సమగ్ర సర్వేకు సర్వం సిద్ధం
ABN, Publish Date - Nov 09 , 2024 | 12:58 AM
జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 1వ తేదీ నుంచి 3 వరకు ఇళ్ల జాబితాను సేకరించారు. 6 నుంచి 8వ తేదీ వరకు మరోసారి ఇళ్లను రివిజన్ చేసి కుటుంబాల లెక్కను పక్కాగా తేల్చారు. ఇంటింటికీ స్టిక్కర్‌ను అంటించారు. గుర్తించిన ఇళ్లలోని కుటుంబాల సర్వేను శనివారం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాఽధి, రాజకీయ, కులం వంటి వివరాలు నమోదు చేయనున్నారు.
- నేటి నుంచి ప్రారంభం
- ఇప్పటికే కుటుంబాల గుర్తింపు
- ఇంటింటికి స్టిక్కర్లు
- 1468 బ్లాక్‌లు, 1488 మంది ఎన్యూమరేటర్లు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 1వ తేదీ నుంచి 3 వరకు ఇళ్ల జాబితాను సేకరించారు. 6 నుంచి 8వ తేదీ వరకు మరోసారి ఇళ్లను రివిజన్ చేసి కుటుంబాల లెక్కను పక్కాగా తేల్చారు. ఇంటింటికీ స్టిక్కర్‌ను అంటించారు. గుర్తించిన ఇళ్లలోని కుటుంబాల సర్వేను శనివారం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాఽధి, రాజకీయ, కులం వంటి వివరాలు నమోదు చేయనున్నారు. జిల్లాలో 1,90,626 ఇళ్ల జాబితాను సిద్ధం చేశారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియను కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. మండల, మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులను నియమించారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది. ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలో కుటుంబ వివరాల షెడ్యూల్ పత్రాలను సిబ్బందికి అందజేశారు.
జిల్లాలో 190626 కుటుంభాల గుర్తింపు
1,90,626 ఇళ్ల సర్వే లక్ష్యం
జిల్లాలో ముందస్తుగా ఇళ్ల జాబితాను సిద్ధం చేశారు. దీని ప్రకారం జిల్లాలో 1,93,873 ఇళ్ల అంచనాకు 1,90,626 ఇళ్లకు స్టిక్కర్లు వేశారు. వీటికి సంబంధించిన కుటుంబాల వివరాలను గుర్తించడానికి జిల్లాను 1468 బ్లాక్‌లుగా విభజించారు. 1488 మంది ఎన్యూమరేటర్లను నియమించారు. 160 మంది సూపర్ వైజర్లు పర్యవేక్షించనున్నారు. ప్రతీ ఎన్యూమరేటర్ 150 ఇళ్లను సర్వే చేయనున్నారు. ప్రభుత్వం అందించిన 75 ప్రశ్నల పత్రం నింపడానికి కనీసం అరగంటకు పైగానే సమయం పట్టనుంది. ప్రతీ రోజు కనీసం పది ఇళ్ల వరకు తగ్గకుండా సర్వే నిర్వహించనున్నారు. సర్వే సమాచారాన్ని ముందస్తుగానే ఆయా కుటుంబాలకు తెలియజేశారు.
జిల్లాలో 50 వేల కుటుంబాల పెరుగుదల
జిల్లాలో 2011 లెక్కల ప్రకారం చూస్తే జిల్లాలో 50 వేల కుటుంబాలు అదనంగా పెరిగాయి. ఇంటింటి సమగ్ర సర్వేలో భాగంగా ప్రతీ ఇంటికి వెళ్లి స్టిక్కర్ వేస్తూ లెక్కలు తీశారు. దీని ప్రకారం జిల్లాలో 50 వేల కుటుంబాలు అదనంగా పెరిగినట్లుగా గుర్తించారు. 2011లో 1,38,992 కుటుంబాలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 1,90,626 కుటుంబాలు పెరినట్లు లెక్కలు తేలాయి.
సర్వే సమాచారంలో గోప్యత
జిల్లాలో సమగ్ర ఇంటింటి సర్వేలో 56 ప్రధాన అంశాలు 75 వరకు ప్రశ్నలను రూపొందించారు. తాజాగా ప్రశ్నల్లో కొన్ని మార్పులు చేశారు. పార్ట్ 1, పార్ట్ 2, కింద ఎనిమిది పేజిల్లో సమాచారం సేకరించినా వాటిని గోప్యంగానే ఉంచుతారు. ప్రభుత్వ పథకాలు, అర్హులైన వారికి అందించడానికి ప్రశ్నల రూపంలో సమాచారం రాబడుతున్నట్లు తెలుస్తోంది. కుటుంబం ఏ కులం, వృత్తి, మతాలు, విద్యార్హతలు, స్థిరాస్థులు, భూములు, రిజర్వేషన్ ప్రయోజనాలు, ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధి, ఇలా అనేక అంశాలు ఉన్నాయి. సర్వేను పది రోజుల వరకు పూర్తి చేసే దిశగా షెడ్యూల్ ఇచ్చారు. కానీ వివరాల సేకరణ తరువాత డేటా ఎంట్రీ వంటి అంశాలు పూర్తి నెలాఖరుకు పూర్తవుతుందని భావిస్తున్నారు.
తేలనున్న సామాజిక వర్గాల లెక్క
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో జిల్లాలోని సామాజిక వర్గాల లెక్క కూడా తేలనుంది తొలిసారిగా బీసీల లెక్క స్పష్టం కానుంది. గత ప్రభుత్వం 2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో 1.77లక్షల కుటుంబాలను సర్వే చేయగా అందులో ఎస్సీలు 1,13,870 మంది, ఎస్టీలు 26,346 మంది, బీసీలు 3,56,977 మంది, మైనార్టీలు 27,349 మంది, ఓసీలు 71,116 మంది ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం రాబోయే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లకు సర్వే లెక్కలు దోహదపడనుండడంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. కుటుంబ సర్వేలో అధికార కాంగ్రెస్ శ్రేణులు భాగస్వామ్యమయ్యే విధంగా ఆ పార్టీ పెద్దలు దృష్టి సారించారు.
Updated Date - Nov 09 , 2024 | 12:58 AM