ఎలక్ట్రిక్ వాహనాల హవా
ABN, Publish Date - Nov 19 , 2024 | 12:56 AM
ఎలక్ర్టిక్ వాహనాల వినియోగంపై ప్రజలు దృష్టిసారిస్తున్నారు.
- ఊపందుకుంటున్న అమ్మకాలు
- జీరో మెయింటెనెన్స్‌తో వినియోగదారుల మొగ్గు
- రిజిస్ట్రేషన్, లైఫ్‌టాక్స్ మినహాయింపు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వుం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ఎలక్ర్టిక్ వాహనాల వినియోగంపై ప్రజలు దృష్టిసారిస్తున్నారు. ప్రారంభంలో వచ్చిన సాంకేతిక లోపాలను కంపెనీలు అధిగమించడంతో ఎలక్ట్రిక్ బైక్‌లు, స్కూటర్లు, త్రీవీలర్, కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎలక్ర్టిక్ వాహనాలపై మోబిలిటీ ప్రమోషన్ స్కీమ్‌ను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలను రద్దు చేసింది. రోడ్ టాక్సును మినహాయించింది. దీంతో వినియోగదారులు ఎలక్ర్టిక్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఫ పెట్రోల్ ధరలు పెరగడంతో..
జిల్లాలో నాలుగేళ్ళుగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జరుగుతున్నా గత కొద్ది నెలలుగా ఇవి ఊపందుకున్నాయి. పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరగడం, ప్రజల్లో పర్యావరణ స్పృహరావడం ఇందుకు కారణం. జీరో మెయింటెనెన్స్‌తో ఒక యూనిట్ చార్జింగ్‌తో 100 కిలో మీటర్ల దూరం ప్రయాణించే అవకాశం ఉంది. జిల్లాలో ఎలక్ర్టిక్ కార్లు అమ్మే షోరూమ్‌లు 10, ద్విచక్ర వాహనాలు అమ్మే షోరూమ్‌లు 26 ఉన్నాయి. 2020 నుంచి 2024 నవంబర్ మూడో వారం వరకు జిల్లాలో 3,147 ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. జిల్లాలో రిజిస్టర్ అయిన వాహనాల్లో ఆర్టీసీకి అద్దెకిచ్చిన 41 హైర్ బస్సులతోపాటు త్రీవీలర్లు 55, ప్యాసింజర్ ఆటోలు 34, మోటారు సైకిళ్లు, స్కూటర్లు 2,899 ఉన్నాయి. 118 కార్లు రిజిస్టర్ అయి కరీంనగర్ రోడ్లపై తిరుగుతున్నాయి.
ఫ అందుబాటులో ప్రముఖ కంపెనీల వాహనాలు
ప్రముఖ కంపెనీలైన టీవీఎస్, బజాజ్, ఓలా, ఏథెర్, యాంపెర్ మరికొన్ని కంపెనీలు జిల్లా కేంద్రంలో షోరూంలను ఏర్పాటు చేసి ద్విచక్ర వాహనాల అమ్మకాలు సాగిస్తున్నాయి. ఈవీ వాహనాలకు కంపెనీలనుబట్టి 60 వేల నుంచి 1.85 లక్షల రూపాయల ధరలున్నాయి. 25 కిలోమీటర్ల వేగంలోపు ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఏ ఎలక్ట్రిక్ వాహనానికి రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగానే ఈ వాహనాలను రిజిస్టర్ చేస్తారు.
ఫ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటులో జాప్యం
జిల్లాకేంద్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను చార్జి చేసుకునేందుకు ఈవీ చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పాలని నిర్ణయించారు. ఇందుకోసం కలెక్టర్ 10 ప్రాంతాలను గుర్తించి నాలుగు ఏజెన్సీలకు వాటిని అప్పగించారు. ఏడాది క్రితమే వీరు అగ్రిమెంట్ చేసుకున్నా ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగిన నేపథ్యంలో చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పడం అనివార్యంగా మారింది. తెలంగాణ పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (రెడ్‌కో) ఆధ్వర్యంలో ఈ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. లీథియం సెల్స్‌తో కూడిన బ్యాటరీకి 3 సంవత్సరాలు లేదా 50 వేల కిలోమీటర్లు గ్యారంటీ ఇస్తున్నారు. 1 కిలో వాట్ బ్యాటరీ చార్జింగ్‌కు 1 యూనిట్ విద్యుత్ అవసరం ఉంటుంది. 2.2 నుంచి 5.1 కిలోవాట్ల బ్యాటరీ ఫుల్ చార్జింగ్‌కు రెండున్న ర గంటల నుంచి 5 గంటల సమయం తీసుకుంటుంది. ఒక్కసారి చార్జి చేస్తే 75 నుంచి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఆయా కంపెనీల వాహనాల బ్యాటరీలను అనుసరించి చార్జింగ్ కెపాసిటీ, సమయం, ప్రయాణించే దూరంలో తేడాలున్నాయి.
