NIMS: శుభవార్త.. నిద్రలేమి, గురక, శ్వాస వ్యాధులతో బాధపడుతున్నారా..
ABN, Publish Date - Oct 14 , 2024 | 07:18 AM
నిమ్స్‌లో అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ ల్యాబ్ సిద్ధమవుతోంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలను గుర్తించి చికిత్సలు అందించేందుకు ఈ ల్యాబ్‌ను రోగులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
నిమ్స్‌లో సిద్ధమవుతున్న స్లీప్ ల్యాబ్
నిద్రలేమి, గురక, ఇతర శ్వాసకోశ బాధితులకు స్లీప్ అప్నియా నిర్ధారణ
24 గంటల పాటు పరీక్షలు
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): నిమ్స్‌లో అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ ల్యాబ్ సిద్ధమవుతోంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలను గుర్తించి చికిత్సలు అందించేందుకు ఈ ల్యాబ్‌ను రోగులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఓ రోగి సహాయకుడు ఇచ్చిన విరాళాలతో ఈ ల్యాబ్‌ను మరింత ఆధునికీకరించి అవసరమైన పరికరాలను ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్‌లో బాధితులకు పరీక్షలు చేయడానికి అవసరమైన బ్రాంకోస్కోపీ, సీపాప్ తదితర పరికరాలను కొనుగోలు చేశారు. నిద్రలేమి, గురక, ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి నిమ్స్ స్లీప్ ల్యాబ్‌లో పరీక్షలు చేయనున్నారు.
స్లీప్ అప్నియాను టైప్1, 2, 3గా విభజించి..
గురక సమస్యను నిర్ధారించడానికి ఆస్పత్రిలో 24 గంటల పాటు ఉండాల్సి వస్తుంది. రోగికి 24 గంటల పాటు స్లీప్ ల్యాబ్‌లో నిద్రలో అతని అవయవాల పనితీరు, గుండె స్పందనలు, ఊపిరితిత్తులు, మెదడు కార్యకలాపాలు, శ్వాస విధానాలు, చేయి, కాలు కదలికలు, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను నిర్ధారిస్తారని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్ప తెలిపారు. ఈ పరీక్షలను పాలిసోమ్నోగ్రఫిగా వ్యవహరిస్తమన్నారు. సమస్య తీవ్రత ఆధారంగా స్లీప్ అప్నియా టైప్1, 2, 3గా విభజించి విశ్లేషిస్తారని చెప్పారు. నిద్రపోతున్న సమయంలో గంటలో 5 నుంచి 20 సార్లు శ్వాస ఆగిపోతే దాన్ని మైల్డ్ గ్రేడ్‌గా భావిస్తామని, అలాగే గంటకు 20 నుంచి 40 సార్లు ఆగిపోతే దాన్ని మోడరేట్ గ్రేడ్‌గా లెక్కిస్తామని, తరువాత గంటకు 40 నుంచి 60 సార్లు అంతకన్నా ఎక్కువ సార్లు ఆగిపోతే దాన్ని సీవియర్ గ్రేడ్ స్లీప్ అప్నియాగా పరిగణించి పరిస్థితిని తీవ్రంగా భావిస్తామని వైద్యులు వివరించారు.
పదిమందిలో ముగ్గురికి..
శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆస్పత్రికి వచ్చే ప్రతి పది మందిలో ముగ్గురు తప్పనిసరిగా స్లీప్ అప్నీయా బాధితులుంటున్నారని వైద్యులు తెలిపారు. పిల్లలు, పెద్దలు అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారని ఇది స్లీప్ అప్నియాకు దారితీస్తుందన్నారు. గురక సమయంలో కొన్ని క్షణాలు శ్వాస ఆగిపోతుందని, ఈ సమయంలో ఆక్సిజన్ అందకపోడం, గుండెస్పందనలో తేడాలు రావడం, బీపీ పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నవుతున్నాయన్నారు. స్లీప్ అప్నియా పరీక్ష ద్వారా నిర్ధారణ జరిగిన తర్వాత ఏమైనా లోపాలు ఉంటే వాటికి దశల వారీచీగా చికిత్సలు అందిస్తారు. పరీక్ష ఫలితాల ఆదారంగా రోగికి అవసరమైన చికిత్సలు, వైద్య సలహాలు, అందిస్తామని తెలిపారు. శ్వాసనాళాల్లో అడ్డంకులు ఉంటే శస్త్రచికిత్సతో తొలగించడం, మరికొందరిలో జీవనశైలిలో మార్పులకు సంబంధించి సూచనలు సలహాలు అందిస్తామని వైద్యులు తెలిపారు.
For Latest News and National News click here
Updated Date - Oct 14 , 2024 | 07:19 AM