‘ఉపాధి’ పనులకు కసరత్తు
ABN, Publish Date - Nov 16 , 2024 | 01:10 AM
ఉపాధిహామీ పనులు గ్రామీణ ప్రాంతాల్లోని వలసలకు అడ్డుకట్ట వేస్తున్నాయి. ఉన్న ఊళ్లోనే ఉపాధి పొందే వీలు కలుగుతోంది. వ్యవసాయ కూలీలు, మహిళలకు ఉపాధిహామీ పనులతో ఆర్థిక వెసులుబాటు చేకూరుతోంది.
- 2025-26 సంవత్సరానికి పనుల గుర్తింపునకు గ్రామ సభలు
- వ్యవసాయ ఆధారిత పనులపై ప్రత్యేక దృష్టి
- ఈ సారి ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి అవకాశాలు
- జిల్లాలో 2 లక్షల 677 మంది కూలీలు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
ఉపాధిహామీ పనులు గ్రామీణ ప్రాంతాల్లోని వలసలకు అడ్డుకట్ట వేస్తున్నాయి. ఉన్న ఊళ్లోనే ఉపాధి పొందే వీలు కలుగుతోంది. వ్యవసాయ కూలీలు, మహిళలకు ఉపాధిహామీ పనులతో ఆర్థిక వెసులుబాటు చేకూరుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 లక్షల 677 మంది కూలీలకు ఉపాధి పని లభిస్తోంది. ఇందుకోసం అధికారులు ప్రతీ సంవత్సరం గ్రామ సభలు నిర్వహించి లేబర్ బడ్జెట్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా 2025 - 2026 ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన పనుల రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. ఈ నెల చివరిలోగా ఉపాధిహామీ యాక్షన్ ప్లాన్ పూర్తి చేయనున్నారు. వచ్చే సంవత్సరం గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టబోయే పనులు గుర్తించడంతో కార్మిక బడ్జెట్‌ను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు రూపొందిస్తున్నారు. ఇందుకోసం గ్రామాల్లో రైతులు, ప్రజాప్రతినిధులు, ఉపాధి కూలీలతో గ్రామసభలు నిర్వహించి స్థానికంగా జీవనోపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులను గుర్తిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది కూలీలకు పనులు కల్పించడంపై దృష్టి పెట్టారు.
వ్యవసాయ పనులపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో వచ్చే సంవత్సరంలో ఉపాధి పనుల్లో వ్యవసాయ ఆధారిత పనులకు ప్రాధాన్యం ఇచ్చే దిశగా పనులను గుర్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 60 శాతం వ్యవసాయానికి సంబంధించిన పనులు, 40 శాతం ఇతర పనులను ఎంపిక చేస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించిన నీటి కుంటలు, పంటకాలువల నిర్మాణం, బావులు, చెక్‌డ్యాంలు, కాలువల పూడికతీత, భూ అభివృద్ధి పనులు, భూగర్భ జలాలు పెంచే దిశగా ఇంకుడుగుంతల నిర్మాణం, గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ కేంద్ర భవనాలు, నర్సరీలు పశువుల పాకల నిర్మాణాలు వంటి పనులను గుర్తిస్తున్నారు.
ఉపాధిహామీ పనుల్లో ట్రాన్స్ జెండర్లు
ట్రాన్స్ జెండర్లు సమాజంలో గౌరవ పదంగా జీవించే దిశగా జాతీయ ఉపాధిహామీ పథకంలోనూ అవకాశాలు కల్పిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఉపాధి అవకాశాలు మెరుగు పర్చే దిశగా పలు కార్యక్రమాలను ట్రాన్స్ జెండర్ల కోసం ఏర్పాటు చేస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఎలాంటి వివక్షా చూపకుండా జాబ్‌కార్డులను మంజూరు చేయడంతోపాటు ఉపాధిహామీ పనులను అప్పగించనున్నారు. ఇప్పటికే గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు అందాయి. జిల్లాలో 255 గ్రామ పంచాయతీల్లో ఏ గ్రామంలో ట్రాన్స్ జెండర్‌లు ఉన్నారు. ఎంతమంది ఏ విధంగా ఉపాధి పొందుతున్నారనే వివరాలను సేకరిస్తున్నారు. ట్రాన్స్ జెండర్లను గుర్తించి ఆధార్ కార్డు ఆధారంగా జాబ్‌కార్డు ఇవ్వనున్నారు. ఒక గ్రామంలో ఇద్దరికంటే ఎక్కువ ఉంటే వారిని ఒక గ్రూప్‌గా ఏర్పాటు చేస్తారు. ట్రాన్స్‌జెండర్లకు భరోసా ఇచ్చే విధంగా ఉపాధి కల్పిస్తున్నారు.
జిల్లాలో 19.04 లక్షల పనిదినాలు పూర్తి
జిల్లాలో 98 వేల జాబ్ కార్డులు ఉండగా 2 లక్షల 677 మంది కూలీలు ఉన్నారు. వీరిలో 99,203 మంది పురుషులు, 1,01,474 మంది మహిళలు ఉన్నారు. ఉపాధిహామీ ద్వారా నిత్యం 1,01,764 మంది ఉపాధి పొందుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 27,55,773 పనిదినాలు కల్పించే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ రూపొందించగా ఇప్పటివరకు 19 లక్షల 4856 పనిదినాలు కల్పించారు. దీని ద్వారా రూ.43.61 కోట్ల వేతనం కూలీలకు అందించారు. జిల్లాలో బోయినపల్లి మండలంలో 1,12,286 పనిదినాలు కల్పించగా చందుర్తింలో 1,45,114 పనిదినాలు, ఇల్లంతకుంటలో 1,99,358 పనిదినాలు, గంభీరావుపేటలో 2,15,765 పనిదినాలు, కోనరావుపేటలో 2,10,856 పనిదినాలు, ముస్తాబాద్‌లో 1,78,389 పనిదినాలు, రుద్రంగిలో 68,372 పనిదినాలు, తంగళ్లపల్లిలో 2,44,210 పనిదినాలు, వీర్నపల్లిలో 1,67,319 పనిదినాలు, వేములవాడలో 29,831 పనిదినాలు, వేములవాడ రూరల్‌లో 90,495 పనిదినాలు, ఎల్లారెడ్డిపేటలో 2,42,861 పనిదినాలు కల్పించారు. ఇప్పటివరకు మేటీరియల్ బడ్జెట్‌లో రూ.45.33 కోట్లు ఖర్చు చేశారు.
Updated Date - Nov 16 , 2024 | 01:10 AM