Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. కేబీఆర్ పార్కు వద్ద అతిపెద్ద అండర్‌పాస్
ABN, Publish Date - Oct 14 , 2024 | 06:41 AM
గ్రేటర్‌లో అతి పెద్ద అండర్‌పాస్ కేబీఆర్ పార్క్ వద్ద అందుబాటులోకి రానుంది. సిగ్నల్ చిక్కులు లేకుండా వాహనదారులు నిరాటంకంగా ప్రయాణించేలా బహుళ మార్గాలకు రూపకల్పన చేస్తున్నారు. కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న పలు జంక్షన్లలో సిగ్నల్ ఫ్రీ ప్రయాణం చేసేలా వీటిని రూపొందించారు.
740 మీటర్ల మేర నిర్మాణం
రోడ్ నంబర్–45 నుంచి రెండు వైపులా వెళ్లేలా ప్రతిపాదన
యూసుఫ్‌గూడ వైపు రెండు లేన్లు
ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్ వైపు మూడు లేన్లు
జూబ్లీ చెక్‌పోస్ట్ వద్ద సెకండ్ లెవల్‌లో వంతెన
కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ నుంచి రోడ్ నంబర్–36 వైపు ఆరు లేన్ల వంతెన
గ్రేటర్‌లో అతి పెద్ద అండర్‌పాస్ కేబీఆర్ పార్క్ వద్ద అందుబాటులోకి రానుంది. సిగ్నల్ చిక్కులు లేకుండా వాహనదారులు నిరాటంకంగా ప్రయాణించేలా బహుళ మార్గాలకు రూపకల్పన చేస్తున్నారు. కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న పలు జంక్షన్లలో సిగ్నల్ ఫ్రీ ప్రయాణం చేసేలా వీటిని రూపొందించారు.
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): నగరంలోని కేబీఆర్ (కాసు బ్రహ్మానందరెడ్డి)పార్క్ చుట్టూరా సిగ్నల్ ఫ్రీ ప్రయాణాలు సాగేలా అండర్‌పాస్‌లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తున్నది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ –45 వైపు నుంచి కేబీఆర్ పార్కు ప్రధాన గేటు(ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్) వైపు 740 మీటర్ల మేర అతిపెద్ద భూగర్భ మార్గం నిర్మించనున్నారు. దీంతో ఐటీ కారిడార్, ఫిల్మ్‌నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలు జూబ్లీ చెక్‌పోస్ట్ కంటే ముందు ఉండే అండర్‌పాస్ నుంచి సిగ్నల్ చిక్కులు లేకుండా రాకపోకలు సాగించే వెసులుబాటు కలగనుంది.
మూడు లేన్లుగా అండర్‌పాస్ నిర్మాణానికి రూపకల్పన చేశారు. గతంలో నిర్మించిన అండర్‌పాస్‌లలో మెజార్టీ 200–300 మీటర్లు మాత్రమే ఉన్నాయి. దీంతో కేబీఆర్ పార్కు వద్ద నిర్మించే అండర్‌పాస్ అతిపెద్దది కానుంది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటీవ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేటీవ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(హెచ్– సిటీ)లో భాగంగా కేబీఆర్ పార్కు చుట్టూ ఏడు అండర్‌పాస్‌లు నిర్మిస్తుండగా, మెజార్టీ 300 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్నాయి. ఇవి నగర ప్రయాణంలో వాహనదారులకు వినూత్న అనుభూతి కలిగిస్తాయని అధికారులు చెబుతున్నారు.
ప్రతి జంక్షన్ వద్ద వంతెన.. అండర్‌పాస్
సిగ్నల్ చిక్కులు లేకుండా జంక్షన్ల వారీగా బహుళ మార్గాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. జూబ్లీ చెక్‌పోస్ట్ వద్ద మాత్రం రెండో లెవల్‌లో ఓ వంతెన ప్రతిపాదించారు.
• కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ చౌరస్తా వద్ద రూ.192 కోట్లతో రెండు అండర్‌పాస్‌లు, (ముగ్ద జంక్షన్‌తో కలిపి) ఓ వంతెన ప్రతిపాదించారు. యూసుఫ్‌గూడ వైపు నుంచి వచ్చే వాహనాలు మూడు లేన్ల వంతెన నుంచి జూబ్లీచెక్‌పోస్ట్ వైపు వెళ్లనున్నాయి. జూబ్లీచెక్‌పోస్ట్ నుంచి వచ్చే వాహనాలు ఫ్రీ లెఫ్ట్ ద్వారా యూసుఫ్‌గూడ వైపు, కేన్సర్ ఆస్పత్రి వైపు వెళ్లాల్సిన వాహనాలు అండర్‌పాస్ వినియోగించాల్సి ఉంటుంది.
• జూబ్లీచెక్‌పోస్ట్ వద్ద రెండు వంతెనలు, ఓ అండర్‌పాస్ నిర్మించనున్నారు. ఇందుకు రూ.229 కోట్లు అవసరమని అంచనా వేశారు. కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ వైపు నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ –36 (పెద్దమ్మ గుడి వైపు) మూడు లేన్ల చొప్పున రెండు వైపులా వాహనాలు రాకపోకలు సాగించేందుకు ఆరు లేన్ల వంతెన అందుబాటులోకి రానుంది. రోడ్ నెంబర్–45 వైపు నుంచి కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ వైపు వెళ్లేందుకు మూడు లేన్ల అండర్‌పాస్, యూసుఫ్‌గూడ వైపు వాహనాల కోసం మరో అండర్‌పాస్ ప్రతిపాదించారు. యూసుఫ్‌గూడ వైపు నుంచి రోడ్ నంబర్–45 వైపు వెళ్లే వాహనాల కోసం సెకండ్ లెవల్‌లో రెండు లేన్ల వంతెన నిర్మించనున్నారు.
• కేన్సర్ ఆస్పత్రి చౌరస్తా వద్ద ఓ అండర్‌పాస్, ఓ వంతెనను రూ.83 కోట్లతో ప్రతిపాదించారు. కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ వైపు నుంచి వచ్చే వాహనాలు అండర్‌పాస్ నుంచి మహారాజ అగ్రసేన్ చౌరస్తా (తెలంగాణ భవన్) వైపు వెళ్తాయి. తెలంగాణ భవన్ నుంచి వెళ్లే వాహనాలు వంతెన మీదుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్–10, రోడ్ నంబర్–1 వైపు వెళ్లొచ్చు.
• మహారాజ అగ్రసేన్ చౌరస్తా వద్ద రూ.110 కోట్లతో ఓ అండర్‌పాస్, వంతెన ప్రతిపాదించారు. కేన్సర్ ఆస్పత్రి వైపు నుంచి వచ్చే వాహనాలు అండర్‌పాస్ మీదుగా ఫిల్మ్‌నగర్ చౌరస్తా వైపు వెళ్లాలి. బంజారాహిల్స్ రోడ్ నంబర్ –12 నుంచి వచ్చే వాహనాలు వంతెన మీదుగా ఫిల్మ్‌నగర్ చౌరస్తాకు వెళ్లొచ్చు.
• ఫిల్మ్‌నగర్ చౌరస్తా వద్ద అండర్‌పాస్, ఓ వంతెనను రూ.115 కోట్లతో నిర్మించనున్నారు. మహారాజ అగ్రసేన్ చౌరస్తా వైపు నుంచి వచ్చే వాహనాలు అండర్‌పాస్ నుంచి జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఫిల్మ్‌నగర్ వైపు నుంచి వచ్చే వాహనదారులు వంతెన మీదుగా మహారాజ అగ్రసేన్ జంక్షన్ వైపు వెళ్లే అవకాశం కలుగుతుంది.
• రోడ్ నంబర్ –45 జంక్షన్ వద్ద రూ.97 కోట్లతో ఓ అండర్‌పాస్, వంతెన నిర్మాణం ప్రతిపాదించారు. జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా వైపు నుంచి అండర్‌పాస్ ద్వారా జూబ్లీ చెక్‌పోస్ట్‌కు వెళ్లొచ్చు. జూబ్లీ చెక్‌పోస్ట్ నుంచి వచ్చే వాహనదారులు వంతెన మీదుగా కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లాల్సి ఉంటుంది. కేబుల్ బ్రిడ్జి వైపు నుంచి వచ్చే వాహనదారులు ఫ్రీ లెఫ్ట్‌ను వినియోగించుకుంటే జూబ్లీ చెక్‌పోస్ట్ వైపు వెళ్లొచ్చు.
