దారి మళ్లుతున్న షెడ్లు
ABN, Publish Date - Nov 13 , 2024 | 01:05 AM
వర్కర్ టు ఓనర్ పథకంపై సిరిసిల్ల నేతన్నల ఆశలు సన్నగిల్లుతున్నాయి. మరమగ్గాల కార్మికులను యజమానులుగా మార్చాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం వర్కర్ టు ఓనర్ పథకానికి శ్రీకారం చుట్టుంది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో షెడ్ల నిర్మాణం చేపట్టింది. పనులు పూర్తి చేసి కార్మికులకు అందించాల్సి ఉండగా షెడ్లను ఇతర అవసరాలకు కేటాయిస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
వర్కర్ టు ఓనర్ పథకంపై సిరిసిల్ల నేతన్నల ఆశలు సన్నగిల్లుతున్నాయి. మరమగ్గాల కార్మికులను యజమానులుగా మార్చాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం వర్కర్ టు ఓనర్ పథకానికి శ్రీకారం చుట్టుంది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో షెడ్ల నిర్మాణం చేపట్టింది. పనులు పూర్తి చేసి కార్మికులకు అందించాల్సి ఉండగా షెడ్లను ఇతర అవసరాలకు కేటాయిస్తున్నారు. తాజాగా సిరిసిల్ల బైపాస్ రోడ్డులో వర్కర్ టు ఓనర్ పథకం కోసం నిర్మించిన షెడ్లు గోదాములుగా మారిపోతున్నాయి. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘానికి రెండు గోదాములు కేటాయించారు. ఇతర అవసరాలకు ఉపయోగించడానికి కూడా పరిశీలిస్తున్నారు. దీంతో కార్మికులు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాల వైపు అడుగులు వేస్తున్నారు. వర్కర్ టు ఓనర్ పథకం షెడ్లను గోదాములకు ఇవ్వవద్దని, పథకాన్ని కార్మికులకు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. జౌళి శాఖ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. వర్కర్ టుఓనర్ పథకాన్ని అందించడంతోపాటు బతుకమ్మ చీరల యారన్ సబ్సిడీని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
నేతన్నల ఉపాధిపై ప్రభుత్వం దృష్టి
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ప్రభుత్వ ఆర్డర్లు లేక నేత కుటుంబాల్లో కార్మికుల ఆత్మహత్యలు విషాదం నింపిన నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ ఆర్లర్లు ఇవ్వడంతోపాటు బతుకమ్మ చీరల స్థానంలో స్వశక్తి సంఘాల సభ్యులకు చీరలు అందించే ప్రక్రియను ముందుకు తీసుకొచ్చింది. దీంతో నేత కార్మికుల కుటుంబాల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఇదే క్రమంలో గత ప్రభుత్వం ప్రభుత్వం ఆర్డర్లు అందిస్తూనే శాశ్వత ఉపాధిపై దృష్టి సారించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారులో అపెరల్ పార్కు, వర్కర్ టు ఓనర్ పథకాలకు శ్రీకారం చుట్టారు. అపెరల్‌పార్కులో ఉత్పత్తులు మొదలై మహిళలకు ఉపాధి పొందుతున్నారు. ఇదే క్రమంలో పవర్‌లూం నేత కార్మికులను యజమానులుగా మార్చే పథకం చేరువ కాబోతుందని భావిస్తున్న క్రమంలో ప్రభుత్వం మారిపోయింది. వర్కర్ టు ఓనర్ విధి విఽధానాల్లో మార్పులు వస్తాయా? లేదా పథకమే ఉంటుందో లేదో? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడిచినా వర్కర్ టు ఓనర్ పథకంపై ప్రభుత్వం నిర్ణయం తేలకపోవడంతో నేత కుటుంబాల్లో సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే అపెరల్ పార్కు సమీపంలోని వర్కర్ టు ఓనర్ పథకంలో వర్క్‌షెడ్లు నిర్మించారు. వర్క్‌షెడ్లలో మోడల్‌గా కార్మికులు పరిశీలించడానికి మరమగ్గాలను, కండెల మిషన్లు ఇతర పరికరాలను ప్రదర్శనకు ఉంచారు. దీంతో వీవింగ్ పార్కు అందుబాటులోకి వస్తుందని సిరిసిల్ల నేతన్నలు భావించారు. వర్కర్‌టు ఓనర్ పథకంలో లబ్ధిదారులను ఎంపిక చేయడానికి కసరత్తు ప్రారంభించిన క్రమంలోనే ఎన్నికల కోడ్ రావడంతో నిలిచిపోయింది.
రూ.374 కోట్లతో నిర్మాణం
జిల్లా కేంద్రం మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ వద్ద 88 ఎకరాల్లో రూ.374 కోట్లతో వీవింగ్ పార్కు నిర్మాణం చేపట్టారు. మొదటి విడతలో 1104 మంది కార్మికులకు వర్క్‌షెడ్లను నిర్మించి అందించాలనే లక్ష్యంగా పనులు ప్రారంభించారు. రోడ్లు, నీటి వసతి, కరెంట్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించారు. 46 వర్క్‌షెడ్లను నిర్మించాలనే లక్ష్యంగా పెట్టుకొని నిర్మాణాలు చేపట్టారు. వర్క్‌షెడ్ల నిర్మాణం చివరి దశకు చేరకుంది. ఇందులో కార్మికులకు మొదటి విడతలో 4416 మరమగ్గాలను గ్రూప్ షెడ్ల కింద అందించాలి. ఒక్కో కార్మికుడికి 800 చదరపు అడుగుల్లో స్టోర్‌రూంతో కలిపి అందిస్తారు. ఇందులో నాలుగు సెమీ అటోమేటిక్ మరమగ్గాలు, కండెలు చుట్టే యంత్రం ఇస్తారు. పార్కులో 60 వార్పిన్ మిషన్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఒక్కో యూనిట్ ధర రూ.8 లక్షలుగా ముందు నిర్ణయించారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.15 లక్షల వరకు చేరుకునే అవకాశం ఉంది. ఇందులో పది శాతం లబ్ధిదారుడి వాటాధనం, 50 శాతం ప్రభుత్వ రాయితీ, 40 శాతం బ్యాంక్ రుణం ఉండే విధంగా పథకం ఏర్పాటు చేశారు. మరమగ్గాల ఎంపిక కోసం తాత్కాలికంగా నాలుగు ఆటోమేటిక్ మగ్గాలను కూడా పార్కులో ఉంచారు. విభిన్నమైన వస్త్రాలను ఇందులో తయారు చేసే అవకాశం ఉంటుంది. అయితే సిరిసిల్లలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేస్తున్న వీవింగ్ పార్కులో కొందరికే మరమగ్గాల యూనిట్లు దక్కే అవకాశం ఉండడంతో మిగతా కార్మికులు నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగంలో జియో ట్యాగింగ్ చేసిన మరమగ్గాలు 30,352 ఉన్నాయి. వీటిపై 6500 మంది పని చేస్తున్నారు. అనుబంధ పరిశ్రమల్లో మరో 6 వేల మంది వరకు పనిచేస్తున్న వారు ఉన్నారు. ప్రభుత్వం మొదటి దశలో కేవలం 1104 మందికే యూనిట్లను అందించడంతో మిగతా కార్మికులు నిరీక్షించే పరిస్థితి ఉంది.
Updated Date - Nov 13 , 2024 | 01:05 AM