నియంతృత్వ ధోరణి అవలంభిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
ABN, Publish Date - Nov 20 , 2024 | 12:33 AM
రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నియంతృత్వ ధోరణి అవలంభిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం సీపీఐ జిల్లా మూడవ మహాసభల సందర్భంగా స్థానిక ఆర్డీవో కార్యాలయం నుంచి పట్టణంలోని బీవైనగర్ షాదీఖానా వరకు ఎర్రజెండాలు చేతబూని ప్రధాన వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు.
- 21న లగచర్లకు వామపక్షనాయకులతో కలిసి వెళ్తాం
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
సిరిసిల్ల నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నియంతృత్వ ధోరణి అవలంభిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం సీపీఐ జిల్లా మూడవ మహాసభల సందర్భంగా స్థానిక ఆర్డీవో కార్యాలయం నుంచి పట్టణంలోని బీవైనగర్ షాదీఖానా వరకు ఎర్రజెండాలు చేతబూని ప్రధాన వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో తమ్మినేని మాట్లాడారు. రాష్ట్రంలో చేపట్టే పనులపై అఖిలపక్షం నాయకులతో చర్చలు జరపకుండా నియంతృత్వ ధోరణికి పాల్పడుతున్నారని అన్నారు. మూసీ నది ఒడ్డున ఉన్న ఇళ్లకు బదులుగా వారికి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వడంతోపాటు వారికి ప్రతీనెల 15వేల రూపాయలను అందించి వారిని ఆదుకోవాలన్నారు. గత ప్రభుత్వం ఫార్మాసిటికి హైదరాబాద్ శివారులో 13వేల ఎకరాలను తీసుకున్నారని అక్కడ దానిని నిర్మించకుండా సీఎం నియోజకవర్గంలోని లగచర్లలో 10వేల ఎకరాల భూములను తీసుకోవడం సరైందికాదన్నారు. ఇటీవల అ గ్రామానికి వెళ్లిన జిల్లా కలెక్టర్‌తోపాటు జిల్లా అధికారులపై దాడులు చేసిన వారిలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారిని అరెస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులను వదిలివేయడం సరైందికాదన్నారు. పోలీసులు లగచర్ల గ్రామానికి ఎవరి రానీయకుండా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ నెల 21వ తేదీన వామపక్షాల పార్టీ నాయకులతో తాను లగచర్ల గ్రామానికి వెళ్లి అక్కడి రైతులు, ప్రజలతో మాట్లాతానని మమ్ములను ఎవరు అడ్డుకుంటురో చూస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమం బలహీనంగా ఉన్నప్పటికి బలమైన పోరాటం నిర్మించిందని అన్నారు. ముఖ్యమంత్రి బుధవారం జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి నేతన్నలకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వ అర్డర్లను ప్రకటించి తన చిత్తశుద్ధిని ప్రదర్శించాలని అన్నారు. కేంద్రంలోని బీజేపీ హిందుత్వ సిద్ధాంతం కేవలం అదానీ, అంబానీ వంటి అగ్రవర్ణాల ప్రయోజనాల కోసమని అసలైన హిందువులకు మేలు జరగదని వివరించారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్, రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్‌బాబు, కూరపాటి రమేష్, జిల్లా కార్యదర్శి మూషం రమేష్, నాయకుఉలు కోడం రమణ, ఎగమంటి ఎల్లారెడ్డి, విమల, గన్నేరం నర్సయ్య, మల్లారపు అరుణ్‌కుమార్, ఎరవెల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 20 , 2024 | 12:33 AM