Ponguleti: తప్పు చేస్తే క్షమించను.. అధికారులకు మంత్రి పొంగులేటి వార్నింగ్
ABN , Publish Date - Aug 25 , 2024 | 04:35 PM
రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas) ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో సమావేశమయ్యారు.
హైదరాబాద్: రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas) ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో సమావేశమయ్యారు. సబ్ రిజిస్ట్రార్లు, డీఐజీలు, జాయింట్ డీజీలు, ఐజీ, అదనపు ఐజీ స్థాయీ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా సమావేశంలో రెవెన్యూ శాఖ అధికారులపై మంత్రి కోపడ్డారు.
పలువురి అధికారుల పనితీరు బాలేదని.. మార్చుకోకపోతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్ విలువ పెంపుపై సమావేశంలో చర్చ జరిగింది. ఉద్యోగుల సమస్యలు, బకాయిలతోపాటు పలు అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. పలు అంశాలపై అధ్యయనం కోసం అధికారులు ఇటీవలే వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు. వారు తెచ్చిన నివేదికలను మంత్రి పరిశీలించారు.
క్షమించేదే లేదు..
"అధికారులు తప్పు చేస్తే క్షమించేది లేదు. రెవెన్యూ వ్యవస్థకు మంచి పేరు తీసుకురండి. మానవత్వంతో విధులు నిర్వహించండి. ఎవరిమీద నాకు కోపం లేదు. ప్రభుత్వం స్థలాన్ని పేదవాడికి ఇవ్వాలి. ప్రభుత్వ భూములను బడాబాబులకు రిజిస్ట్రేషన్ చేస్తే ఎంతటి వారినైనా సహించేదిలేదు. అన్ని శాఖల వారీగా నిరంతరం సమీక్ష నిర్వహిస్తుంటా. పదోన్నతుల విషయంలో ఎవరి ప్రమేయంగానీ, పైరవీలుగానీ అవసరం లేదు. అన్ని నేనే చూసుకుంటా. అన్ని శాఖల వారిలా నేను కాదు.. చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను. రెవెన్యూ శాఖలో కొందరు అధికారుల తీరుపై సిగ్గుపడుతున్నా. రాబోయే రోజుల్లో అధికారులంతా తలెత్తుకునేలా చేస్తా. ప్రమోషన్ల కోసం రాజకీయ నాయకుల మద్దతు తీసుకొచ్చినా వృథా ప్రయాసే. మీ రాజకీయ నాయకుడికి సంబంధించిన లేఖ తీసుకొస్తే నవ్వుతా. ఎవరైతే ఈ శాఖకు మంచి పేరు తెస్తే వాళ్ళని గుర్తిస్తా. తెలిసి తెలియన్నట్టు నటిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటా" అని మంత్రి పొంగులేటి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.