చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు..
ABN, Publish Date - Nov 13 , 2024 | 01:02 AM
మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసేందుకు టెండర్లు దక్కించుకున్న కాంట్టాక్టర్లు సరఫరా చేయలేక చేతులెత్తేశారు. నాణ్యత లేని, తక్కువ సైజు చేప పిల్లలను చెరువులు, రిజర్వాయర్లలో పోసేందుకు కాంట్రాక్టర్లు చేసిన యత్నాలను మత్స్యకారులు తిప్పికొట్టారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసేందుకు టెండర్లు దక్కించుకున్న కాంట్టాక్టర్లు సరఫరా చేయలేక చేతులెత్తేశారు. నాణ్యత లేని, తక్కువ సైజు చేప పిల్లలను చెరువులు, రిజర్వాయర్లలో పోసేందుకు కాంట్రాక్టర్లు చేసిన యత్నాలను మత్స్యకారులు తిప్పికొట్టారు. ఆ చేప పిల్లలు తమకొద్దంటూ తిప్పి పంపించారు. చేప పిల్లలు పోసేందుకు అదను దాటి పోయిందని, తమ సొంత డబ్బులు పెట్టి ప్రైవేట్ ఫిష్ ఫామ్‌ల్లో చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువులు, రిజర్వాయర్లలో పోసి పెంచుతున్నామని, చేప పిల్లలకు బదులు నగదు ఇవ్వాలని మత్స్యకారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ పార్టీ మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తూ వస్తున్నది. చిన్నచిన్న చెరువులు, కుంటల్లో 35 నుంచి 40 ఎంఎం సైజుగల చేప పిల్లలు, పెద్ద చెరువులు, రిజర్వాయర్లలో 80 నుంచి 100 ఎంఎం సైజుగల చేప పిల్లలను పోయాల్సి ఉంటుంది. వీటిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సొంతంగా ఫిష్ పాండ్‌లు, ఫామ్‌లు, హేచరీస్ ఉన్న వారి నుంచి టెండర్లను ఆహ్వానించి ప్రతి ఏటా పంపిణీ చేస్తున్నది. ఈ చేప పిల్లలను కాంట్రాక్టర్లు నాణ్యత లేనివి, తక్కువ సైజుగల చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు ప్రతి ఏటా వినవస్తున్నాయి. సకాలంలో చెరువుల్లో చేప పిల్లలు పోయని కారణంగా, మత్స్య సహకార సంఘాలే పిల్లలను బయట కొనుగోలు చేసి చెరువుల్లో పోస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలోని 1018 చెరువులు, కుంటలు, శ్రీపాద ఎల్లంపల్లి, పార్వతీ (సుందిళ్ల) బ్యారేజీ, సరస్వతీ (అన్నారం) బ్యారేజీలో ఒక కోటి 90 లక్షల చేప పిల్లలు పోయాలని నిర్ణయించారు. ఆ మేరకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించినప్పటికీ, 78 లక్షల 80 వేల 205 చేప పిల్లలను సరఫరా చేసేందుకు చిలుక సురేష్, వినోద్ అనే కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకున్నారు.
ఫ టెండర్లలో జాప్యంతో..
వాస్తవానికి చేప పిల్లలను జూలై 15 తర్వాత చెరువుల్లో పోయాల్సి ఉండగా, టెండర్లలో జాప్యం జరగడంతో ఇప్పటికే మత్స్యకారులు సొంతంగా డబ్బులు వెచ్చించి ప్రైవేట్‌గా సీడ్ కొనుగోలు చేసి చెరువుల్లో పోసుకున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న చేప పిల్లలు నిర్ణీత సైజులో లేకపోవడం, నాణ్యత లేని కారణంగా వాటిని తిరస్కరించారు. వాస్తవానికి 35 నుంచి 40 ఎంఎం సైజు గల చేప పిల్లలు ప్రైవేట్ ఫామ్‌ల్లో ఒక చేప పిల్ల రూపాయి నుంచి రూపాయి 20 పైసలకు, 80 నుంచి 100 ఎంఎం సైజుగల చేప పిల్లలు దొరికితే, కాంట్రాక్టర్లు మాత్రం అంతకంటే తక్కువ ధరకే టెండర్లు వేసి నిర్ణీత ప్రమాణాలు పాటించడం లేదని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలకుర్తి, అంతర్గాం, మంథని ప్రాంతంలోని చెరువులు, ఎల్లంపల్లి రిజర్వాయర్‌లో చేప పిల్లలు పోసేందుకు కాంట్రాక్టర్లు తీసుకవచ్చిన చేప పిల్లలను మత్స్యకారులు వాపస్ పంపించారు. అవి నిర్ణీత సైజులో లేకపోవడమే గాకుండా నాణ్యతగా కూడా లేవని మత్స్యకారులు తెలిపారు. కేవలం 7 చెరువుల్లో మాత్రమే లక్షా 48 వేల చేప పిల్లలను పోశారు. పదిహేను రోజుల క్రితం వరకు ఇక్కడ పని చేసిన ఎఫ్‌డీవో కాంట్రాక్టర్లు సరఫరా చేసే చేప పిల్లలను ఫామ్‌ల వద్దకు వెళ్లి పరిశీలించకుండానే అనుమతించారు. నాణ్యత ప్రమాణాలను పాటించకుండానే చేప పిల్లలను పోసేందుకు తీసుకరాగా, వాటిని మత్స్యకారులు తిప్పి పంపించారు. అధికారులు నిర్లక్ష్యం వల్ల మత్స్యకారులకు ప్రభుత్వ ఫలాలు అందడం లేదని భావించిన అధికారులు సదరు ఎఫ్‌డీవోను జిల్లా నుంచి బదిలీ చేయడం గమనార్హం. అయితే ప్రస్తుతం చెరువులు, కుంటల్లో చేప పిల్లలు పోసినా ప్రయోజనం ఉండదని, ఇదివరకే తాము చేప పిల్లలు పోశామని, చేప పిల్లలకు బదులు నగదు ఇవ్వాలని మత్స్యకారులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై జిల్లా మత్స్యశాఖాధికారి నరేష్ కుమార్ నాయుడిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, కాంట్రాక్టర్ చేప పిల్లలను సరఫరా చేయడం లేదని ఉన్నతాధికారులకు నివేదించామని తెలిపారు.
Updated Date - Nov 13 , 2024 | 01:02 AM