జిల్లా అభివృద్ధికి శ్రీకారం
ABN, Publish Date - Nov 21 , 2024 | 01:30 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి కార్యాక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని, నేత కార్మికులకు ఉపాధి కల్పించడానికి స్వశక్తి సంఘాల మహిళలకు చీరలు అందించనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
- యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టుల పనులు
- నేతన్నలకు ఉపాధి
- స్వశక్తి సంఘాల మహిళలకు కోటి 30 లక్షల చీరలు
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- వేములవాడలో ప్రజాపాలన విజయోత్సవ సభ
- రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి కార్యాక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని, నేత కార్మికులకు ఉపాధి కల్పించడానికి స్వశక్తి సంఘాల మహిళలకు చీరలు అందించనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం వేములవాడ గుడి చెరువు మైదానంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సిరిసిల్లలో అన్ని పనులు చేయాలని అనుకున్నా.. అంతా సవ్యంగా జరిగినా తప్పిదం జరిగిందని, కేకే మహేందర్‌రెడ్డి ఎమ్మెల్యే కాలేదని అన్నారు. అయినా సిరిసిల్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని, సిరిసిల్ల ప్రాంతంలోని మెడికల్ కళాశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని అన్నారు. గతంలో వేములవాడ ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎన్నుకున్నా ఆయనను కలవడానికి జర్మనీకి పోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు ఆది శ్రీనివాస్ దగ్గరకు పోవాల్సిన పనిలేదని, ఆయనే మీ వద్దకు వస్తున్నారని అన్నారు. పట్నం వస్తే కాగితాలతోనే వస్తారని, ఆయనను చూస్తే మళ్లీ ఏం ఆడుగుతాడోనని భయం వేస్తుందని అన్నారు. పైరవీలు, కాంట్రాక్ట్‌ల కోసం రారని, తనను అక్కున చేర్చుకున్న వేములవాడ ప్రాంత అభివృద్ధినే అడుగుతారని అన్నారు. రెండు దశాబ్ధాల నుంచి ఉన్న మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించాలని, నిర్వాసితులు వంటావార్పు, నిరసన కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం ద్వారా ఆనాడు సమస్యను తన దృష్టికి తీసుకవచ్చారని అన్నారు. అవకాశం వచ్చినపుడు సమస్యను పరిష్కరిస్తామని మాట ఇచ్చానన్నారు. అదే విధంగా పాదయాత్రకు వచ్చిన సందర్భంలో కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ మొత్తం కలియతిరిగి ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పానని, పాదయాత్రలో అభివృద్ధి స్థితిగతులు తెలుసుకున్నానని అన్నారు. కరీంనగర్ గడ్డకు పరిపాలన చాతుర్యమే కాదు పోరాటాల పౌరుషం ఉందని పాదయాత్రలో తెలుసుకున్నట్లు చెప్పారు. కరీంనగర్ జిల్లా గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదని, దేశానికి దశ, దిశ నిర్దేశం చేసిన పీవీ నరసింహారావు గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు నాయకత్వం వహించారని, పరిపాలన అంటే ఇలా ఉండాలని చూపించారని అన్నారు. తెలంగాణ బిడ్డ పరిపాలన చేస్తే ప్రపంచమే అబ్బురపడే విధంగా అభివృద్ధి పథం వైపు నడుస్తుందని కరీంనగర్ బిడ్డ పీవీ నరసింహారావు చూపారన్నారు. రైతాంగానికి సమస్యలు వచ్చినా, నిరుద్యోగ యువతకు బాధ కలిగినా కరీంనగర్ జిల్లా నుంచే ఉద్యమాలు మొదలవుతాయని, కరీంనగర్ జిల్లా నాయకత్వం వహించిందని అన్నారు. సిరిసిల్ల, జగిత్యాల రైతాంగ పోరాటాలు రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం కల నెరవేరాలని ఈప్రాంతంలో లేచిన ఉవ్వెత్తు ఉద్యమమని, సోనియాగాంధీ కరీంనగర్ గడ్డమీద నుంచి మాట ఇచ్చారని తెలంగాణ అకాంక్షను నెరవేర్చారని అన్నారు. పార్లమెంట్‌లో ఎంపీగా పొన్నం ప్రభాకర్ పెప్పర్ స్ర్పేలో, జైపాల్‌రెడ్డి ఎంపీల వీరోచిత పోరాటంతోనే తెలంగాణ బిల్లు ఆమోదమైందన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం ఆషామాషీగా జరగలేదని, అల్లాటప్పాగా ఎవరూ తెలపలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 155 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలతోపాటు పార్టీ శాశ్వతంగా నష్టపోతుందని తెలిసినా సోనియాగాంధీ తెలంగాణ ప్రజల కోరికను నెరవేర్చారన్నారు.
