Hydra - Janwada Farm House: మరికాసేపట్లో కేటీఆర్ ఫామ్‌హౌస్ కూల్చివేత!
ABN, Publish Date - Aug 27 , 2024 | 04:55 PM
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉపయోగిస్తున్న జన్వాడ ఫాం హౌస్‌ను హైడ్రా మరికొద్ది సేపట్లో కూల్చివేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు అక్కడికి చేరుకున్నారు.
హైదరాబాద్: అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తు్న్న హైడ్రా మరో సంచలనానికి సిద్ధమైంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉపయోగిస్తున్న జన్వాడ ఫాం హౌస్‌ను హైడ్రా మరికొద్ది సేపట్లో కూల్చివేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు అక్కడికి చేరుకున్నారు. జన్వాడ ఫాం హౌస్ వద్ద సర్వేను అధికారులు పూర్తి చేశారు. ఇరిగేషన్ అధికారులు వివరాలను పరిశీలిస్తున్నారు.
కాగా జన్వాడ్ ఫామ్ హౌస్‌తో పాటు మరికొందరు ప్రముఖులకు సంబంధించిన ఫామ్ హౌస్‌లు కూడా ఉన్నాయి. కొంతమంది సినీ ప్రముఖల ఫామ్ హౌస్‌లు కూడా ఉన్నాయి. దీంతో ఏక కాలంలో జన్వాడ ఫామ్‌తో పాటు ఇతర ఫామ్ హౌస్‌లను కూడా కూల్చివేసే అవకాశాలు ఉన్నాయి. ఏ క్షణమైనా ఫామ్‌హౌస్‌లు కూల్చివేసే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం హైడ్రా అధికారులు అక్కడి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. కూల్చివేతకు ఎంత సమయం పడుతుంది?, ఎంతమంది సిబ్బంది అవసరం అవుతారు? వంటి విషయాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఎన్ని బృందాలు అవసరం అవుతాయనే దానిపై ఒక జాబితాను కూడా సిద్దం చేస్తున్నారు. అయితే ఎప్పుడు కూల్చివేస్తారనే దానిపై సస్పెన్స్ నెలకొంది.
ఫామ్ హౌస్ వద్ద ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సర్వే పూర్తి చేశారు. మూడు రోజుల క్రితం కూడా ఒక సర్వే నిర్వహించారు. హైడ్రా అధికారులతో కలిసి ఇరిగేషన్ అధికారులు తాజా సర్వే చేపట్టారు. కాగా 111 జీవోను ఉల్లంఘించి జన్వాడ ఫామ్ హౌస్‌ను నిర్మించారంటూ గత కొంతకాలంగా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి.
కాగా జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదని మాజీ మంత్రి కేటీఆర్ చెబుతున్నారు. ఇటీవలే ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బఫర్ జోన్‌లోని కానీ, ఎఫ్‌టీఎల్‌లో కానీ తనకంటూ ఎలాంటి ఫామ్ హౌస్‌లు లేవన్నారు. జన్వాడ హౌస్ తన స్నేహితుడిదని అన్నారు. తన స్నేహితుడి ఫామ్ హౌజ్ ఎఫ్‌టీఎల్ లేదా బఫర్ జోన్‌లో ఉంటే తానే దగ్గర్నుండి కూలగొట్టిస్తానని వ్యాఖ్యానించారు. ‘‘నా పేరు మీద ఫామ్ హౌస్‌లు ఉన్నట్టు మీడియాలో ఏవేవో కథనాలు రాస్తున్నారు. కానీ స్పష్టంగా చెబుతున్నాను. జన్వాడ్ ఫామ్ హౌస్‌లో నేను లీజుపై ఉన్నాను. ఒక వేళ తప్పు జరిగితే నేను దగ్గర ఉండి కూల్చివేయించేందుకు సహకరిస్తాను’’ అని కేటీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే.
Updated Date - Aug 27 , 2024 | 06:43 PM