అండర్‌పాస్‌ల వివరాలు..
• రోడ్ నంబర్–45 వైపు నుంచి కేబీఆర్ పార్కు మెయిన్ గేటు వైపు మూడు లేన్ల అండర్‌పాస్– 740 మీటర్లు
• జూబ్లీ చెక్‌పోస్ట్ వైపు నుంచి కేబీఆర్ పార్కు మెయిన్ గేట్ చౌరస్తా మీదుగా క్యాన్సర్ ఆస్పత్రి వైపు రెండు లేన్ల అండర్‌పాస్– 330 మీటర్లు
• కేబీఆర్ పార్కు మెయిన్ గేట్ జంక్షన్ వైపు నుంచి పంజాగుట్ట వైపు (ముద్ర చౌరస్తా వద్ద) మూడు లేన్ల అండర్‌పాస్ – 260 మీటర్లు
• కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ జంక్షన్ వైపు నుంచి క్యాన్సర్ ఆస్పత్రి జంక్షన్ మీదుగా మహరాజ్ అగ్రసేన్ చౌరస్తా వైపు రెండు లేన్ల అండర్‌పాస్– 330 మీటర్లు
• క్యాన్సర్ ఆస్పత్రి చౌరస్తా వైపు నుంచి మహారాజ్ అగ్రసేన్ జంక్షన్ మీదుగా ఫిల్మ్‌నగర్ జంక్షన్ వరకు రెండు లేన్ల అండర్‌పాస్– 410 మీటర్లు
• మహరాజ అగ్రసేన్ చౌరస్తా వైపు నుంచి ఫిల్మ్‌నగర్ చౌరస్తా మీదుగా జర్నలిస్టు కాలనీ చౌరస్తా వరకు రెండు లేన్ల అండర్‌పాస్ – 340 మీటర్లు
• జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా వైపు నుంచి రోడ్ నంబర్–45 జంక్షన్ మీదుగా జూబ్లీచెక్‌పోస్ట్ వరకు రెండు లేన్ల అండర్‌పాస్ – 290 మీటర్లు
వంతెనలు..
• కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ వైపు నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ – 36 వరకు ఒక్కోవైపు రెండు లేన్ల చొప్పున ఫస్ట్ లెవల్ వంతెన – 745 మీటర్లు
• యూసుఫ్‌గూడ వైపు నుంచి రోడ్ నంబర్ –45 జంక్షన్ వైపు సెకండ్ లెవల్‌లో రెండు లేన్ల వంతెన – 770 మీటర్లు
• పంజాగుట్ట వైపు నుంచి కేబీఆర్ పార్క్ మెయిన్‌గేట్ జంక్షన్ మీదుగా జూబ్లీచెక్‌పోస్ట్ వైపు మూడు లేన్ల వంతెన – 900 మీటర్లు
• మహరాజ అగ్రసేన్ జంక్షన్ వైపు నుంచి క్యాన్సర్ ఆస్పత్రి చౌరస్తా మీదుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్–10 వైపు రెండు లేన్ల వంతెన –540 మీటర్లు
• ఫిల్మ్‌నగర్ జంక్షన్ వైపు నుంచి మహరాజ అగ్రసేన్ చౌరస్తా మీదుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్–12 వైపు రెండు లేన్ల వంతెన – 590 మీటర్లు
• ఫిల్మ్‌నగర్ వైపు నుంచి మహరాజ అగ్రసేన్ చౌరస్తా వైపు రెండు లేన్ల వంతెన – 600 మీటర్లు
• జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు నుంచి రోడ్ నంబర్–45 చౌరస్తా మీదుగా కేబుల్ బ్రిడ్జి వైపు రెండు లేన్ల వంతెన – 500 మీటర్లు
For Latest News and National News click here
Updated Date - Oct 14 , 2024 | 06:41 AM