పెరిగిన పత్తి విత్తనాల ధరలు...
ABN, Publish Date - May 27 , 2024 | 12:26 AM
గత సంవత్సరం పత్తి పంట దిగుబడి రాక నష్టాల్లో ఉన్న పత్తి రైతులపై కేంద్ర ప్రభుత్వం అదనపు భారం మోపింది. రెండేళ్లుగా పత్తి రైతులు చీడ పీడల బెడదతోపాటు పత్తి దిగుబడి గణనీయంగా తగ్గింది.
హుజూరాబాద్, మే 26: గత సంవత్సరం పత్తి పంట దిగుబడి రాక నష్టాల్లో ఉన్న పత్తి రైతులపై కేంద్ర ప్రభుత్వం అదనపు భారం మోపింది. రెండేళ్లుగా పత్తి రైతులు చీడ పీడల బెడదతోపాటు పత్తి దిగుబడి గణనీయంగా తగ్గింది. హుజూరాబాద్ డివిజన్‌లోని జమ్మికుంట, హుజూరాబాద్, వీణవంక, ఇల్లందకుంట, శంకరపట్నం, సైదాపూర్ మండలాలు ఉండగా 25వేల ఎకరాల్లో బీటీ-2 పత్తి సాగు చేస్తారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం కంటే ఈ సారి ఒక్కో ప్యాకెట్ ధర కేంద్ర ప్రభుత్వంలోని ఫార్మర్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ 11 రూపాయలు పెంచింది. 2023 సంవత్సరంలో బీటీ-2 పత్తి విత్తనానికి ఒక ప్యాకెట్‌కు 853 రూపాయల ధర ఉండగా, ప్రస్తుతం 864 రూపాయలకు చేరుకుంది. డివిజన్‌లో 25వేల ఎకరాల్లో పత్తి సాగు అవుతుండగా, ఎకరాకు 2 పత్తి ప్యాకెట్లు అవసరమవుతాయి. విత్తనాలు పెట్టిన తర్వాత వర్షాలు సమృద్ధిగా కురిస్తే 65 శాతం మాత్రమే మెలకెత్తుతాయి. పోగుంటలకు పత్తి గింజలు అవసరం ఉంటాయి. మొత్తంగా 45వేల పత్తి ప్యాకెట్లు హుజూరాబాద్ డివిజన్‌కు అవసరమవుతాయి. గత ఏడాది ఒకేసారి వర్షాలు కురిసి, ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేశాడు. పంట చేతికొచ్చే దశలో ఎర్ర పురుగు సోకి రైతులు ఆర్థికంగా నష్టపోయారు. మార్కెట్‌కు పత్తిని తీసుకెళ్లితే గిట్టుబాటు ధర లేక రైతులు ఆర్థికంగా నష్టపోయారు. ప్రస్తుతం పత్తి ప్యాకెట్లపై ధరలు పెంచడంతో రైతులపై ఆర్థిక భారం పడనుంది. ఇప్పటికే మార్కెట్లోకి పత్తి గింజలు అందుబాటులోకి వచ్చాయి. వ్యవసాయాధికారుల సూచనల మేరకే మేలైనా విత్తనాలు కొనుగోలు చేయాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.
ఫ అందుబాటులో పత్తి విత్తనాలు
- సునీత, ఏడీఏ, హుజూరాబాద్
రైతులకు ఈ వర్షాకాలం నుంచే పెంచిన పత్తి విత్తనాల ధరలు అందుబాటులోకి వస్తాయి. ప్రతి పత్తి ప్యాకెట్‌పై కేంద్ర ప్రభుత్వం పత్తి ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బీటీ-2 పత్తి విత్తనాలు హుజూరాబాద్ డివిజన్‌లో 20వేల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. మిగితా పత్తి విత్తనాలు జూన్ మొదటి వారం వరకు అందుబాటులో ఉంచుతాం. మొదటి వర్షానికే రైతులు విత్తనాలు విత్తి నష్టపోవద్దు. అదును చూసి పత్తి విత్తనాలు విత్తుకోవాలి. విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రైతులు తప్పని సరిగా ఎరువుల దుకాణాదారుడి నుంచి రసీదులను తీసుకోవాలి.
Updated Date - May 27 , 2024 | 12:26 AM