గ్రూప్-3 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
ABN, Publish Date - Nov 15 , 2024 | 12:42 AM
జిల్లాలోని అన్ని కేంద్రాల్లో ఈ నెల 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు
- ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్
- పరీక్షల నిర్వహణపై అధికారులు, సిబ్బందికి శిక్షణ
సిరిసిల్ల కలెక్టరేట్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని కేంద్రాల్లో ఈ నెల 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లో గురువారం గ్రూప్-3 పరీక్షల నిర్వహణపై అబ్జర్వర్స్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్స్, చీఫ్ సూపరింటెండెంట్‌లు, ఫ్లయింగ్ స్క్వాడ్‌కు శిక్షణ అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఆదివారం, సోమవారా ల్లో ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9.30 గంటలు, మధ్యాహ్నం 2.30 గంటల తరువాత పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని వారు తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 7,062 మంది పరీక్షకు హాజరుకాను న్నారని వివరించారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే కేంద్రాల్లోకి అనుమతించాలని స్పష్టం చేశారు.
- జిల్లాలో 25 పరీక్షా కేంద్రాలు..
జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గంలో 18 కేంద్రాలు, వేములవాడ నియోజకవర్గంలో ఏడు మొత్తం 25 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షకు ఒక రోజు ముందు అన్ని పరీక్షకేంద్రాల్లో గదులు, ఇతర ఏర్పాట్లు తనిఖీ చేయాలని సూచించారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సిబ్బంది మందులు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బస్‌లు నడపాలని, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు ఆయా కేంద్రాల్లో పరిశుభ్రత పనులు, తాగునీటి వసతి కల్పించాలని ఆదేశించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచుతామని పేర్కొన్నారు. ప్రతి అభ్యర్థి ఒక రోజు ముందే పరీక్ష కేంద్రాన్ని సరి చూసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీలు చంద్రయ్య, శేషాద్రిని రెడ్డి, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్సీఓ, జేఎన్టీయూ అగ్రహారం కళాశాల ప్రిన్సిపాల్స్, జిల్లా అధికారులు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 15 , 2024 | 12:42 AM