మాట ఇస్తే ఎంత దూరమైనా పోతాం
కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాటిస్తే ఎంతదూరమైనా పోతామని, ప్రజల ఆకాంక్షలు నెరవేరడానికి ఎంత త్యాగానికైనా సిద్ధ పడుతుందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఎంపీగా ఒకసారి పొన్నం గెలిస్తేనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, బండి సంజయ్ రెండు సార్లు పార్లమెంట్‌కు పంపిస్తే మంత్రి అయ్యాడని, కరీంనగర్‌కు నరేంద్రమోదీ నుంచి చిల్లిగవ్వ అయినా తెచ్చాడా? అని ప్రశ్నించారు. కరీంనగర్ అభివృద్ధి కోసం పార్లమెంట్‌లో ఎప్పుడైనా మాట్లాడాడా? అన్నారు. అంతకుముందు మూడు సార్లు బీఆర్‌ఎస్‌ను గెలిపించారని, వాళ్లు కూడా గుండుసున్నా ఇచ్చారని అన్నారు. రాజన్న కోరికలు తీర్చే దేవుడని, రాజన్న మందిరం పది సంవత్సరాలుగా పడావుగా ఎందుకు పడిందని ప్రశ్నించారు. దాదాపు పది సంవత్సరాలు కేసీఆర్ రూ.80 లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టాడని, తెలంగాణ రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ముంచాడని అన్నారు. రూ.100 కోట్లతో రాజన్న దేవాలయాన్ని అభివృద్ధి చేయలేకపోయిండని, కాళేశ్వరం ప్యాకేజీ 9 ఎందుకు పడావు పడిందని, కళికోట సూరమ్మ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలేదని అన్నారు. కొండగట్టు హనుమంతుడి ఆశీర్వాదం తీసుకొని శ్రీరాంసాగర్ నుంచి మొదలుకొని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వరకు కాంగ్రెస్ కట్టినవేనని, మిగిలిన వాటిని కూడా పూర్తి చేస్తామని చెప్పామని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అసంపూర్తిగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్, అందులో ఉండే సిరిసిల్లలోని ప్యాకేజీ 9, వివిధ ప్రాంతాల్లో వాయిదాలు పడుతున్న సాగునీటి ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తామని అన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దీనిపై సమీక్ష నిర్వహిస్తారని, కరీంనగర్‌లో సాగునీటి ప్రాజెక్ట్‌లపై సమీక్ష నిర్వహించి ఎన్న్ని నిధులు కావాలి, ఎంత కాలంలో పూర్తయితాయి అనే దానిపై ఎమ్మెల్యేల సలహాలు తీసుకుంటారని అన్నారు.
నేత కార్మికులకు ఉపాధి
నేత కార్మికులకు ఉపాధి, పని కల్పించడానికి 65 లక్షల మంది స్వశక్తి సంఘాల్లోని మహిళలకు రెండు చీరల చొప్పున కోటి 30 లక్షల చీరలు పంపిణీ చేయడానికి నిర్ణయించామని రేవంత్‌రెడ్డి అన్నారు. పవర్‌లూమ్‌లపై నేసే పాలిస్టర్‌తోపాటు కాటన్ కలిపి డిజైన్లు రూపొందించాలని మహిళలకు అత్మగౌరవంతో ఉండే విధంగా చీరలు తయారు చేయాలని అన్నారు. సిరిసిల్లలో నేత కార్మికుల కోసం యారన్ డిపోను వేములవాడలో ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న నేతన్నలు, గీతన్నలు, గల్ఫ్ కార్మికులకు ఆదుకోవడానికి బోర్డును ఏర్పాటు చేయడంతోపాటు గల్ఫ్ దేశాల్లో చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు చెప్పారు.
