Hyderabad : ఎల్లమ్మ ఆలయం వద్ద తోపులాట!
ABN, Publish Date - Jul 10 , 2024 | 06:38 AM
బల్కంపేటలో మంగళవారం జరిగిన రేణుకా ఎల్లమ్మ కల్యాణానికి ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించేందుకు....
పొన్నంకు తగిలిన క్యూలైన్ రాడ్.. తూలిపడబోయిన విజయలక్ష్మి
వెనక్కి వచ్చేసి రోడ్డు డివైడర్‌పై కూర్చున్న మంత్రి, మేయర్
పొన్నం అలిగినట్లుగా సోషల్ మీడియాలో కొందరి పోస్టులు
ట్రోలింగ్‌పై పొన్నం ఫైర్.. పోస్టులు పెట్టిన వారిపై చర్యలకు ఆదేశం
అమీర్‌పేట, హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, జూలై 9 (ఆంధ్రజ్యోతి): బల్కంపేటలో మంగళవారం జరిగిన రేణుకా ఎల్లమ్మ కల్యాణానికి ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించేందుకు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి వచ్చిన సమయంలో ఆలయం వద్ద తోపులాట జరిగింది. ఉదయం 10 గంటలకు పొన్నం, విజయలక్ష్మి ఆలయ ప్రవేశ ద్వారం వద్దకు రాగా అప్పటికే అక్కడ 300-400 మంది భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఈ క్రమంలో మంత్రి, మేయర్ లోపలికి వెళుతుండగా భక్తులు కూడా లోపలికి వెళ్లేందుకు ముందుకు కదలడంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పొన్నం, విజయలక్ష్మి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కిక్కిరిసిన జనం మధ్య పొన్నంకు క్యూ లైన్ రాడ్ తగిలింది.
మేయర్ విజయలక్ష్మి కింద పడినంత పనైంది. లోపలికి వెళ్లే వీలులేకపోవడంతో పొన్నం, విజయలక్ష్మి ఆలయం బయటకొచ్చి రోడ్డు డివైడర్ మీద కూర్చున్నారు. ప్రొటోకాల్ పాటించడం కూడా చేతకాదా? అంటూ దేవాలయ నిర్వాహకులపై ఆగ్రహం పొన్నం వ్యక్తం చేశారు.
ప్రధాన ద్వారం వద్ద పోలీసులు కూడా సరిగ్గా లేకపోవడంతో ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫోన్ చేయగా వారు సరిగ్గా స్పందించలేదు. దీంతో నగర కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. కలెక్టర్ అనుదీ్‌పపై అసహనం వ్యక్తం చేశారు. ఓ మంత్రికి రక్షణ కల్పించలేనప్పుడు మిగతా భక్తులకు భద్రత ఎక్కడ ఉంటుందంటూ కలెక్టర్‌ను ప్రశ్నించారు. అధికారులు నచ్చజెప్పడంతో మంత్రి, మేయర్ ఆలయంలోకి వెళ్లి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అంతకుముందు తోపులాట ఘటన తర్వాత ఆలయం బయటకొచ్చి డివైడర్‌పై అలిసిపోయి కూర్చున్న పొన్నంపై సోషల్ మీడియాలో కొందరు ట్రోల్స్ చేశారు.
శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకే
బల్కంపేట ఎల్లమ్మ ఆలయ ప్రవేశద్వారం వద్ద జరిగిన తోపులాట ఘటన వెనుక కుట్ర కోణం ఉందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ఆలయానికి వచ్చిన సమయంలో అక్కడ కొందరు రాజకీయ ప్రేరేపిత అల్లరిమూకలు ఉద్దేశపూర్వకంగా తోపులాటకు దిగి శాంతిభద్రతల సమస్యను తలెత్తేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు. తోపులాట ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరునూ ఆమె తప్పుబట్టారు. ఈ ఘటనలో పోలీసు శాఖ నిర్లక్ష్యం బయటపడిందని పేర్కొన్నారు. ఆలయం వద్ద తోపులాట ఘటన నేపథ్యంలో మంత్రులు కొండా, పొన్నం మంగళవారం సాయంత్రం ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడారు. ఉత్సవాలకు వేల సంఖ్యలో వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిచేందుకుగాను సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు వరుస సమావేశాలు నిర్వహించామని పేర్కొన్నారు. అన్నిరకాలుగా ముందస్తు చర్యలు తీసుకున్నా... ఈ తరహా ఘటన జరగడం సరైంది కాదని పేర్కొన్నారు. పోలీసు శాఖ అత్యుత్సాహం కారణంగా భక్తులకు కలిగిన ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయన్నారు. ప్రభుత్వ ప్రతిష్ఠను మసకబర్చేందుకు ఎవరు ప్రయత్నించినా సహించేది లేదని స్పష్టం చేశారు.
తొక్కిసలాట చోటుచేసుకున్నప్పుడు అక్కడ విధుల్లో ఉన్న పోలీసుల సమాచారాన్ని మంత్రులు అడిగి తెలుసుకున్నారు. జరిగిన లోటుపాట్లపై సమీక్ష చేపట్టాలని, ఘటనపై 24 గంటల్లో నివేదిక అందజేయాలని పోలీసు ఉన్నతాధికారులను సురేఖ ఆదేశించారు. తొక్కిసలాట సమయంలో ఓ మహిళా జర్నలిస్టును డ్యూటీలో ఉన్న ఎస్సై దుర్భాషలాడినట్లుగా తన దృష్టికి వచ్చిందని, విచారణ చేపట్టి సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
దురుద్దేశంతో ట్రోలింగ్: మంత్రి పొన్నం
ఎల్లమ్మ ఆలయ ప్రవేశద్వారం వద్ద తోపులాట ఘటన తర్వాత ఆలయం నుంచి బయటకొచ్చిన తాను సేదతీరేందుకు ఓ గద్దెపై కూర్చున్నానని, అయితే మంత్రి అలిగి దేవాలయం బయట కూర్చున్నారంటూ సోషల్ మీడియాలో కొందరు దురుద్దేశంతో కూడిన పోస్టులు పెట్టారని పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
తొక్కిసలాట అనంతరం ఆలయం వద్ద, సచివాలయంలో సమీక్ష సందర్భంగా పొన్నం మాట్లాడారు. తోపులాట సందర్భంగా ఒకదశలో మేయర్ కిందపడబోయారని మంత్రి పేర్కొన్నారు. మహిళలు ఇబ్బందులు పడటం చూసే అధికారులపై తాను సీరియస్ అయ్యానన్నారు. తోపులాటను నివారించేందుకు తాను కొద్దిసేపు ఆగానని చెప్పారు. ఆలయం వద్ద ఓ మహిళా రిపోర్టర్‌కు ఎదురైన చేదు అనుభవానికి తాను క్షమాపణ చెబుతున్నానన్నారు.
అసభ్యకర వీడియోలపై సీసీఎ్‌సలో మేయర్ ఫిర్యాదు
సామాజిక మాధ్యమాల్లో తనపై అసభ్యకరమైన, ఫేక్ వీడియోలు పోస్ట్ చేశారంటూ జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి మంగళవారం సైబర్ క్రైమ్ స్టేషన్(సీసీఎ్‌స)లో ఫిర్యాదు చేశారు. వ్యక్తిత్వ హననం, వ్యక్తిగత ప్రతిష్ఠ దిగజార్చేలా వీడియోలున్నాయన్నారు. ఎక్స్, ఫేస్‌బుక్‌లో వీడియోలు పోస్ట్ చేసిన వారి ఐడీలను ఫిర్యాదులో పేర్కొన్నారు.
Updated Date - Jul 10 , 2024 | 06:38 AM