రూ.500 బోనస్ వచ్చేసింది..
ABN, Publish Date - Nov 16 , 2024 | 01:13 AM
సన్న రకం వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు రైతుల ఖాతాల్లో గత నాలుగు రోజుల నుంచి ఆ సొమ్ము జమ అవుతుండడంతో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి.
- 455 మంది రైతుల ఖాతాల్లో జమ
- జిల్లాలో ఊపందుకున్న ధాన్యం కొనుగోళ్లు
- ఇప్పటివరకు 26,208.84 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
సన్న రకం వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు రైతుల ఖాతాల్లో గత నాలుగు రోజుల నుంచి ఆ సొమ్ము జమ అవుతుండడంతో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. బోనస్ డబ్బులు ప్రభుత్వం ఇస్తుందా, లేదా అనే సందేహాలు రైతుల్లో నెలకొనడంతో ఆందోళనకు గురయ్యారు. కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన తర్వాత ఆ వివరాలను పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకుని ప్రభుత్వానికి పంపిస్తారు. దీంతో కాస్త ఆలస్యం అవుతున్నది. చెల్లింపులు ప్రారంభం కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 455 మంది రైతుల ఖాతాల్లో 36,240 క్వింటాళ్ల ధాన్యానికి సంబంధించి కోటి 81 లక్షల 15 వేల 600 రూపాయలు జిల్లా పౌర సరఫరాల శాఖాధికారులు జమ చేశారు. జిల్లాలో ఈ సీజన్‌లో 2,09,562 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా, ఇందులో సన్న రకం 1,72,879 ఎకరాలు, 36,683 ఎకరాల్లో దొడ్డు రకం వరి పంటను సాగు చేశారు. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లాలో 327 కేంద్రాలను ఏర్పాటు చేయగా, ప్రస్తుతం 318 కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పటి వరకు 3,893 మంది రైతుల నుంచి 60 కోట్ల 80 లక్షల రూపాయల విలువైన దొడ్డు రకం ధాన్యం 15,674.08 మెట్రిక్ టన్నులు, సన్న రకం ధాన్యం 10,534.76 మెట్రిక్ టన్నుల ధాన్యం, మొత్తం 26,208.84 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 1796 మంది రైతులకు 25 కోట్ల 89 లక్షల రూపాయలు చెల్లించారు.
ఫ మూడున్నర లక్షల టన్నుల అంచనా..
కొనుగోలు కేంద్రాలకు 3 లక్షల 50 వేల టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. కోతల సమయంలో అకాల వర్షాలు పడడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. తేమ శాతం 17కు మించి ఎక్కువ రావడంతో కొందరు రైతులు వరి కోసిన వెంటనే రైస్ మిల్లర్లకు పచ్చి ధాన్యాన్నే విక్రయించారు. దొడ్డు రకం వడ్లకు క్వింటాలుకు 2100 రూపాయల వరుకు ధర పలకగా, సన్న వడ్లకు 2300 వరకు దర చెల్లించారు. ప్రస్తుతం వర్షాలు పడే పరిస్థితులు లేకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించేందుకు మొగ్గుచూపుతున్నారు. ధాన్యాన్ని నాలుగైదు రోజులు ఆరబెట్టి తేమ 17 శాతం వచ్చిన తర్వాత ధాన్యాన్ని కేంద్రాలకు తీసుక వెళుతున్నారు. రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా వచ్చే జనవరి నుంచి రేషన్ కార్డులపై సన్న బియ్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు సన్న రకం వరి పంట సాగును ప్రోత్సహించేందుకు మద్దతు ధరతో పాటు క్వింటాలు ధాన్యానికి 500 రూపాయలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు జిల్లాలో రైతులు 80 శాతం వరకు వరి పంటనే సాగు చేశారు. కేంద్రాల్లో విక్రయించిన ధాన్యం సొమ్ముతో పాటే బోనస్ సొమ్మును చెల్లించకపోవడంతో రైతుల్లో అనుమానాలు తలెత్తాయి. అసలు ప్రభుత్వం బోనస్ ఇస్తుందా, లేదా అని చర్చించుకోవడం కనిపించింది. ప్రతిపక్ష పార్టీలు సైతం రైతులకు ఇస్తామన్న బోనస్ సొమ్ము ఇవ్వడం లేదని విమర్శలు గుప్పించాయి. అయితే నాలుగు రోజుల నుంచి బోనస్ సొమ్మును పౌరసరఫరాల శాఖ అధికారులు సివిల్ సప్లయ్ కార్పొరేషన్ అధికారుల నుంచి రైతులు ఎన్ని క్వింటాళ్ల సన్న ధాన్యం విక్రయించారు, వారి ఖాతా నంబర్లను తీసుకుని గత నాలుగు రోజుల నుంచి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఫ రైతుల ఖాతాల్లోనే బోనస్ జమ చేస్తున్నాం..
- రాజేందర్, జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి
జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్న రకం ధాన్యం విక్రయించిన రైతుల వివరాలు తీసుకుని వారి బ్యాంకు ఖాతాల్లో క్వింటాలుకు 500 రూపాయలు జమ చేస్తున్నాం. బోనస్ విషయమై రైతులు ఆందోళన చెందవద్దు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరతో పాటు సన్న రకం ధాన్యానికి బోనస్ పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి. తొందరపడి రైతులు ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించవద్దు. ధాన్యంలో తేమ 17 శాతం మించకుండా చూసుకోవాలని, నాణ్యతగల ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకరావాలి.
Updated Date - Nov 16 , 2024 | 01:13 AM