కేసీఆర్ కొడుకు, అల్లుడివి చిల్లర మాటలు
కేసీఆర్ కొడుకు, అల్లుడివి చిల్లర మాటలని, అధికారం పోయినా బుద్ధి మారలేదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయిందని, పార్లమెంట్‌లో సీట్లు పోయాయని, ఇప్పుడు వాళ్ల వేషాలు చూస్తుంటే ఉన్న మెదడు దొబ్బినట్లు అనిపిస్తోందంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులపై ధ్వజమెత్తారు. పది సంవత్సరాలు కేసీఆర్ చేయలేని పనుల్లో పడావు పెట్టిన ప్రాజెక్ట్‌లు తిరిగి పున: ప్రారంభిస్తూ ప్రభుత్వం ముందుకు పోతోందని, కేసీఆర్ ఫాంహౌస్‌లో పడుకుంటే, కేటీఆర్, హరీష్‌రావు మన కాళ్లల్లో కట్టె పెట్టడానికి తిరుగుతున్నారని విమర్శించారు. పది సంవత్సరాల్లో చేసి ఉంటే 25 రోజుల్లో 23 లక్షల రైతు కుటుంబాలకు రూ.18 వేల కోట్లు రుణ మాఫీ చేసే అవసరం తనకు వస్తుండేదా? అన్నారు. పదేళ్లలో లక్ష రూపాయల రుణమాఫీ నాలుగు విడతలుగా చేశారని, అసలు, మిత్తీ కలిపి రైతులకు తడిసి మోపెడు అయ్యిందని అన్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటే తెలంగాణ రెండో స్థానంలో ఉన్న విషయం కేసీఆర్ మర్చిపోయినట్లు ఉన్నారని అన్నారు. పదేళ్లలో రూ.11 వేల కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారని, ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం 25 రోజుల్లో 2 లక్షల రుణమాఫీకి రూ.18 వేల కోట్లు చేస్తే పెద్ద మనిషిగా అభినందించాల్సింది తండ్రి, కొడుకు, అల్లుడు అన్నీ చిల్లర మాటలే మాట్లాడుతున్నారని అన్నారు. అక్కరకు వచ్చే మాటలు లేవన్నారు. పదేళ్లు పరిపాలించారని, పది నెలలు కాకముందే దిగిపో అంటున్నారని, పదేళ్లు ఏం వెలగబెట్టారో చెప్పాలని అన్నారు. వాళ్లు చేయలేని పనులు తాము చేస్తుంటే నొప్పి ఎందుకన్నారు. వాళ్ల నొప్పికి తమ కార్యకర్తల దగ్గర మందు ఉందని, నొప్పి లేచిన కాడా మందు పెడతారని అన్నారు. సోషల్ మీడియాలో నాలుగు హౌలా పోస్టులు పెడితే మొనగాళ్లు అనకుంటున్నారా? అని ధ్వజమెత్తారు. అధికారం వచ్చిందని తమ కార్యకర్తలు కాస్తా రిలాక్స్‌గా ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బావ, బామ్మర్థుల పని చెప్పారని అన్నారు. పదేళ్లలో రుణమాఫీ లెక్క తీద్దామని, 25 రోజుల్లో తాము చేసిన రుణమాఫీ లెక్కలు తీద్దామని వాస్తవాలు మాట్లాడుకుందామని అన్నారు. కేసీఆర్‌కు ధైర్యం, నిజాన్ని ఎదుర్కొనే చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. నిరుద్యోగ సమస్యతోనే తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. ఆత్మ బలిదానాలుచేిసి సాధించుకన్న తెలంగాణలో పది నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. కేసీఆర్ పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో లెక్క చెప్పాలని, ఎల్బీ స్టేడియంకు వస్తే 50 వేలకు తక్కువ కాకుండా ఒక్క తల తక్కువ వచ్చినా క్షమాపణ చెబుతానని అన్నారు. కేటీఆర్‌ను ఉద్దేశించి అన్ని చిల్లర మాటలేనని, ‘మా తాత ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చాడు. మా తాతలు నేతులు తాగితే మూతులు నాకండి’ అన్నట్లు... ‘చచ్చిపోయిన బర్రె కుండ నిండా పాలు ఇచ్చేది’ అని అంటున్నారని ‘బర్రె సచ్చింది. కుండ పోయింది. బుద్ధి మాత్రం మారడం లేదు’ అని అన్నారు. రైతు రుణమాఫీ, నిరుద్యోగుల సమస్యలతోపాటు ఆడపడుచులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. 