TG Assembly: అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్.. ఎందుకంటే
ABN, Publish Date - Dec 16 , 2024 | 11:33 AM
Telangana: సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా గోస పెడుతున్నారని తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గవర్నర్‌ను వెళ్లి కలవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. 19 గ్రామ పంచాయితీలకి అవార్డు తెచ్చిన ఘనత కేసీఆర్ ది అని తెలిపారు. అయితే హరీష్ రావు ప్రసంగానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 16: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly session) సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన తర్వాత సర్పంచుల పెండింగ్ బిల్లుల అంశం సభలో చర్చకు వచ్చింది. ఈ అంశంపై సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. అయితే మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపిటీసీలకు పెండింగ్ బిల్లులు చెలించడంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రానందుకు నిరసనగా అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల (BRS MLAs) వాకౌట్ చేశారు.
ABN Live..: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
వారికిచ్చిన శిక్షణ ఇదేనా.. హరీష్‌రావు ఫైర్
సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా గోస పెడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) అన్నారు. గవర్నర్‌ను వెళ్లి కలవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. 19 గ్రామ పంచాయితీలకు అవార్డు తెచ్చిన ఘనత కేసీఆర్ ది అని తెలిపారు. అయితే హరీష్ రావు ప్రసంగానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. దీంతో మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకు ఇచ్చిన శిక్షణ ఇదేనా అధ్యక్ష అంటూ హరిష్ రావు సెటైర్ విసిరారు. ఆ తరువాత మాజీ మంత్రి తిరిగి మాట్లాడుతూ.. తెలంగాణకు వెళ్తే చికెన్ గున్యా వస్తుందని అమెరికా ఆ దేశ పౌరులను హెచ్చరించిందని.. ఆ పరిస్థితికి పల్లెలను తెచ్చారని మండిపడ్డారు. పంచాయతీ సిబ్బందికి వేతనాలు ఇవ్వడం లేదన్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని.. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు పెన్షన్స్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారని తెలిపారు. పెన్షన్స్ ఏమో గాని అసలు వేతనాలే ఇవ్వడం లేదని హరీష్‌రావు విమర్శించారు.
బిల్లులు విడుదల చేయాలి: పల్లా
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లి సర్పంచ్ బిల్లులు రాక ఇల్లును కుదువ పెట్టుకున్నారని తెలిపారు. బిల్లుల కోసం సర్పంచ్‌లు కలుద్దామని హైదరాబాద్‌కు వస్తే అరెస్టు చేస్తున్నారన్నారు. సర్పంచ్‌లు చేసిన పనుల బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పెండింగ్‌లు పెట్టిందే బీఆర్‌ఎస్: నాయిని
సర్పంచుల బిల్లులు పెండింగ్ పెట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ బిల్లులు పెండింగ్ పెడితే ఆ బరువు తాము మోస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్ని అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు రూ.1000 కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు. పార్టీ కార్యాలయాలను కూడా వారు కబ్జాలు పెట్టారని నాయిని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
మంత్రి సీతక్క సమాధానం...
సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులపై మంత్రి సీతక్క సమాధానమిస్తూ.. సర్పంచ్‌ల పదవి కాలం ఫిబ్రవరిలో ముగిసిందని.. ఇప్పుడున్న పెండింగ్ బిల్లులు బీఆర్‌ఎస్ నుంచి వారసత్వంగా వచ్చినవే అని మంత్రి సీతక్క అన్నారు. హరీష్ రావు ఫైనాన్స్ మంత్రిగా ఆనాడు సంతకం పెడితే బిల్లులు క్లియర్ అయ్యేవన్నారు. కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వలేదని.. తాము పెండింగ్ బిల్లులు చెల్లించం అనడం లేదని అన్నారు. కచ్చితంగా బీఆర్‌ఎస్ వారసత్వంగా ఇచ్చిన బకాయిలు, పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేశారు. ‘‘బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితిగా మాకు పెండింగ్ బిల్లులు ఇచ్చింది’’ అంటూ మంత్రి సీతక్క వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ వాకౌట్
అయితే సర్పంచుల పెండింగ్ బిల్లులపై మంత్రి సమాధానానికి నిరసనగా బీఆర్‌ఎస్ వాకౌట్ చేసింది. ఆనాడు తాము పల్లె ప్రగతి కింద రూ. 3300 కోట్లు పంచాయితీలకు ఇచ్చామని హరీష్‌రావు తెలిపారు. ప్రతినెల రూ.227 కోట్లు పంచాయితీలకు ఇచ్చామన్నారు. ఆ విధానాన్ని కాంగ్రెస్ కొనసాగించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. మంత్రి సమాధానం సరిగా లేని కారణంగా సభ నుండి వాకౌట్ చేస్తున్నామని హరీష్‌రావు తెలిపారు.
మంత్రి ఆగ్రహం...
గత ప్రభుత్వం బకాయి పెట్టిన బిల్లుల్ని తాము ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కానీ బీఆర్ఎస్ సభను పక్కదారి పట్టిస్తోందని మండిపడ్డారు. రాజకీయంగా పరపతిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
Drugs Racket : అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు... భారీగా డ్రగ్స్ స్వాధీనం
BRS: కేసీఆర్ ఆనవాళ్లను చేరిపేయడం నీ తరం కాదు..: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Dec 16 , 2024 | 11:49 AM