ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఐపీఎల్‌ టికెట్ల గోల్‌మాల్‌?

ABN, Publish Date - Apr 13 , 2024 | 03:17 AM

ఐపీఎల్‌ను పిచ్చిగా ఇష్టపడే హైదరాబాద్‌ అభిమానుల్లో ఇప్పుడు లీగ్‌ నిర్వాహకులపైనే తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి....

విక్రయాల్లో పారదర్శకత ఏది?..

ఆన్‌లైన్‌లో అమ్మకాల పేరుతో మాయం

అభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు

ఎన్ని టికెట్లు.. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అమ్ముడయ్యాయనేది ఎవ్వరికీ తెలియదు

అంతా ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంచైజీ ఇష్టారాజ్యమే

ప్రశ్నిస్తే.. వేదికను తరలిస్తామంటూ.. నగర ఇమేజ్‌ పోతుందంటూ బ్లాక్‌మెయిల్‌!

ఇష్టారీతిగా టికెట్ల ధరల పెంపు

కొన్ని మ్యాచ్‌లకు 100శాతం దాకా

రాజస్థాన్‌తో మ్యాచ్‌కు రూ.15వేలు

బెంగళూరుతో మ్యాచ్‌కు రూ.30వేల ధర

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఐపీఎల్‌ను పిచ్చిగా ఇష్టపడే హైదరాబాద్‌ అభిమానుల్లో ఇప్పుడు లీగ్‌ నిర్వాహకులపైనే తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆన్‌లైన్‌ విక్రయాల పేరుతో టికెట్లను తమకు దక్కకుండా క్షణాల్లో మాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. టికెట్ల విక్రయాలు మొదలవ్వగానే.. యాప్‌ తెరిచి బుక్‌ చేసుకునేలోగా ‘సోల్డ్‌ అవుట్‌’ బోర్డులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకు 20వేల పైచిలుకు టికెట్లు అని చెబుతున్నా.. సామాన్య అభిమానులకు దొరకడం లేదంటే అది గప్‌చు్‌పగా పక్కదారి పట్టించడమేనని కన్నెర్ర చేస్తున్నారు. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌ల్లో టికెట్లను క్షణాల్లో గాయబ్‌ చేశారని.. ఉప్పల్‌ స్టేడియానికి వెళ్లి అభిమాన క్రికెటర్ల ఆటను ప్రత్యక్షంగా వీక్షించాలనే ఆశపడుతున్న తమకు ఎన్నాళ్లీ నిరాశ? అని ప్రశ్నిస్తున్నారు. లోకల్‌ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌), టికెట్ల విక్రయాలను భుజానెత్తుకున్న పేటీఎం నిర్వాహకులే టికెట్ల అమ్మకాలను పక్కదారి పట్టిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎన్ని టిక్కెట్లు అమ్మకానికి పెడుతున్నాం.. అందులో ఎన్ని టిక్కెట్లు.. ఎంత సమయంలో విక్రయించాం అనే పారదర్శక విధానానికి ఎస్‌ఆర్‌హెచ్‌ పూర్తిగా గండికొట్టి ఇష్టారీతిగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. మొత్తంగా సామాన్య అభిమానులకు ఐపీఎల్‌ మ్యాచ్‌ టికెట్‌ దొరకడం బంగారం అయిపోయింది. టికెట్ల అమ్మకాలపై ఐపీఎల్‌ నిర్వాహకులు, హెచ్‌సీఏకు ఆజమాయిషీ లేకపోవడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం ఆడిందే ఆటగా మారిపోయింది. అందునా... టికెట్ల ధరనూ ఫ్రాంచైజీ ఇష్టారీతిన పెంచేసింది. నిరుడు ఐపీఎల్‌తో పోలిస్తే ఈ సీజన్‌లో ప్రారంభ శ్రేణి నుంచి ప్రీమియం టికెట్ల ధరల్ని సుమారు రూ.1000 నుంచి రూ.5 వేలు వరకు ధరలు పెంచారు. కొన్ని మ్యాచ్‌లకైతే ధరలను రెట్టింపు చేశారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌లపై అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని టికెట్ల ధరలను 100శాతం పెంచారు. మే నెల 2వ తేదీన జరగాల్సిన రాజస్థాన్‌ మ్యాచ్‌ కోసం రూ.2000గా ఉన్న టికెట్‌ను, బెంగళూరుతో మ్యాచ్‌ కోసం రూ.4వేలు చేశారు. అలాగే బాక్స్‌ టికెట్‌ ధర కూడా రూ.15 వేల నుంచి రూ. 30వేలకు పెంచేశారు. ఈసారి హైదరాబాద్‌ మొత్తంగా ఏడు మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తోంది. వీటిలో ఇప్పటికే రెండు ముగిశాయి. ఈనెల 25న బెంగళూరుతో జరగాల్సిన మ్యాచ్‌కు బాక్స్‌ టిక్కెట్లు (రూ.22, 30 వేలు) తప్ప అన్నీ అయిపోయినట్లు యాప్‌లో చూపుతున్నారు.

ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంచైజీ వాచాలత!

టికెట్ల అమ్మకాల్లో పారదర్శకత లేకపోవడం టికెట్ల ధరలను ఇష్టారీతిన పెంచడం గురించి ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యాన్ని హెచ్‌సీఏ కార్యవర్గ సభ్యులు ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినట్లు తెలిసింది. ‘మేం ఉప్పల్‌ స్టేడియానికి అద్దె కడుతున్నాం.. మా ఇష్టమొచ్చినట్లుగానే నిర్వహిస్తాం.. టికెట్లనూ మా ఇష్టం వచ్చినట్లుగా అమ్ముకుంటాం’ అని చెప్పినట్లు తెలుస్తోంది. ఈనెల 5న జరిగిన సీఎస్కే మ్యాచ్‌కు ముందు ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యంతో నిర్వహించిన సమావేశంలో టికెట్ల అమ్మకాల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై ప్రభుత్వ క్రీడాశాఖకు చెందిన ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ప్రశ్నిస్తే వారి నుంచి సమాధానం కరవైందని తెలిసింది. వారి ఈ మౌనాన్నే మినిట్స్‌లో నమోదు చేస్తున్నానని సదరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి చెప్పినా వారు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి జారుకున్నారట. ఇదే విషయమై సీఎంవోలోని ఒక సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సన్‌రైజర్స్‌ను నిలదీయగా... తాము వేదికను ఇక్కడ నుంచి మరోచోటికి తరలిస్తామని, అప్పుడు హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బ తింటుందంటూ బ్లాక్‌మెయిల్‌ ధోరణిలో జవాబిచ్చినట్లు సమాచారం.

ఎస్‌ఆర్‌హెచ్‌, పేటీఎందే బాధ్యత

ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణ, టికెట్ల విక్రయానికి సంబంధించిన పూర్తి బాధ్యత ఎస్‌ఆర్‌హెచ్‌, పేటీఎందే! టికెట్ల అమ్మకాలకు హెచ్‌సీఏకు ఎలాంటి సంబంధం లేదు. టెస్టు మ్యాచ్‌ టికెట్ల విక్రయాల్లో ఎలాంటి వివాదానికీ తావు లేకుండా పూర్తి జవాబుదారీతనంతో వ్యవహరించాం. ఐపీఎల్‌ టిక్కెట్ల విషయంలో మా పాత్ర శూన్యం.

- ఎ.జగన్‌మోహన్‌ రావు-హెచ్‌సీఏ అధ్యక్షుడు

Updated Date - Apr 13 , 2024 | 03:17 AM

Advertising
Advertising