11 నెలల్లోనే 1.10 కోట్ల మంది ఆడబిడ్డల బస్సు ప్రయాణానికి రూ.3700 కోట్లు ఖర్చు పెట్టామని మోదీ ప్రభుత్వం సిలిండర్ ధర రూ.1200 చేస్తే రూ.500కే సిలిండర్ ఇస్తున్నామని అన్నారు. కేసీఆర్ వరి వేస్తే ఉరి వేసుకున్నట్లేనని అన్నారని, ఆయన ఫాంహౌస్‌లో 150 ఎకరాల్లో వరి వేశారని అన్నారు. ప్రభుత్వం వరి పండాల్సిందేనని, సన్నవడ్లకు రూ.500 బోనస్ ప్రకటిస్తే స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ గడ్డపై 66 లక్షల ఎకరాల్లో కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతులు పండించారని అన్నారు. గతంలో వడ్లు పండితే కాళేశ్వరం నీళ్లు తెచ్చానని కేసీఆర్ అన్నారని, ఆ దిక్కుమాలినోడు కట్టిన కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, కుప్పకూలాయని అన్నారు. పనిమంతుడు పందిరేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందట అన్నారు. కాళేశ్వరం కట్టింది ఎప్పుడో కూలింది ఎప్పుడని ప్రశ్నించారు. లక్ష కోట్లు నిండా మింగి ఫాంహౌస్‌లో పడుకున్నారన్నారు. కాళేశ్వరం నుంచి చుక్కనీళ్లు లిఫ్ట్ చేయకుండానే కాంగ్రెస్ కట్టిన శ్రీరాంసాగర్, శ్రీపాద, వరంగల్, నిజామాబాద్‌లోని ప్రాజెక్ట్‌ల ద్వారా కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండాయన్నారు. లక్ష కోట్లు కాళేశ్వరంలో కాంట్రాక్టర్‌లకు కాలబెట్టాడన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో 20 కోట్లు పెట్టినా చుక్క నీరు రాలేదన్నారు. కేసీఆర్ పదేళ్లలో లక్ష 83 వేల కోట్ల ప్రజాధనం ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల మీద పెట్టినా పూర్తి కాలేదన్నారు. తెలంగాణ ప్రజలకు ఒక్క ప్రాజెక్ట్ అయినా అంకితం చేశారా? అని ప్రశ్నించారు. మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్ట్‌లు కట్టారని రంగనాయక సాగర్ కడితే హరీష్‌రావు ఫాంహౌస్ కట్టుకున్నాడని, ప్రాజెక్ట్ కోసం భూ సేకరణ చేసిన భూములను హరీష్‌రావు బదిలీ చేయించుకున్నారని అన్నారు. హరీష్‌రావు ఫాంహౌస్ లెక్క చెప్పాల్సిందేనని, లెక్క తీస్తున్నానని అన్నారు. కొండ పోచమ్మ ప్రాజెక్ట్ కేసీఆర్ ఫాహౌస్‌కు కాలువలు తీసుకపోవడానికే కట్టారన్నారు. నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని కొండ పోచమ్మ ప్రాజెక్ట్‌కు పోదామన్నారు. వేల కోట్లు ప్రజల సొమ్ము ఖర్చు చేసి ఫాంహౌస్‌కు నీళ్లు తీసుకవెళ్లడం కేసీఆర్‌కు న్యాయమా? అని ప్రశ్నించారు. కొడంగల్‌లో 75 ఏళ్లుగా వెనకబడిపోయిందని, ఎవరికి కూడా మంత్రిగా అవకాశం రాలేదని అన్నారు. ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చిందని కొడంగల్ అభివృద్ధి చేయాలని ఎడారిగా మారినా గ్రామాలకు నీళ్లు ఇవ్వడానికి నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి తొండలు కూడా గుడ్లు పెట్టని భూమిని సేకరిస్తే హరీష్ కాళ్లలో కట్టె పెడతున్నాడన్నారు. కొడంగల్‌లో పరిశ్రమ వస్తే నిరుద్యోగులకు ఉపాధి దోరుకుతుందన్నారు. పరిశ్రమలు రావాలంటే భూ సేకరణ లేకుండా జరుగుతుందా? కనీస పరిజ్ఞానం కేసీఆర్‌కు లేదా? అన్నారు. ఉద్యమకారుడు, 80 వేల పుస్తకాలు చదివినా అని చెప్పుకునే కేసీఆర్ కొడంగల్ నియోజకవర్గంపై ఎందకు కక్ష కట్టావని ప్రశ్నించారు. పరిశ్రమలు స్థాపించడానికి భూ సేకరణ చేస్తే రౌడీ మూకలతో కలెక్టర్, అఽధికారులపై దాడులు చేస్తున్నారని, భూ సేకరణ చేయకుండా పరిశ్రమలు ఎలా వస్తాయని అన్నారు. ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందేనని, వారికి పరిహారం మూడింతలు ఇచ్చే విధంగా చట్టాన్ని తీసుకొచ్చామని అన్నారు. రైతులు కూడా స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి ముందుకొస్తారని అన్నారు. ఎవరైనా భూమిని తల్లిదండ్రులతో సమానంగా చూసుకుంటారని అందుకే నూతన విఽధానం తీసుకొచ్చామని అన్నారు. కేటీఆర్ ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లాడని, రేపు చంద్రమండలం వెళ్లినా మళ్లీ ఇక్కడికే రావాల్సిందేనని కుట్రలు ఎన్ని చేసినా లెక్క తీస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, దామోదరం రాజనర్సింహా, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, మక్కాన్‌సింగ్, విజయరమణారావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, వివిధ శాఖల కార్యదర్శులు డైరెక్టర్లు పాల్గొన్నారు.
Updated Date - Nov 21 , 2024 | 01:30 AM