Kishan Reddy: మాతృభాషను చిన్నతనంగా చూడొద్దు...
ABN, Publish Date - Dec 18 , 2024 | 10:44 AM
Telangana: మాతృభాషను అందరూ మార్చిపోతున్నామని.. తల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్‌లో చదివించాలని అనుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మెడికల్, ఇంజనీరింగ్‌లో కూడా రానున్న రోజుల్లో మాతృభాషలో పరీక్ష రాసే విధానాన్ని తీసుకొస్తామన్నారు. 1100 వందల భాషలు కనుమరుగైన పరిస్థితి ఏర్పడిందన్నారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. భిన్న సంస్కృతులు, భిన్న భాషల వైవిధ్యత గల దేశం భారత్ అని.. ప్రపంచవ్యాప్తంగా ఇంత వైవిధ్యత ఉన్న దేశం మరొకటి లేదన్నారు. 121 భాషలు మన దేశంలో ఉన్నాయన్నారు. మన రాజ్యాంగంలో 14 అధికార భాషలుండేవని.. ఇవాళ ఆ సంఖ్య మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 21 భాషలకు పెరిగిందని వెల్లడించారు. ఈ భాషలు మన సంస్కృతి, వారసత్వాన్ని, మన జ్ఞాన సంపదకు నిలయాలన్నారు. ఎన్డీయే ప్రభుత్వం, వాజ్ పేయి నేతృత్వంలో ఉన్నప్పటి నుంచి ప్రాంతీయ భాషలకు సరైన ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
భాషే కీలకం...
భాష మన సంస్కృతికి ఆత్మ వంటిదని వాజ్‌పేయి చెప్పేవారని గుర్తుచేశారు. జ్ఞానాన్ని ప్రసరింప జేసేందుకు 1835లో మెకాలే ద్వారా భారత శాస్త్రీయ భాషల ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నం జరిగిందని.. ఇంగ్లీష్‌కు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. స్వాతంత్ర్యానంతరం.. 1956లో భాషా ఆధారిత రాష్ట్రాల పునర్నిర్మాణం జరిగినప్పుడు దేశానికి సహకార సమాఖ్య, పాలనాపరమైన అంశాల కోసం భాష కీలకమైన అంశంగా మారిందన్నారు. పాలనాపరమైన సౌలభ్యం కోసం మూడు భాషల ఫార్ములాను రూపొందించారని తెలిపారు. ఈ ఫార్ములా వినియోగంలో ప్రజలు సంతృప్తిగా లేని కారణంగా మార్పులు తీసుకురావాలనే డిమాండ్ పెరిగిందన్నారు. దీనికి అనుగుణంగా ప్రధాని మోదీ 2020లో ఎన్ఈపీ -2020 నూతన జాతీయ విద్యావిధానం ద్వారా కనీసం రెండు ప్రాంతీయ భాషలను విద్యార్థులు నేర్చుకునేలా ప్రోత్సాహాన్ని అందించారని వెల్లడించారు.
ఆ చట్టం తెచ్చాం...
ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్‌లో అధికార భాషల బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టామన్నారు. దీని ప్రకారం.. జమ్మూకశ్మీర్‌లో అధికారిక అవసరాల కోసం.. కశ్మీరీ, డోగ్రీ, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీని వినియోగించేలా చట్టం తీసుకొచ్చామని అన్నారు. మోడీ ప్రభుత్వంలో జరిగిన ఎన్ఈపీ-2020 ద్వారా స్థానీయ భాషలకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. మొదట్లో దీన్ని విమర్శించిన వారు కూడా.. ఇప్పుడు సమర్థిస్తున్నారని చెప్పారు. విద్యావిధానం సులభతరం అవుతుందని, మాతృభాషలో విద్య ద్వారా వికాసం సాధ్యమవుతుందన్న వివిధ అధ్యయనాల ఆధారంగానే మోదీ సర్కారు ముందుకెళ్తోందని చెప్పుకొచ్చారు.
75 ఏళ్లూ పూర్తి..
హిందీ బలోపేతం కావాలని.. అలాగే ప్రాంతీయ భాషలు కూడా బలోపేతం కావాలని అప్పుడే దేశం అన్ని రంగాల్లో మందుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని కేంద్రమంత్రి అన్నారు. హిందీ భాషపై కొన్ని రాజకీయ పార్టీలు కావాలనే వివాదం చేసే ప్రయత్నం చేశాయని.. కానీ ప్రజలు అన్ని భాషలను సమానంగా ఆదరించారని తెలిపారు. ఈ ఏడాది హిందీ భాషకు అధికార భాష హోదా పూర్తి అయ్యి 75 ఏళ్లు అయిందన్నారు. క్లాసికల్ లాంగ్వేజెస్ విభాగంలో పనిచేస్తున్న వ్యక్తులు, సంస్థలను ప్రోత్సహించేందుకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందిస్తున్నామన్నారు. సంస్కృత భాషలను ప్రోత్సహించేందుకు మూడు రాష్ట్రీయ సంస్కృత్ విశ్వవిద్యాలయాలను స్థాపించామన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్లో అక్టోబర్ 3, 2024 నాడు.. 5 భాషలకు క్లాసికల్ లాంగ్వేజెస్ హోదా ఇచ్చామన్నారు. మరాఠీ, బెంగాలీ, అస్సామీ, పాలీ, ప్రాకృత్ భాషలకు ఈ హోదా ఇచ్చామని తెలిపారు. భారతదేశంలో క్లాసికల్ లాంగ్వేజ్ హోదా పొందిన భాషలు తెలుగు, తమిళ్,కన్నడ, మలయాళం, సంస్కృత్తో కలుపుకుని..11 భాషలకు ఈ హోదా అందిందని కేంద్ర మంత్రి వెల్లడించారు.
మాతృభాషలో చదివించండి...
మాతృభాషను అందరూ మార్చిపోతున్నామని.. తల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్‌లో చదివించాలని అనుకుంటున్నారన్నారు. మెడికల్, ఇంజనీరింగ్‌లో కూడా రానున్న రోజుల్లో మాతృభాషలో పరీక్ష రాసే విధానాన్ని తీసుకొస్తామన్నారు. 1100 వందల భాషలు కనుమరుగైన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజలందరినీ కోరేది ఒకటే మాతృభాషలో విద్యాబోధన చేయాలన్నారు. మాతృభాష కోసం పని చేసే వారిని అభినందిస్తున్నామని తెలిపారు. మీడియా, పత్రికలు లేకపోతే అనేక మంది మాతృభాష మర్చిపోయే వారన్నారు. తల్లిదండ్రులు మాతృభాషలో చదివించడం చిన్నతనంగా భావిస్తున్నారని.. అది మంచిది కాదని కనీసం 6వ తరగతి వరకు మాతృభాషలో చదివించండి అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు.
ఇవి కూడా చదవండి...
ABN Live..: నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
వాళ్ల పెన్షన్లు రద్దు.. నోటీసులు జారీ
Read Latest Telangana News And Telugu News
Updated Date - Dec 18 , 2024 | 10:45 AM