రాహుల్ ప్రధాని అయితే.. కులగణనతో రిజర్వేషన్ల పెంపు
ABN, Publish Date - Apr 26 , 2024 | 05:51 AM
రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయితే దేశ వ్యాప్తంగా కుల గణన చేసి రిజర్వేషన్లు పెంచుతారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. మోదీ మళ్లీ ప్రధాని అయితే రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు ఎత్తేస్తారని అన్నారు.
నెహ్రూ-అంబేడ్కర్‌ల రాజ్యాంగంతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వేషన్లు
మోదీ ప్రధాని అయితే రాజ్యాంగం రద్దు
రిజర్వేషన్లు ఎత్తేస్తారు: జగ్గారెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయితే దేశ వ్యాప్తంగా కుల గణన చేసి రిజర్వేషన్లు పెంచుతారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. మోదీ మళ్లీ ప్రధాని అయితే రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు ఎత్తేస్తారని అన్నారు. గురువారం గాంధీభవన్‌లో జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడారు. నెహ్రూ, అంబేడ్కర్‌లు రాజ్యాంగాన్ని రాసి బడుగు, బలహీన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు.. మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించారని పేర్కొన్నారు. గడిచిన 75 ఏళ్లుగా రిజర్వేషన్లు అమలు చేయడం వల్లనే నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎంతో ప్రయోజనం చేకూరిందని తెలిపారు. ఒకవేళ మళ్లీ మోదీ ప్రధాని అయితే రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లను ఎత్తేస్తారని జగ్గారెడ్డి అన్నారు. దేశ ప్రజలంతా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇదని చెప్పారు. ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు మన పిల్లల భవిష్యత్‌పై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.
తెలంగాణ నుంచి 15 ఎంపీ సీట్లు గెలవాలి
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే తెలంగాణ నుంచి 14-15 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎంపీలుగా గెలవాలని జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ ప్రధాని అయితే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని చెప్పారు. గురువారం బీజేపీపై చార్జ్‌షీట్ విడుదల చేసినట్టు జగ్గారెడ్డి తెలిపారు. పదేళ్ల పాటు దేశాన్ని మోదీ ఆగం చేశారని మండిపడ్డారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. విదేశాల నుంచి నల్లధనం తీసుకొచ్చి ప్రతి నిరుపేద తెరిచిన జన్‌ధన్ అకౌంట్‌లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి.. ఒక్క పైసా వేయలేదని మండిపడ్డారు. అలాగే ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలిస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని చెప్పారు. పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
Updated Date - Apr 26 , 2024 | 05:51 AM