ఆర్‌ఎఫ్‌సీఎల్ లీకేజీలపై భగ్గుమన్న రామగుండం కౌన్సిల్
ABN, Publish Date - Sep 11 , 2024 | 11:58 PM
ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి వెలువడుతున్న అమ్మోనియా లీకేజీలపై రామగుండం నగర కౌన్సిల్ భగ్గుమన్నది.
కోల్‌సిటీ, సెప్టెంబరు 11: ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి వెలువడుతున్న అమ్మోనియా లీకేజీలపై రామగుండం నగర కౌన్సిల్ భగ్గుమన్నది. బీఆర్‌ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ఆర్‌ఎఫ్‌సీఎల్ వైఖరిని నిరసిస్తూ ఆంధ్రజ్యోతి దినపత్రిక, ప్లకార్డులన ప్రదర్శిస్తూ మేయర్ పోడియం వద్ద నిరసన తెలిపారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో మేయర్ బంగి అనీల్‌కుమార్ సమావేశానికి 15నిమిషాలు వాయిదా వేశారు. సమావేశం ప్రారంభమైన తరువాత బీఆర్‌ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ఆర్‌ఎఫ్‌సీఎల్ లికేజీలపై విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్ కార్పొరేటర్ పాముకుంట్ల భాస్కర్ ‘ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్‌ఎఫ్‌సీఎల్’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో వచ్చిన కథనాన్ని చదువుతూ కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. డిప్యూటీ మేయర్ అభి షేక్‌రావుతో పాటు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు బొడ్డు రజిత, రాకం శ్రీమ తి తదితరులు కౌన్సిల్ సమావేశంలో ఆర్‌ఎఫ్‌సీఎల్ వైఖరిపై ఆగ్ర హం వ్యక్తంచేశారు. కాగా దీనిపై మున్సిపల్ డ్రైన్‌లోకి అమ్మోనియా వ్యర్థాలను వదిలిన రోజే తాము ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ సూచనలతో పరిశీలన చేశామని, ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యానికి కూడా గట్టిగా అభ్యంతరం చెప్పినట్టు తెలిపారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ వైఖరిని గర్హిస్తూ భవిష్యత్‌లో వ్యర్థజలాలు బయటకు రాకుండా చూసుకోవాలని, బ యటకు పంపితే చట్టపరమైన చర్యలు తీసకునేందుకు తీర్మానించా రు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ అభిషేక్‌రావు, బీఆర్‌ఎస్, బీ జేపీ కార్పొరేటర్లు కన్నూరి సతీష్‌కుమార్, కౌశిక లత, కిషన్‌రెడ్డి తది తరులు లేబర్‌సొసైటీపై ప్రశ్నించారు. మూడేళ్లుగా ఎన్నికలు లేవని, నిధులపై స్పష్టత లేదని ప్రశ్నించారు. నెల రోజుల్లో తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ శ్రీకాంత్ హామీ ఇచ్చారు. తన డివిజన్ లో అభివృద్ధి పనులు చేయడం లేదని కార్పొరేటర్ నగునూరి సుమ లత మేయర్ పోడియం ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. మరో కార్పొరేటర్ గాదం విజయ అభివృద్ధి చేయకపోతే తాను ఆత్మ హత్య చేసుకుంటానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశం లో కార్పొరేషన్‌లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలకు సంబంధించి మార్చి 2025 వరకు పాలనపరమైన ఆమోదం లభించింది. మేయర్ తో పాటు కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఈ ఎస్, ఈఈలు, డీఈలు, ఏసీపీ, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ పేర మొ త్తం 12కార్లు అద్దెకు తీసుకునేందుకు తీర్మానించారు. కార్పొరేషన్‌లో రోడ్డు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకో వాలని తీర్మానించారు. కార్పొరేషన్‌పరిధిలో ప్రతి ఇంటికి ఒక మొక్క పెంచాలని తీర్మానించారు. అలాగే తడి, పొడి చెత్త వేరు చేయడం తోపాటు రోడ్లు, కాలువల్లో చెత్త పడవేసే వారిపై జరిమానా విధిం చాలని నిర్ణయించారు. గోదావరిఖని కోర్టుల్లో కేసులు వాదించినందు కు లైజనింగ్ అధికారి పాత అశోక్‌కు బిల్లు చెల్లింపునకు తీర్మానిం చారు. గోదావరిఖని మెయిన్‌చౌరస్తా నుంచి మున్సిపల్ జంక్షన్ వర కు అడ్వర్‌టైజ్‌మెంట్ బోర్డులు తొలగించాలనే ప్రతిపాదనపై కౌన్సిల్ సమావేశంలో చర్చించారు. 17ఏళ్ల కాలపరిమితపై గతంలో కౌన్సిల్ తీర్మాణం లేకుండా టెండర్ ఇచ్చారని, కౌన్సిల్‌కు ఆదాయం వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో రూ.15లక్షల సీడీపీ నిధులతో కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర సామగ్రి కొనుగోలుకు తీర్మానించారు. జనగామ శివారు సర్వే నెం.599 రెసిడెన్షియల్ జోలో ఉందని, దానిని కమర్షియల్ జోన్‌గా మార్చేందుకు తీర్మానించారు.
