నేను పక్కా లోకల్.. గరీబోళ్ల బిడ్డను!
ABN, Publish Date - May 05 , 2024 | 05:40 AM
‘నేను పక్కా లోకల్.. గరీబోళ్ల బిడ్డను.. సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్ వారసుడు. పచ్చి అబద్ధాలను నిజమని నమ్మించేందుకు కుట్రలు చేస్తున్నాడు. బీజేపీ.. రిజర్వేషన్లను రద్దు చేయబోతోందంటూ విషప్రచారం
ముఖ్యమంత్రి రేవంత్ గోబెల్స్ వారసుడు..ఒక్కో కార్పొరేటర్‌కు 20 లక్షలిచ్చి కొంటున్నారు
అది ‘ట్యాపింగ్’ సొమ్మే.. ఈసీ విచారణ జరపాలి
కరీంనగర్ అభివృద్ధికి రూ.12 వేల కోట్లు తెచ్చా
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు నాన్‌లోకల్
మోదీ బతికున్నంతవరకు రిజర్వేషన్లు: బండి సంజయ్
హైదరాబాద్, మే 4 (ఆంధ్రజ్యోతి): ‘నేను పక్కా లోకల్.. గరీబోళ్ల బిడ్డను.. సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్ వారసుడు. పచ్చి అబద్ధాలను నిజమని నమ్మించేందుకు కుట్రలు చేస్తున్నాడు. బీజేపీ.. రిజర్వేషన్లను రద్దు చేయబోతోందంటూ విషప్రచారం చేస్తున్నాడు’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ‘రాజ్యాంగం నుంచి లౌకిక అనే పదాన్ని తొలగిస్తామన్నందుకు బీజేపీ రాజ్యాంగాన్నే మార్చబోతోందని, బీజేపీ నేతలను ఏ చెప్పుతో కొట్టాలని అంటున్నడు.. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వంద సార్లకుపైగా రాజ్యాంగాన్ని మార్చిన కాంగ్రెస్ నేతలను ఎన్నిసార్లు చెప్పుతో కొట్టాలి’ అని ప్రశ్నించారు.
శనివారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆదిలాబాద్ ఎమ్మె ల్యే పాయల శంకర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, వాసాల రమేశ్‌లతో కలిసి పాల్గొని సంజయ్ మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ సొమ్ముతో కాంగ్రెస్ నేతలు కరీంనగర్‌లో కార్పొరేటర్లను సంతలో పశువుల్లా కొంటున్నారని ఆరోపించారు. ఒక్కో కార్పొరేటర్‌కు రూ.20 లక్షలిచ్చారని, అందులో రూ.5 లక్షలు బ్యాంకు ఖాతాలో జమైనట్టు చర్చ జరుగుతోందన్నారు. తక్షణమే బ్యాంకు లావాదేవీలపై ఎన్నికల కమిషన్ విచారణ చేపట్టడంతోపాటు డబ్బు తీసుకున్న, ఇచ్చిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ‘నేను పక్కా లోకల్. మీరు తయారు చేసిన కార్యకర్తను. మీ కోసం పోరాటాలు చేశా. కరీంనగర్ అభివృద్ధి కోసం రూ.12 వేల కోట్లు తీసుకొచ్చాను. మరి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు మీకోసం ఎన్నడైనా పనిచేశారా? వాళ్లు నాన్ లోకల్. కాంగ్రెస్ పొరపాటున గెలిస్తే రైతులకిచ్చే ఎరువుల సబ్సిడీని ఎత్తేస్తారు’ అని అన్నారు. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించేవని, కాంగ్రె్‌సకు ప్రధాని అభ్యర్థి కూడా లేడని చెప్పారు. కేసీఆర్ ఎప్పటికీ ప్రధాని కాలేరని, అలాంటి వారికి ఎందుకు ఓటేయాలో ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు.
ఆ పదాన్ని కాంగ్రెస్సే తెచ్చింది..
‘సెక్యులర్’ అనే పదం అంబేడ్కర్ రాజ్యాంగంలో లేదని, కాంగ్రెస్ ఆ పదాన్ని ఎమర్జెన్సీ సమయంలో బలవంతంగా రాజ్యాంగంలోకి తెచ్చిందన్నది వాస్తవం కాదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఆ పదాన్ని తీసేస్తే తప్పేంటన్నారు. ‘మోదీ బతికున్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగుతాయి. ఇకపై రిజర్వేషన్లను రద్దు చేస్తారని ఎవరైనా అంటే చీపురు, చెప్పులతో ఉరికించి కొట్టాలి. రాముడిని, రాముడి అక్షింతలను హేళన చేయడమంటే రాజ్యాంగాన్ని అవమానించడమే.. కేసీఆర్ బలుపెక్కి దేవుడి తీర్థ ప్రసాదాలను, అక్షింతలను అవమానిస్తున్నాడు. తీర్థ ప్రసాదాలతో కడుపు నిండుతదా అని వాగుతున్నాడు.. ఆయనకు ప్రసాదం తింటే కడుపు నిండదేమో.. ఫుల్ బాటిల్ తాగి చికెన్, మటన్ తింటేనే కడుపు నిండుతదేమో’ అని ఎద్దేవా చేశారు.
నేడు అమిత్ షా ప్రచారం
హైదరాబాద్, మే 4 (ఆంధ్రజ్యోతి): బీజేపీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి తమ పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలతోపాటు సాయంత్రం మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రచారం చేయనున్నారు. సోమవారం బీజేపీ అధ్యక్షుడు నడ్డా పెద్దపల్లి, భువనగిరి, నల్గొండ పార్లమెంట్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారు.
కేంద్ర నిధులపై చర్చకు సిద్ధమా?
సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి లేఖ
‘గాడిదగుడ్డు’ ప్రచారంపై అభ్యంతరం
తెలంగాణ ప్రాంతానికి యూపీఏ, ఎన్డీయే హయాంల్లో వచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా? అని సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. ‘‘గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణకు రూ.9 లక్షల కోట్లు ఇచ్చిందని పునరుద్ఘాటిస్తున్నా. నా వ్యాఖ్యలతో విభేదిేస్త చర్చకు రండి. కొడంగల్‌లో అయినా సరే... అమరవీరుల స్థూపం వద్ద అయినా సరే... స్థలం, సమయం మీరే నిర్ణయించండి. వాస్తవ లెక్కలతో అర్థవంతమైన చర్చ జరిపేందుకు నేను సిద్థంగా ఉన్నాను. దీనికి మీరూ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. మోదీ హయాంలో తెలంగాణకు ఇచ్చింది ‘‘గాడిద గుడ్డు’’ అంటూ కాంగ్రెస్ ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. యూపీఏ పదేళ్ల పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రూ.1.32లక్షల కోట్లు ఇస్తే... అందులో తెలంగాణ వాటా రూ.45,000కోట్ల కన్నా మించలేదని పేర్కొన్నారు. కానీ, మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో రూ.9లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చిందని వెల్లడించారు.
Updated Date - May 05 , 2024 | 05:40 AM