Osmania Hospital: రూ.2075 కోట్లతో ఉస్మా'నయా' ఆస్పత్రి
ABN, Publish Date - Sep 17 , 2024 | 03:32 AM
రాజధాని హైదరాబాద్‌లో పెద్దాస్పత్రిగా పేరుగాంచిన ఉస్మానియాకు మహార్దశ పట్టనుంది. ఆ ఆస్పత్రికి కొత్త భవనాలను రూ.2075 కోట్లతో.. 2 వేల పడకల సామర్థ్యంతో నిర్మించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది.
30 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో
2 వేల పడకల సామర్థ్యంతో నిర్మాణం
ఉన్న 21 విభాగాలకు తోడు మరో 6
ప్రతి విభాగానికీ ఓ ఆపరేషన్ థియేటర్
2027 నాటికి పూర్తిచేయడమే లక్ష్యం
వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం
హైదరాబాద్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌లో పెద్దాస్పత్రిగా పేరుగాంచిన ఉస్మానియాకు మహార్దశ పట్టనుంది. ఆ ఆస్పత్రికి కొత్త భవనాలను రూ.2075 కోట్లతో.. 2 వేల పడకల సామర్థ్యంతో నిర్మించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అత్యాధునిక వసతులతో దీన్ని నిర్మించనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రెండు మూడు నెలల్లో దీని నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేసే విధంగా వైద్యశాఖ కసరత్తు చేస్తోంది. 2026-27 నాటికి దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత పాత భవనం కూలిపోయే దశలో ఉండటంతో గోషామహల్‌లో 31.39 ఎకరాల్లో కొత్త భవనం నిర్మించాలని గతంలోనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 30.28 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనాలను నిర్మిస్తారు. ప్రస్తుతం ఉస్మానియాలో 21 వైద్య విభాగాలు ఉండగా, మరో ఆరు సూపర్ స్పెషాలిటీ విభాగాలను కొత ఆస్పత్రిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. అవి.. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఎమర్జెన్సీ మెడిసిన్, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, పాలియేటివ్ హెల్త్, రుమటాలజీ, జీరియాట్రిక్ మెడిసిన్. ప్రతి సూపర్ స్పెషాలిటీ విభాగానికి ఒక ఆపరేషన్ థియేటర్‌ను నెలకొల్పనున్నారు.
సెంటరాఫ్ ఎక్సలెన్సీగా ఉస్మానియా
ఉస్మానియా కొత్త భవనాన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీగా రూపొందించనున్నారు. అత్యంత విశాలంగా, పచ్చదనంతో ఆహ్లాదంగా ఉండేలా.. రోగుల గదుల్లోకి గాలి, వెలుతురూ ధారాళంగా వచ్చేలా.. ఆస్పత్రికి నాలుగు వైపుల నుంచి రహదారులు ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకోసం ప్రముఖ డిజైనర్లను రంగంలోకి దించారు. కొత్త ఆస్పత్రిలో జాతీయ అంతర్జాతీయ స్థాయి సెమినార్లు జరిగేలా తీర్చిదిద్దుతారు. అలాగే పరిశోధనలు జరుగుతాయి. నిమ్స్ మాదిరిగా అంతర్జాతీయ పరిశోధనలకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రపంచంలో ఉన్న ఉన్నతశ్రేణి వైద్య సంస్థలతోనూ ఒప్పందం చేసుకుంటారు. అంతర్జాతీయ వైద్యాన్ని కూడా ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులోకి తెచ్చేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలాగే అవయవ మార్పిడికి సంబంధించిన అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేయనున్నారు.
1919లో నిజాం కట్టించిన ఆస్పత్రి
హైదరాబాద్ అఫ్జల్‌గంజ్ ప్రాంతంలో ఉన్న ఉస్మానియా ఆస్పత్రిని 1919లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్మించారు. ఇండోసార్సెనిక్ శైలిలో నిర్మించిన ఈ భవనంలో 1096 పడకలున్నాయి. రోజూ సగటున 2500 మంది అవుట్‌పేషంట్స్ వస్తారు. 180 నుంచి 200 మంది దాకా.. ఇన్‌పేషెంట్లుగా చేరుతారు. నెలకు సగటున 2-3 కాలేయ, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. 30 దాకా మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. మొత్తం 21 విభాగాలుండగా.. 12 ఆపరేషన్ థియేటర్లు (వాటిలో 35 టేబుల్స్) ఉన్నాయి.
Updated Date - Sep 17 , 2024 | 03:41 AM