టీయూఎఫ్‌ఐడీసీ ఏజెన్సీకి రూ.కోటి బిల్లు చెల్లింపునకు ఆమోదం
టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా రూ.100కోట్లతో చేపట్టనున్న పనులకు సంబంధించి డీపీఆర్ తయారుచేయడానికి ఎంపికైన మెస్సర్స్ ఎస్‌కే అసోసియేట్స్, హైదరాబాద్‌కు 1.07కోట్లు బిల్లు చెల్లింపునకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ నిధుల ద్వారా ఏజెన్సీకి కేవలం 0.7శాతం నిధులు చెల్లించే వెసులుబాటు ఉందని, ఎస్‌కే అసోసియేట్స్ 1.4 శాతం కోడ్ చేసినందున కార్పొరేషన్ సాధారణ నిధుల నుంచి రూ.47.12లక్షలు చెల్లించేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
రోడ్ల వెడల్పునకు తీర్మానం
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో లక్ష్మీనగర్, కళ్యాణ్‌నగ ర్ ప్రాంతాల్లో రోడ్లు వెడల్పు చేసేందుకు తీర్మానం చేశారు. ఎంత వెడల్పు అనే విషయం పొందుపర్చకుండానే ప్రతిపాదన పెట్టారు. ఓల్డ్ అశోక థియేటర్ నుంచి సాయి జువెల్లర్స్, మార్కండేయకాలనీ గణేష్‌నగర్ బోర్డు నుంచి విజయ పిల్లల హాస్పిటల్, రీగల్ షూమా ర్టు నుంచి బాలజీ స్వీట్ హౌస్, రాజేష్‌శర్మ ఇంటి నుంచి బాలాజీ స్వీట్‌హౌస్, కళ్యాణ్ మెయిన్‌రోడ్డు నుంచి ఫ్రాఫిట్ షూమార్ట్, స్వతం త్ర చౌక్ నుంచి పాత మున్సిపల్ ఆఫీస్, రీగల్ షూమార్ట్ జంక్షన్ అభివృద్ధికి తీర్మాణించారు. అలాగే స్థానిక 14వ డివిజన్ లక్ష్మీపురం నుంచి అల్లూరు రోడ్డు వరకు 30 అడుగుల బీటీ రోడ్డు వేసేందుకు కలెక్టర్‌కు నివేదిస్తూ తీర్మానించారు.
మాతంగి నర్సయ్య, మాలెం మల్లేషం విగ్రహాలు...
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో గౌతమినగర్‌జంక్షన్‌లో మాజీ మంత్రి మాతంగి నర్సయ్య విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఎ మ్మెల్యే రాజ్‌ఠాకూర్ సూచనతో తీర్మానం చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే మాలెం మల్లేషం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ ఎస్ కార్పొరేటర్ ముదాం శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు వంగ శ్రీని వాస్, ఎండీ రఫిలు విజ్ఞప్తి చేసిన మేరకు తీర్మాణాన్ని పెట్టారు. కాం గ్రెస్ కార్పొరేటర్ బొంతల రాజేష్ మల్లేషం విగ్రహాన్ని తిలక్‌నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే కళాకరుడు జాకబ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
వీధి దీపాలు లేక ప్రజలు ఛీ కొడుతున్నారు : సతీష్, కార్పొరేటర్
రామగుండం నగరపాలక సంస్థలో వీధి దీపాలు లేక ప్రజలు ఛీ కొడుతున్నారు. వీధి దీపాల నిర్వహణ లేకపోవడంతో కార్పొరేషన్ పరిధిలో రోడ్లు చీకటిమయం అవుతున్నాయి. అధికారులు ఫోన్లు కూడా ఎత్తడం లేదు. సంబంధం లేదంటూ చేతులెత్తేస్తున్నారు. డి విజన్ పరిధిలో మంచినీరు, డ్రైనేజీ వంటి సమస్యలు పరిష్కారం కావడం లేదు.
ఆర్‌ఎఫ్‌సీఎల్ జలాలతో ప్రాణాలకు ముప్పు : భాస్కర్, కార్పొరేటర్
ఆర్‌ఎఫ్‌సీఎల్ వదులుతున్న విష జలాలతో ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. నాలుగు రోజుల క్రితం నా డివిజన్‌లోని మురు గు కాలువలోకి ఆర్‌ఎఫ్‌సీఎల్ అమ్మోనియా వాటర్‌ను వదిలింది. దీంతో కళ్ల మంటలు, శ్వాస ఆడక ప్రజలు నరకం అనుభవించారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను కట్టడి చేయాలి. ఇప్పటి వరకు జెడ్‌ఎల్‌డీ పెట్టకుం డా తాత్సారం చేస్తోంది.
ప్లకార్డులతో షోలు : కాంగ్రెస్ కార్పొరేటర్ స్వామి
రామగుండం అభివృద్ధిని తొమ్మిదేళ్ల పాటు పట్టించుకోకుండా ద్రో హం చేసిన బీఆర్‌ఎస్ ఇప్పుడు ప్లకార్డులతో షో చేస్తుందని కార్పొరే టర్ మహంకాళి స్వామి ఆరోపించారు. ఈఈఎస్‌ఎల్ సంస్థ కేటీఆర్ భాగస్వామి అన్నారు. పట్టణప్రగతి నిధులనుఇవ్వకుండా ద్రోహం చేసింది బీఆర్‌ఎస్సేనని, ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో జరుగుతున్న ఇబ్బందుల కు ఆ పార్టీ ప్రభుత్వం చేసిన నిర్వాకమే కారణమన్నారు.
చురుగ్గా అభివృద్ధి పనులు : మేయర్
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధిపనులు చురుగ్గా సాగు తున్నాయని మేయర్ అనీల్ కుమార్ పేర్కొన్నారు. యూటీఎఫ్‌ఐడీ సీ, అమృత్‌పనులతో పాటు కొత్తగా రూ.8000కోట్లతో 800మెగావాట్ల విద్యుత్ కేంద్రం విస్తరణకు కూడా ఆమోదం లభించిందన్నారు. కమిషనర్ శ్రీకాంత్, అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
Updated Date - Sep 11 , 2024 | 11:58 PM