తాగునీటి పనుల బిల్లులకు తంటాలు..
ABN, Publish Date - Jun 14 , 2024 | 01:00 AM
వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణ కోసం పనులు చేయించిన అధికారులు బిల్లుల చెల్లింపులో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో జిల్లాలో పలువురు కాంట్రాక్టర్లు, మాజీ ప్రజాప్రతినిధుల వెంటబడి పనులు చేయించిన మిషన్ భగీరథ అధికారులు ప్రొసీడింగ్స్ జారీ చేసి బిల్లులు చెల్లించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

- వేసవిలో రూ.1.83 కోట్ల నిధులు మంజూరు
- కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న కాంట్రాక్టర్లు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
మిషన్ భగీరథ అధికారుల తీరు.
వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణ కోసం పనులు చేయించిన అధికారులు బిల్లుల చెల్లింపులో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో జిల్లాలో పలువురు కాంట్రాక్టర్లు, మాజీ ప్రజాప్రతినిధుల వెంటబడి పనులు చేయించిన మిషన్ భగీరథ అధికారులు ప్రొసీడింగ్స్ జారీ చేసి బిల్లులు చెల్లించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వారం రోజుల నుంచి తాగునీటి ఎద్దడి నివారణ పనులు చేసిన వాళ్లు సంబంధిత కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ పథకం ద్వారా నిత్యం తాగునీరు సరఫరా చేస్తున్నారు. గడిచిన వేసవి కాలంలో జిల్లాకు తాగునీటిని సరఫరా చేసే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు అడుగంటడంతో మిషన్ భగీరథ ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నీరు అందడం లేదు. దీంతో గ్రామాల్లో అక్కడక్కడ సరిపడా తాగునీరు ప్రజలకు అందలేదు. ఈక్రమంలో ఎక్కడైతే గ్రామాల్లో క్రిటికల్ గ్యాప్స్ ఉన్నాయో వాటిని గుర్తించాలని ప్రభుత్వం రెండు నెలల క్రితం సంబంధిత అధికారులను ఆదేశించింది. ఆ మేరకు మిషన్ భగీరథ ఇంట్రా విలేజ్ అధికారులు ఓఅండ్‌ఎం గ్రాంటు కింద జిల్లావ్యాప్తంగా కోటి 83 లక్షల రూపాయల విలువైన 171 క్రిటికల్ గ్యాప్స్ పనులను గుర్తించారు.
ఫ కోడ్ ముగిసినా ప్రొసీడింగ్స్ ఇవ్వని అధికారులు..
అంతర్గాం మండలంలో 8 పనులకు 19 లక్షలు, పాలకుర్తి మండలంలో 16 పనులకు 19 లక్షలు, రామగుండం కార్పొరేషన్, మండల పరిధిలో 24 పనులకు 38 లక్షలు, కమాన్‌పూర్ మండలంలో 5 పనులకు 3 లక్షలు, మంథని మండలంలో 25 పనులకు 16 లక్షలు, ముత్తారం మండలంలో 12 పనులకు 14 లక్షలు, రామగిరి మండలంలో 12 పనులకు 16 లక్షలు, ఎలిగేడులో 12 పనులకు 7 లక్షలు, జూలపల్లి మండలంలో 10 పనులకు 14 లక్షలు, ఓదెల మండలంలో 14 పనులకు 16 లక్షలు, పెద్దపల్లి మండలంలో 17 పనులకు 15 లక్షలు, కాల్వశ్రీరాంపూర్ మండలంలో 5 పనులకు 5 లక్షలు, సుల్తానాబాద్ మండలంలో 10 పనులకు 16 లక్షలు, ధర్మారం మండలంలో 25 పనులకు 19 లక్షలు, పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో 93 పనులకు 96 లక్షల రూపాయలతో పనులు మంజూరుచేశారు. ప్రధానంగా పైపులైన్ల మరమ్మతులు, చేతిపంపుల మరమ్మతులు, పాత స్కీంలకు మోటార్ల బిగింపు వంటి పనులు తాత్కాలికంగా చేయాలని నిర్ణయించారు. పనులన్నీ 30 వేల నుంచి 3 లక్షల లోపు మాత్రమే ఉండడంతో నామినేషన్ ప్రాతిపదికన చేయించాలని అధికారులు నిర్ణయంచారు. ఆ సమయంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో పనులు చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు. ప్రొసీడింగ్స్ ఇస్తేనే పనులు చేస్తామని చెప్పారు. ఎలాగైనా వారిని ఒప్పించి పనులు చేయించాలని ఉన్నతాధికారులు పంచాయతీ అధికారులపై ఒత్తిడి తీసుకరావడంతో ప్రతిపాదించిన పనులను మొదలు కొన్నింటిని పూర్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఈనెల 6వ తేదీ నుంచి ముగియడంతో పనులు చేసిన వాళ్లు ప్రొసీడింగులు, బిల్లుల కోసం మిషన్ భగీరథ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కానీ సంబంధిత అధికారులు ప్రొసీడింగ్స్ ఇవ్వడం లేదని చెబుతున్నారు. అప్పులు తీసుకవచ్చి తాగునీటి ఎద్దడి నివారణ కోసం మరమ్మతు పనులు చేశామని చెబుతున్నారు. తీరా పని అంతా అయిపోయిన తర్వాత సంబంధిత అధికారులు ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. ఈ విషయమై కలెక్టర్ స్పందించి తాగునీటి ఎద్దడి నివారణ పనులకు సంబంధించి ప్రొసీడింగ్స్ జారీ చేసి ఎంబీ రికార్డులు చేసి బిల్లులు మంజూరుచేయాలని కోరుతున్నారు.
Updated Date - Jun 14 , 2024 | 01:00 AM