ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఐదు నిమిషాల్లో.. ఇంటికి చేరేలోపే మృత్యుఒడికి

ABN, Publish Date - Nov 11 , 2024 | 01:00 AM

మరో అయిదు నిమిషాల్లో వారంతా ఇంటికి చేరేలోపే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. అప్పటివరకు ఆనందంగా, ఉత్సాహంగా పెళ్లివేడుకలు జరుపుకున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా తీవ్ర విషాదం అలుముకుంది.

ప్రమాదం జరిగిన స్థలంలో గుమిగూడిన జనం

రిసిప్షన్‌కు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

పెళ్లికూతురు సోదరుడు, స్నేహితురాలు దుర్మరణం

మరో ఇద్దరికి తీవ్రగాయాలు

జగిత్యాలలో పెళ్లింట విషాదం..

===========================

జగిత్యాలరూరల్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : మరో అయిదు నిమిషాల్లో వారంతా ఇంటికి చేరేలోపే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. అప్పటివరకు ఆనందంగా, ఉత్సాహంగా పెళ్లివేడుకలు జరుపుకున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా తీవ్ర విషాదం అలుముకుంది. జగిత్యాల- కరీంనగర్‌ ప్రధాన రహదారిపై జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు, కారు ఎదురురెదురుగా ఢీ కొనడంతో కారు నడుపుతున్న జగిత్యాల పట్టణంలోని హన్‌మాన్‌వాడకు చెందిన సంకీర్త్‌ (32), పక్క సీటులో ముందుభాగంలో కూర్చున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తిరుపతికి చెందిన మునిరాజి(28) అనే యువతి సంఘటన స్థలంలోనే మృతిచెందారు. ఈ ప్రమాదంలో వెనక సీట్లో కూర్చున్న రాజమల్లు, ఆయన భార్య లక్ష్మీలకు తీవ్రగాయాలయ్యాయి. పెళ్లికూతురు, పెళ్లికొడుకు ప్రయాణిస్తున్న కారు వీరి కంటే ముందు వెళ్లిపోయింది. జగిత్యాల రూరల్‌ ఎస్సై సధాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల పట్టణంలోని హన్‌మాన్‌వాడకు చెందిన దంపతులు రాజమల్లు, లక్ష్మీ కూతురు సంఘవి వివాహం ఈనెల 8వ తేదీన వరంగల్‌లో జరిగింది. జనగామలో శనివారం రిసిప్షన్‌ ఉండడంతో రాజమల్లు ఆయన భార్య లక్ష్మి, కుమారుడు సంకీర్త్‌తో పాటు పెళ్లి కూతురు స్నేహితురాలు మునిరాజితో కలిసి రిసిప్షన్‌ వేడుకలకు హాజరై తిరిగి జనగామ నుంచిజగిత్యాలకు నలుగురు కారులో వస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం వేకువజామున 4గంటల ప్రాంతంలో జగిత్యాల మండలం ధరూర్‌ సమీపంలో జగిత్యాల నుంచిహైదరాబాద్‌కు వెళ్తున్న జగిత్యాల డిపోకు చెందిన సూపర్‌లగ్జరీ ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో సంకీర్త్‌, మునిరాజిలు అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. కారులో వెనక కూర్చున్న రాజమల్లు, లక్ష్మీలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని మెరుగైన చికిత్సకోసం కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు కావడంతో అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మృతుడి మేనమామ మామిడిపెల్లి శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

==================

స్నేహితురాలి పెళ్లికి తిరుపతి నుంచి వచ్చి..

హైదరాబాద్‌లో ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మునిరాజి తన స్నేహితురాలు సంఘవి వివాహవేడుకలకు హాజరవ్వడానికి తిరుపతి నుంచివచ్చింది. వరంగల్‌, జనగామలో జరిగిన వివాహ వేడుకలకు హాజరై తిరిగి పెళ్లికూతురు స్వగ్రామం జగిత్యాల తిరిగి వస్తుండగా ధరూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మునిరాజి మృతి చెందింది. దీంతో మునిరాజి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. స్నేహితురాలు పెళ్లికి హాజరై రోడ్డుప్రమాదంలో మరణించడంతో కుటుంబసభ్యులు రోదలను మిన్నంటాయి.

=======================

రిసిప్షన్‌ వేడుకలు ముగించికుని వస్తుండగా ...

జనగామ జిల్లాలో జరిగిన రిసిప్షన్‌ వేడుకలకు హాజరై జనగామ నుంచిరాజమల్లు కుటుంబ సభ్యులు జగిత్యాలకు రెండుకార్లలో బయల్దేరారు. ఒక కారులో వధూవరులు, మరోకారులో రాయమల్లు ఆయన భార్య లక్ష్మీతో పాటు కుమారుడు సంకీర్త్‌, మరో యువతి మునిరాజితో కలిసి జగిత్యాలకు వస్తున్నారు. ధరూర్‌ వద్దకు రాగానే వధూవరులు ప్రయాణిస్తున్న కారు ముందువెళ్లి వెనుకాల వస్తున్న కారుకు ప్రమాదానికి గురైంది.

==========================

నిద్రమత్తు.. అతివేగమా కారణమా ..

ధరూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు, బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా ఈ ప్రమాదానికి అతివేగమా.. నిద్రమత్తు కారణమా అని సంఘటన స్థలంలో పలువురు చర్చించుకోవటం కనిపించింది. టాటా అల్ర్టోజ్‌ అనే కారు సేఫ్టీలో చాలా ధృడమైన బాడీపార్ట్‌ కలిగిఉంటుందని, కారు ముందుభాగం నుజ్జు నుజ్జు కావడంతో అతివేగమే కారణమని భావిస్తున్నారు. ఆర్టీసీ బస్సు టైర్‌ సైతం ఊడిపోవడంతో టైర్‌ ప్రమాదానికి ముందు ఊడిందా, ప్రమాదం జరిగిన తర్వాత ఊడిందా అనే అంశం పై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి కారణాలు మాత్రం పోలీసుల విచారణ లోనే తేలాల్సి ఉంది.

Updated Date - Nov 11 , 2024 | 01:00 AM