ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఊపందుకున్న ధాన్యం కొనుగోళ్లు

ABN, Publish Date - Nov 15 , 2024 | 01:05 AM

జిల్లాలో వానాకాలం సీజన్‌ ధాన్యం కొనుగోళ్లకు కేంద్రాలు ప్రారంభించినా పది రోజుల నుంచి మాత్రమే తూకం మొదలైంది.

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

జిల్లాలో వానాకాలం సీజన్‌ ధాన్యం కొనుగోళ్లకు కేంద్రాలు ప్రారంభించినా పది రోజుల నుంచి మాత్రమే తూకం మొదలైంది. మిల్లర్ల ధాన్యం దింపుకోకపోవడం, అగ్రిమెంట్లు జరగకపోవడం వంటి సమస్యలతో కొనుగోళ్లు ఆలస్యంగా మొదలయ్యాయి. ప్రభుత్వం మిల్లర్లతో చర్చలు జరిపిన నేపఽథ్యంలో కొనుగోళ్లు నెమ్మదిగా వేగం పుంజుకుంటున్నాయి. జిల్లాలో పౌరసరఫరాల అధికారులకు మిల్లర్లకు మధ్య సమన్వయం లోపించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ధాన్యం సేకరణలో జాప్యం కావడంపై ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో జిల్లా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. స్వయంగా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ప్రత్యేక దృష్టిపెట్టి చర్యలు చేపట్టారు. ప్రత్యేక అధికారి ఆర్వీ కర్ణన్‌ జిల్లాలో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ కొనుగోలు కేంద్రాల్లో సమస్యలను తెలుసుకు న్నారు. దీంతో నెల రోజులుగా ధాన్యం కుప్పలతోనే రైతులు ఇబ్బందులు పడ్డ పరిస్థితులు తొలగిపోతున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

- 3 లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోలు లక్ష్యం

జిల్లాలో రైతులకు అందుబాటులో ఉండే విధంగా 248 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. 240 కేంద్రాల్లో కొనుగోళ్లు చేస్తున్నారు. జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో సాగు చేసిన వరి పంట ద్వారా 4.37 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో 60 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైతులు స్థానికంగా వినియోగించుకోగా 3.77 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మార్కెట్‌లోకి వస్తుందని అందులో 77,885 మెట్రిక్‌ టన్నులు మిల్లర్లు నేరుగా కొంటారని అంచనాలు వేశారు. మిగిలిన మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పౌరసరఫరాల శాఖ కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబరులో 25 వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉండగా కొనుగోళ్లు చేయలేకపోయింది. నవంబరులో కొనుగోళ్లు ప్రారంభించి 53,738 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. మిల్లులకు 50,196 మెట్రిక్‌ టన్నుల ధాన్యం తరలించారు. ఐకేపీ ద్వారా 10,837 మెట్రిక్‌ టన్నులు, సింగిల్‌విండోల ద్వారా 41,038 మెట్రిక్‌ టన్నులు డీసీఎంఎస్‌ ద్వారా 882 మెట్రిక్‌ టన్నులు, మెప్మా ద్వారా 979 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.

- రైతుల ఖాతాల్లో రూ 6.21 కోట్లు జమ...

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 7,907 మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన 53,738 మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి రైతులకు రూ 124.67 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో అన్‌లైన్‌లో 2,451 మంది రైతులకు సంబంధించి 15,528 మెట్రిక్‌ టన్నుల ధాన్యం రూ 36.03 కోట్లు వివరాలను అన్‌లైన్‌ చేశారు. ఇందులో 614 మంది రైతులకు 2,675 మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ 6.21 కోట్లు ఖాతాల్లో జమ చేశారు.

- వ్యాపారులకు నేరుగా విక్రయాలు...

జిల్లాలో ధాన్యం దిగుబడి రావడం మొదలైనా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో దళారులు, వ్యాపారులకు నేరుగా రైతులు ధాన్యాన్ని విక్రయించారు. పౌరసరఫరాల శాఖ సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు నష్టానికి ధాన్యం అమ్ముకున్నారు. ఏ గ్రేడ్‌ ధాన్యానికి మద్దతు ధర క్వింటాలుకు రూ 2,320, సాధారణ రకం రూ. 2,300 ఉంది. దొడ్డు రకం ధాన్యం రైతులు ఆరబెట్టినది నేరుగా రూ. 2,150కి తడిగా ఉన్న ధాన్యం రూ 1,800లకు అమ్ముకున్నారు. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం 500 రూపాయలు బోనస్‌ ప్రకటించినా ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల్లో అమ్మకుండా నేరుగా మిల్లర్లకే అమ్ముకున్నట్లుగా తెలుస్తోంది.

తేమతో రైతులకు ఇబ్బంది...

చలి మొదలు కావడంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసుకున్న ధాన్యానికి తేమ శాతం రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనల ప్రకారం 17 శాతం తేమ ఉండాలి. కానీ 30 శాతం వరకు తేమ ఉండడంతో రైతులు ఆరబెట్టుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఒకేసారి రావడంతో ఆరబెట్టుకోవడానికి స్థలం లేక అవస్థలు పడుతున్నారు.

సన్నరకం ధాన్యం ఎక్కడ...

ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి రూ 500 బోనస్‌ ప్రకటించడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 16300 ఎకరాల్లో సన్నరకాలు సాగు చేశారు. దీని ద్వారా 34,230 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనాలు వేశారు. ఇందులో స్థానికంగా 4,230 మెట్రిక్‌ టన్నుల ధాన్యం వినియోగించుకోగా కొనుగోలు కేంద్రాలకు 30,000 మెట్రిక్‌ టన్నులు వస్తుందని అంచనాలు వేశారు. మిల్లర్లు 5,400 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేస్తే మిగతా 24,600 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసే విధంగా లక్ష్యంగా పెట్టుకుంది. కొనుగోళ్లు ప్రారంభమై 15రోజులు అవుతున్నా పౌరసరఫరాల శాఖ ద్వారా కొనుగోళ్లే జరగలేదు. కొనుగోలు కేంద్రాల వద్ద సన్నరకం గుర్తించడానికి మీటర్లు ఏర్పాటు చేయడం, వ్యవసాయ అధికారులు ధ్రువీకరించడం వంటి సమస్యలతో రైతులు నేరుగా అమ్ముకోవడం ద్వారానే కేంద్రాలకు రావడం లేదని తెలుస్తోంది.

Updated Date - Nov 15 , 2024 | 01:05 AM