవరు? అని కేసీఆర్ ప్రశ్నించగా.. ప్రజలు ముక్తకంఠంతో ‘‘మీరే..’’ అని బదులిచ్చారు. దానికి కేసీఆర్ స్పందిస్తూ.. ‘‘మొన్న ఎలక్షన్లలో నన్ను పడగొట్టారు. ఇప్పుడు మళ్లీ ‘పంచ్’ అవ్వమంటారా? అయితే.. మీరు బలం ఇస్తేనే నేను కొట్లాడతా. వచ్చే ఎన్నికల్లో సుధీర్‌కుమార్‌ను గెలిపించాలి’’ అని కోరారు. బీజేపీ ప్రమాదకరమైన పార్టీ అని.. పదేళ్ల కింద నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి, జన్‌ధన్ ఖాతాల్లో ప్రతి ఒక్కరికీ రూ.15 లక్షల చొప్పున జమచేస్తానని హామీ ఇచ్చారని.. అది జరగలేదని విమర్శించారు. అమృత్‌కాల్.. అచ్చేదిన్ రాలేదని, సచ్చేదిన్ మాత్రం వచ్చిందని ఎద్దేవా చేశారు. కాజీపేటకు కోచ్‌ఫ్యాక్టరీ వస్తే.. దాన్ని ప్రధాని తన సొంత రాష్ట్రానికి తరలించారని మండిపడ్డారు. రూపాయి విలువ దారుణంగా పడిపోయిందని, 18లక్షల కేంద్ర ప్రభుత్వోద్యోగాలు ఖాళీగా ఉంటే.. భర్తీ చేయడం లేదని ఆరోపించారు.
సీఎం రేవంత్‌పై ఆగ్రహం
కేసీఆర్ సీఎం రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు హామీలపై నిలదీస్తే.. కేసీఆర్.. నీ గుడ్లు పీకి గోలీలు ఆడుకుంటా అన్నాడు. పేగులు తీసి మెడలో వేసుకుంటా అన్నాడు. ఆఖరికి నా చెడ్డీ కూడా గుంజుకుంటా అన్నాడు. నేను పదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడానా? నా నోట ఇలాంటి మాటలు ఎప్పుడైనా విన్నారా? ఇదేనా సీఎం మాట్లాడే భాష??’’ అని నిలదీశారు. తనను చర్లపల్లి జైలులో వేస్తానని సీఎం అంటున్నారని గుర్తుచేశారు. ‘‘గీ జైళ్లకు.. తోకమట్టకు నేను భయపడతానా? కేసీఆర్ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ కోసం ఎన్ని దెబ్బలు తిన్నాం? ఎన్ని నిరాహార దీక్షలు చేశాం? ఎన్ని రాజీనామాలు చేశాం? ఎన్నిసారు పదవులను ఎడమకాలి చెప్పులా విసిరేశాం? మేంగిట్ల భయపడి ఉంటే.. తెలంగాణ వచ్చేదా?’’ అని ప్రశ్నించారు. రేవంత్‌కు తెలంగాణ చరిత్ర, భూగోళం తెలియదని.. ఇటీవల ఎక్కడో మాట్లాడుతూ కృషానదిని కూడా తానే కట్టినట్లు చెప్పారని, ఎక్కడైనా ఎవరైనా నదులను కడతారా? అని ప్రశ్నించారు. రేవంత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలింగ్ జరిగిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమం అయిపోలేదని, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మరో ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ హామీలపై నిలదీత
‘‘ఓ మహిళ ఏరికోరి మొగుడిని తెచ్చుకుంటే.. ఎగిరెగిరి తన్నిండంట..! అడ్డగోలుగా హామీలిచ్చిన కాంగ్రె్‌సను నమ్మి ఓటేస్తే దేఏ జరుగుతోంది. నాలుగు నెలల్లో తెలంగాణకు ఏం జబ్బు చేసింది? కరెంటు ఎక్కడికి పోయింది? సాగునీళ్లు ఏమయ్యాయి? పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి? తాగునీటికి ఎందుకు కరువొచ్చింది? పదేళ్లలో ఇవన్నీ ఉండేవా? కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్క హామీని కూడా అమలు చేయలేదు’’ అని విమర్శించారు. రైతుబంధు వస్తుందా? మహిళలకు రూ.2,500 ఇస్తున్నారా? అని ప్రజలను ప్రశ్నించారు. తాము రూ.30 వేల కోట్లతో రూ. లక్ష వరకు రుణమాఫీ చేశామని, కాంగ్రెస్ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు.
మూణ్నెల్లలో ఉప ఎన్నిక
కడియం శ్రీహరి చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితాన్ని సమాధి చేసుకున్నారని కేసీఆర్ విమర్శించారు. ఇంకో మూణ్నెల్లలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాక తప్పదన్నారు. రాజయ్య ఎమ్మెల్యే కాక తప్పదని పేర్కొన్నారు.
నేడు, రేపు ఉమ్మడి ఖమ్మంలో..
కేసీఆర్ బస్సుయాత్ర సోమ, మంగళవారాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరగనుంది.
Updated Date - Apr 29 , 2024 | 06:40 AM