సమగ్ర కుటుంబ సర్వే ఘరూ
ABN, Publish Date - Nov 10 , 2024 | 01:17 AM
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సామాజిక, అర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే తొలిరోజు శనివారం సర్వే ప్రారంభమైంది. సకాలంలో సర్వే పత్రాలు అందకపోవడంతో కొన్ని గ్రామాల్లో మధ్యాహ్నం 12 గంటలకు మరికొన్ని గ్రామాల్లో మూడు గంటలకు సర్వే ప్రారంభమైంది.
- తొలిరోజు 1,92,293 కుటుంబాలకు గాను 4,853 కుటుంబాల వివరాల సేకరణ
- జిల్లాలో ఆలస్యంగా సర్వే ప్రారంభం
- వెంకట్రావుపల్లెలో సర్వేను బహిష్కరించిన గ్రామస్థులు
- మధ్యాహ్నం వరకు మండలాలకు చేరిన సర్వే పత్రాలు
- పరిశీలించిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
- మండలాల్లో నోడల్ అధికారుల పర్యవేక్షణ
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సామాజిక, అర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే తొలిరోజు శనివారం సర్వే ప్రారంభమైంది. సకాలంలో సర్వే పత్రాలు అందకపోవడంతో కొన్ని గ్రామాల్లో మధ్యాహ్నం 12 గంటలకు మరికొన్ని గ్రామాల్లో మూడు గంటలకు సర్వే ప్రారంభమైంది. కుటుంబాల సర్వేకు తొలి రోజు జిల్లాలో 1,468 బ్లాక్‌ల్లో 1,333 మంది ఎన్యూమరేటర్లు 144 మంది సూపర్‌వైజర్లు సర్వేకు వెళ్లారు. తొలిరోజు 1,92,293 కుటుంబాలకు గాను 4,853 కుటుంబాలు సర్వే చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3,438, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో 1,415 కుటుంబాల వివరాలను సేకరించారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సర్వేను తంగళ్లపల్లి మండల కేంద్రంలో అకస్మికంగా తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. ప్రొఫార్మా ప్రకారం అన్ని కుటుంబాల వివరాలు తీసుకోవాలని కోరారు. సమాచారం ఇవ్వాలని కుటుంబాలను కూడా కోరారు. సర్వేకు సంబంధించిన పత్రాలు దాదాపు 1.90 లక్షల పత్రాలు కావాల్సి ఉండగా తొలిరోజు 25 శాతం మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. వచ్చిన పత్రాలను మధ్యాహ్నం వరకు మండలాల వారీగా పంపించారు. ఎన్యూమరేటర్లకు కేవలం ఐదు పత్రాల వరకు మాత్రమే ఇవ్వగలిగారు. సర్వే ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఎన్యూమరేటర్లు కేవలం ఒక కుటుంబం, కొందరు మూడు కుటుంబాల వరకు మాత్రమే వివరాలను సేకరించగలిగారు. గ్రామాల్లో ఎన్యూమరేటర్లు మధ్యాహ్నం సర్వేకు వెళ్లడంతో ఇళ్ల వద్ద ఎవరూ లేకపోవడంతో ఎన్యూమరేటర్లు ఇబ్బందులు పడ్డారు. ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లి గ్రామస్థులు సమగ్ర కుటుంబ సర్వేను బహిష్కరించారు. గొల్లపల్లి, వెంకట్రావుపల్లి గ్రామ పంచాయతీల మధ్య సరిహద్దులపై కొత్తగా గెజిట్ రావడం, భూములు మార్చినదానికి నిరసనగా వెంకట్రావుపల్లి గ్రామస్థులు సర్వేను బహిష్కరించారు. సర్వే తొలిరోజు అనుకున్న స్థాయిలో వేగం అందుకోలేక పోయింది.
సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి.
- ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
జిల్లాలో దిగ్విజయంగా ఇళ్ల గుర్తింపు నిర్వహించారని అదే ఉత్సాహంతో సర్వే పూర్తయ్యే వరకు పకడ్బందీగా నిర్వహించాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. శనివారం సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైన సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పాల్గొన్నారు. ఇంటింటి సర్వేలో ప్రజలకు అనేక సందేహాలు వస్తుంటాయని వాటిని నివృత్తి చేస్తూ ముందుకు సాగాలని అన్నారు. సర్వేపై ప్రజలతో మమేకమైతే సందేహాలు ఏమిటో తెలుస్తాయని తక్షణమే నివృత్తి చేయడానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహలు పడకుండా ఎన్యూమరేటర్లు బాధ్యతగా సమాచారం ఇవ్వాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సర్వేలో భాగస్వాములు అయ్యేలా ఆహ్వానించాలని తెలిపారు. ప్రజల సమగ్ర సమాచారం సేకరణతో అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయడానికి దోహదపడుతాయని తెలిపారు. సర్వే ప్రక్రియలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్తున్నారని భాగస్వామమైన కలెక్టర్లు, ఎన్యూమరేటర్లు, ప్రణాళిక శాఖ అధికారులను అభినందించారు. మన దేశంలో జరిగే అతిపెద్ద కార్యక్రమాన్ని నిబద్ధతతో, అంకిత భావంతో సర్వే విజయవంతం చేయాలని అన్నారు. సర్వేలో ఆదర్శంగా నిలవాలన్నారు. కలెక్టర్ అన్నీ స్థాయిలోని అధికారులు సర్వేను పరిశీలిస్తూ సిబ్బందికి తగిన సూచనలు చేయాలని అన్నారు.
ప్రజలు సమగ్ర సమాచారం ఇవ్వాలి..
- కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వే ప్రక్రియను నిబద్ధతతో నిష్పాక్షపాతంగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని, ప్రజలు సర్వే సిబ్బందికి సహకరించి సమగ్ర సమాచారం ఇవ్వాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. శనివారం సర్వేపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేకు ఒక రోజు ముందు గ్రామాలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. ప్రజల నుంచి సేకరించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, ఎలాంటి అపోహాలు లేకుండా ప్రజలు సమగ్ర సమాచారం ఇవ్వాలని అన్నారు. సర్వేపై ప్రజలు ఎలాంటి దుష్ప్రచారాలు నమ్మవద్దని, ఎలాంటి సందేహాలు ఉన్నా ఎంపీడీవో, తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. సర్వేకు నియమించిన ఎన్యూమరేటర్లు ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ, కార్యదర్శులు, డీఆర్‌డీవో సిబ్బంది మాత్రమే ఇంటింటికి వస్తారని వారికే సమాచారం ఇవ్వాలని ఇతరులకు ఇవ్వవద్దని అన్నారు. సర్వే కోసం జారీ చేసిన బుక్‌లేట్‌లోని అంశాల్లో ఎలాంటి అనుమానాలకు, సందేహాలకు తావులేకుండా ఖచ్ఛితమైన సమాచారం సేకరించాలన్నారు. సర్వే ప్రక్రియలను సూపర్‌వైజర్లు, మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ప్రణాళిక అధికారి శ్రీనివాసచారి పాల్గొన్నారు.
Updated Date - Nov 10 , 2024 | 01:17 AM