ఇంకుడు గుంతలపై ఏదీ పట్టింపు?
ABN, Publish Date - May 28 , 2024 | 01:41 AM
నీటి చుక్కను ఒడిసి పట్టుకునేందుకు ప్రతి ఇంట్లో ఇంకుడుగుంతలను నిర్మించుకోవాలని ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను పట్టించుకునే వారే లేకుండా పోయారు.
కరీంనగర్ టౌన్, మే 27: నీటి చుక్కను ఒడిసి పట్టుకునేందుకు ప్రతి ఇంట్లో ఇంకుడుగుంతలను నిర్మించుకోవాలని ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను పట్టించుకునే వారే లేకుండా పోయారు. దీనితో ఇంకుడుగుంతల నిర్మాణాలు ఫీజు చెల్లింపులకే పరిమితమవుతోంది. గతంలో ప్రభుత్వాలు ప్రజలకు నీటి సంరక్షణ కోసం ఇంకుడుగుంతల నిర్మాణాలు, కాంటూరు కందకాల తవ్వకాల ఆవశ్యకతను వివరించాయి. వర్షపు నీటిని వృధాగా పోనివ్వకుండా ప్రతి ఇంట్లో ఇంకుడుగుంతలను నిర్మించుకోవాలని సూచించాయి. నగరాలు, పట్టణాల్లోనే కాకుండా పల్లెల్లో కూడా ఇంకుడుగుంతల ఆవశ్యకతను వివరించాయి. కొత్తగా ఇళ్లను నిర్మించుకునే వారు తప్పనిసరిగా ఇంకుడుగుంతను ఏర్పాటు చేసుకోవాలని, లేకపోతే ఇంటి నిర్మాణ అనుమతి ఇవ్వొద్దని నిబంధన విధించింది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ స్థలాల్లో ఇంకుడుగుంతలను నిర్మించి నీరు వృఽథాగా పోకుండా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ కార్యాలయాలు, పార్కులు, ఇతర ఖాళీ స్థలాల్లో కూడా ఇంకుడుగుంతలను నిర్మించారు. భూగర్భ జలాలు కొంతమేరకు పెరిగాయి.
ఫ నిబంధనలు ఉన్నా..
సిమెంట్ రోడ్లతో రోజురోజుకు పట్టణాలు, నగరాలు కాంక్రిట్ జంగిల్స్‌గా మారుతున్నాయి. దీంతో 300 చదరపు అడుగులు, ఆపై స్థలంలో ఇళ్లను, భవనాలను, బహుళ అంతస్తు భవనాలను నిర్మిస్తే ఆయా ఇంటి నిర్మాణ స్థలాన్ని బట్టి ఇంకుడుగుంతలను నిర్మించాలని సూచించింది. ఇంటి నిర్మాణ అనుమతి సమయంలో భవన నిర్మాణ చార్జీలతోపాటు ఇంకుడుగుంతను నిర్మించుకునే వరకు అందుకు అయ్యే ఖర్చును డిపాజిట్ రూపంలో మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో అందజేయాలని ఆవేశించింది. దీంలో కొత్తగా ఇళ్ళు నిర్మించే వారు ఇంకుడుగుంతల కోసం డిపాజిట్ చెల్లిస్తున్నారు. ఆ తర్వాత నామమాత్రంగా గుంతలు తవ్వి ఇంకుడుగుంత నిర్మించామంటూ ఫొటోలు జత చేసి డిపాజిట్లను వాపసు తీసుకెళుతున్నారు. మెజార్టీ ఇళ్లలో ఇంకుడు గుంతలను నిర్మించకుండా డిపాజిట్ మొత్తాన్ని జమ చేసి అనుమతి తీసుకొని ఇళ్లు, భవనాలను నిర్మించుకుంటున్నారు.
ఫ వృథాగా పోతున్న వర్షపు నీరు
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో 80 వేలకుపైగా ఇళ్లు, భవనాలు, వాణిజ్య భవనాలు, బహుళ అంతస్తు భవనాలు ఉన్నాయి. ఇందులో 25 శాతం ఇళ్లలో ఇంకుడుగుంతలను నిర్మించనేలేదు. ప్రతిరోజు వినియోగించే నీటితోపాటు వర్షపు నీటిని కూడా ఒడిసిపట్టి ఇంకుడుగుంతలకు మళ్లిస్తే భూగర్భజలాలు అడుగంటకుండా ఉంటాయని ప్రభుత్వం భావించి ఇంకుడు గుంతల నిబంధనను తప్పనిసరి చేసింది. ఇంకుడుగుంతలపై ప్రభుత్వం కానీ, పాలకులు కానీ, ప్రజలు కానీ పెద్దగా శ్రద్ధ తీసుకోక పోవడంతో ఇంకుడుగుంతలు కనిపించడం లేదు. దీంతో నీరు వృథాగా పోవడమేకాకుండా భవిష్యత్‌లో తాగు, సాగునీటికి ఇబ్బందులు మరింత పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు. ఈ యేడు ఎండలు ఫిబ్రవరి, మార్చి నెల నుంచే దంచికొడుతుండడంతో ఇప్పటికే చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో నీటి మట్టం పడిపోయింది. ఇళ్లలోని బోరుబావులు, బావులు, వ్యవసాయబావుల్లో నీటి జాడ కనిపించకుండా పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు ఇంకుడుగుంతల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నీటి ఇబ్బందులు రాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - May 28 , 2024 | 01:41 AM