ఫ బ్యాటరీలే భారం:
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులకు బ్యాటరీలే భారంగా మారనున్నాయి. ఆయా కంపెనీలు వాహనాలను కొనుగోలు చేసిన వారికి మూడు నుంచి ఐదు సంవత్సరాలు మాత్రమే బ్యాటరీపై గ్యారంటీ ఇస్తున్నారు. ఆ తర్వాత వీరు బ్యాటరీ కొత్త బ్యాటరీ కొనాల్సి ఉంటుంది. ఒక్కో బ్యాటరీ ధర 70 వేల వరకు ఉంది. దీనిపై జీఎస్టీ అదనంగా చెల్లించాలి. వాహనంలో దాదాపు సగం ధర బ్యాటరీకే చెల్లించాల్సి రావడం కొంత మైనస్‌గా చెబుతున్నారు.
ఫ వాహనాలు.. ప్రత్యేకతలు
ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ టీవీఎస్ ఈవీ ఐక్యూబ్ అమ్మకాలు నెలకు 80 నుంచి 90 వరకు ఉంటున్నాయి. ఐదు వేరియేషన్లు, ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. వీటిధర 95 వేల నుంచి 1.85 లక్షల వరకు ఉంది. ఈ వాహనంలో రివర్స్ గేర్ ఉంది. కంపెనీ సిబ్బంది వాహనదారులకు సర్వీసింగ్ సమచారాన్ని సాఫ్ట్‌వేర్ ద్వారా అందిస్తూ వారిని అప్రమత్తం చేస్తారు.
- బజాజ్ చేతక్ వాహనాలు నెలకు 10 నుంచి 15 వరకు అమ్ముడుపోతున్నాయి. ఈ ద్విచక్ర వాహనానికి ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ కనెక్టివిటీ ఉంది. మూడు వేరియేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిధర 1.19 లక్షల నుంచి 1.66 లక్షల వరకు ఉంది. లీథియం సెల్స్‌తో కూడిన బ్యాటరీపై మూడేళ్లు లేదా 50 వేల కిలోమీటర్లు గ్యారంటీ ఇస్తున్నారు. ఈ వాహనాల వేగం గంటకు 63 నుంచి 73 కిలోమీటర్ల వరకు ఉంటుంది. రివర్స్ గేర్ సదుపాయం ఉంది. ఎల్‌సీడీ డిజిటల్ డిస్‌ప్లే ఉంది.
ఫ ఓలా ఎలక్ర్టికల్ ద్విచక్రవాహనాలు నెలకు 50 నుంచి 60 వరకు అమ్ముడవుతున్నాయి. ఈ కంపెనీలో ఐదు వేరియేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిధర 85 వేల నుంచి 1.45 లక్షల వరకు ఉంది. లీథియం సెల్స్‌తో కూడిన బాటరీ కి మూడేళ్లు లేదా 40 వేల కిలోమీటర్లు గ్యారంటీ ఇస్తున్నారు. ఆటో లాక్, రివర్స్ గేర్, మొబైల్‌ఫోన్ చార్జింగ్ వంటి అత్యాధునిక సౌకర్యాలున్నాయి. కిలోవాట్ బ్యాటరీ చార్జింగ్‌కు ఒకయూనిట్ విద్యుత్ అవసరం ఉంటుంది. బ్యాటరీ ఫుల్ చార్జింగ్‌కు 5 గంటల సమయం తీసుకుంటుంది.
ఫ యాంపెర్ షోరూంలో నెలకు 50 నుంచి 50 వాహనాలు విక్రయిస్తున్నారు. 2019లో కరీంనగర్‌లో షోరూం ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో మరో నాలుగు చోట్ల షోరూంలు ఉన్నాయి. నాలుగు రకాల ద్విచక్రవాహనాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు 59,900 రూపాయల నుంచి 1.4 లక్షల వరకు ఉంది. లీథియం బ్యాటరీ 6 గంటల్లో పూర్తి చార్జింగ్ అవుతుంది. బ్యాటరీపై మూడేళ్ల గ్యారింటీ ఇస్తున్నారు.
ఫ రెండు ఏళ్ళ నుంచి ఎలాంటి సమస్య రాలేదు
- యాగండ్ల శ్రీవైష్ణవి
రెండు సంవత్సరాల నుంచి ఓలా ఈవీ నడుపుతున్నాను. 14 వేల కిలోమీటర్ల దూరం తిరిగాను. ఇప్పటి వరకు ఎలాంటి సమస్య రాలేదు. కళాశాలకు ఈ వాహనంపైనే వెళుతున్నాను. 2022లో 1.25 లక్షలకు ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేశాను. గంటకు 100 కిలోమీటర్ల వేగం వరకు వెళ్లవచ్చు. ఫుల్ చార్జింగ్‌కు 5 గంటల సమయం పడుతుంది. లోకల్‌లో తిరిగేందుకు సౌకర్యవంతంగా ఉంది.
ఫ 100 కిలోమీటర్ల ప్రయాణానికి రూ. 20 ఖర్చు
- సుతారి శ్రీనివాస్, శివాజినగర్
18 నెలల క్రితం ఈవీ కొన్నాను. వారానికి నాలుగు యూనిట్ల విద్యుత్‌కు 20 రూపాయలు ఖర్చు అవుతుంది. గతంలో వారానికి 300 రూపాయల పెట్రోల్ ఖర్చు అయ్యేది. బ్యాటరీ సమస్య రాలేదు. జీరో మెయింటెనెన్స్ ఉంది.
----------------
Updated Date - Nov 19 , 2024 | 12:56 AM