Journalists: జాతీయవాదులు సంఘటితం కావాలి: ఐవైఆర్
ABN, Publish Date - May 25 , 2024 | 09:08 AM
దేశాన్ని విచ్ఛిన్నకర శక్తుల నుంచి కాపాడుకునేందుకు జాతీయవాదులు సంఘటితం కావాలని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ప్రధానకార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. సమాచార భారతి సంస్థ ఆధ్వర్యంలో..
హైదరాబాద్, మే 24: దేశాన్ని విచ్ఛిన్నకర శక్తుల నుంచి కాపాడుకునేందుకు జాతీయవాదులు సంఘటితం కావాలని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ప్రధానకార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. సమాచార భారతి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సి భవన్‌లో నారద జయంతి వేడుకలు, ప్రపంచ పాత్రికేయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయ రంగంలో విశేష సేవలందిస్తున్న వారికి పురస్కారాలు ప్రదానం చేశారు. అనంతరం కృష్ణారావు మాట్లాడుతూ.. వ్యవస్థలు దిగజారుతున్నాయని, జర్నలిజం పోకడలు మారిపోయాయని, కాలంతో పాటు విధానాలు, విలువలు మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో మంచి, చెడు ఉన్నాయని, ఫేక్‌న్యూస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నదన్నారు.
ప్రోత్సహించాలి!
జర్నలిస్టులు నిష్పక్షపాతంగా ఉండాలన్నారు. సమాచార భారతి రాష్ట్ర అధ్యక్షుడు డా. జి.గోపాల్ రెడ్డి మాట్లాడుతూ జాతీయవాద భావాలను పెంపొందించి జాతీయ సమగ్రత, దేశ భద్రతకు సమాచార భారతి ప్రాధాన్యమిస్తుందన్నారు. యువ జర్నలిస్టులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నారద జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు వ్యాప్తి చెందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్ఎస్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ కట్టా రాజగోపాల్, భాగ్యనగర్ విభాగ్ ప్రచార ప్రముఖ్ సత్తిరాజు, పాత్రికేయురాలు నవత పాల్గొన్నారు.
పురస్కారాల ప్రదానం
నారద జయంతి వేడుకలను పురస్కరించుకొని సీనియర్ సంపాదకులు వైఎస్ఆర్ శర్మ, సీనియర్ పాత్రికేయులు గుళ్లమూడి శ్రీనివాసకుమార్, సీనియర్ కాలమిస్ట్ చిరువోలు పార్థసారథి, సీనియర్ ఫొటో జర్నలిస్ట్ కె.దుర్గా నర్సింహారావు, సీనియర్ పాత్రికేయురాలు పొన్నపల్లి నాగవాణి, సీనియర్ పాత్రికేయులు గంగం మహేష్‌రెడ్డిలకు పురస్కారాలను ప్రదానం చేశారు.
Updated Date - May 25 , 2024 | 09:09 AM