సర్వే ‘సమగ్ర’మేనా?
ABN, Publish Date - Nov 09 , 2024 | 01:17 AM
ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ స్థితిగతులతోపాటు కులగణన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై సర్వత్రా చర్చ జరుగుతోంది. 2014 ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వేను రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు నిర్వహించారు. ఈ సర్వేతో భావితరాలకు మేలు జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఈ సర్వేలో భాగస్వాములై సమాచారమివ్వాలని, సర్వే ప్రామాణికంగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించడంతో దేశ, విదేశాల్లో నుంచి స్వగ్రామాలకు చేరుకొని సమాచారమందించారు.
- ఇళ్లకు పూర్తికాని స్టిక్కరింగ్
- నేటి నుంచి సమాచారణ సేకరణ
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ స్థితిగతులతోపాటు కులగణన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై సర్వత్రా చర్చ జరుగుతోంది. 2014 ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వేను రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు నిర్వహించారు. ఈ సర్వేతో భావితరాలకు మేలు జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఈ సర్వేలో భాగస్వాములై సమాచారమివ్వాలని, సర్వే ప్రామాణికంగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించడంతో దేశ, విదేశాల్లో నుంచి స్వగ్రామాలకు చేరుకొని సమాచారమందించారు. అయితే ఆ సర్వే వివరాలను వెల్లడించలేదు. ఆసర్వేను ఆనాటి ప్రభుత్వం పక్కనపడేసింది. సర్వే ఆధారంగా ఏ ఒక్కరికీ లబ్ధి చేకూరలేదు. మళ్లీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపడుతున్నది.
ఎన్నో సందేహాలు
ఈ సర్వే సమాచారాన్ని ప్రామాణికంగా చేసుకొని రేషన్‌కార్డులను, పెన్షన్లను, ఇతర పథకాలలో అక్రమంగా లబ్ధి పొందుతున్నవారిని తొలగిస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుల గణన కోసమే ఈ సర్వే చేపడితే కులం, మతం ఏమిటనే వాటిని తెలుసుకోకుండా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయాలకు సంబంధించిన 112 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని ఎందుకు రూపొందించి సమాచారం తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి ఆస్తి వివరాలను వేర్వేరుగా ఎలా ఇవ్వాలి, ఆస్తుల వివరాలు ఇస్తే మంచిదా లేదా, వివిధ పథకాల ద్వారా లబ్దిపొందితే వాటి వివరాలనుతెలిపితే భవిష్యత్‌లో వాటిని ఇస్తారో లేక రద్దు చేస్తారో... కొత్తగా మరే పథకాల ద్వారా లబ్ది లభిస్తుందో లేదోనన్న అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత చదవులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు, దేశాలకు వెళ్లిన వారి సమాచారం ఇక్కడ ఇవ్వడమా లేదా అని తేల్చుకోలేకపోతున్నారు. స్వగ్రామాల నుంచి పట్టణాలు, నగరాల్లో ఉంటూ వారి స్వగ్రామాల్లో తల్లిదండ్రులు ఉంటే వారి సమాచారాన్ని పట్టణాల్లో ఇవ్వడమా, గ్రామాల్లో ఇవ్వడమా... అక్కడ ఒక ఇల్లు ఉంటుంది... ప్రస్తుత నివాస ప్రాంతాల్లో మరో ఇల్లు ఉంటుంది, రెండు కుటుంబాలు ఇచ్చేది ఒకే సమాచారం కాదా... రేషన్‌కార్డు కొందరికి గ్రామాల్లో ఉండి, వారు ఇతర ప్రాంతాల్లో నివాసముంటూ ఆధార్‌కార్డు తీసుకునే వారు ఏ సమాచారమివ్వాలి... సమాచారమిస్తే ఏమైనా లాభముంటుందా... లేక నష్టం జరుగుతుందా, బ్యాంకు ఖాతాలు, ఆస్తులకు సంబంధించిన వివరాల డాక్యుమెంట్లను ఇవ్వడమా లేదా అనే దానితో సమగ్ర సర్వేపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మూడురోజులుగా ఇంటింటికి వెళ్లి కుటుంబాల వివరాలను తీసుకొని ఇళ్లకు స్టిక్కరింగ్ చేస్తున్న ఉద్యోగులతో వారికున్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. దానికి వారు ఇళ్ల వద్దకు ప్రశ్నావళితో వచ్చే వారు సమగ్ర సమాచారమిస్తారని, తాము కేవలం కుటుంబ వివరాలను తీసుకొని ఇంటికి స్టిక్కర్ వేస్తామని అంటున్నారు. ఎన్యూమరేటర్లు అన్ని వివరాలు చెబుతారని, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు దగ్గర ఉంచుకోవాలని చెబుతున్నారు. వారి సందేహాలను నివృత్తి చేయడం లేదు. దీనితో సర్వేపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు, ప్రత్యేకాధికారులు కూడా ప్రజలకు స్పష్టత ఇవ్వడం లేదనే అభిప్రాయం వ్య క్తమవుతోంది.
తేలని కుటుంబాల లెక్క
నవంబరు 6 నుంచి 30వ తేదీ వరకు సమగ్ర సమాచారంతో సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 6,7,8 తేదీల్లో ఇంటి నంబర్ల ప్రకారం ఇళ్లకు వెళ్లి ఆయా ఇంట్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి... ఆ కుటుంబ సంఖ్య తెలుసుకొని ఆ ఇంటికి స్టిక్కరింగ్ చేయాలని నిర్దేశించింది. ఇంటికి స్టిక్కరింగ్ చేసిన తర్వాత కుటుంబాల సంఖ్యను బట్టి 150 కుటుంబాలకు ఒక్కరు చొప్పున ఎన్యూమరేటర్లను నియమించి ఈనెల 9 నుంచి 30వ తేదీ వరకు సమగ్ర సమాచారంతో సర్వే పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలోని 15 మండలాలు, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, జమ్మికుంట, హుజురాబాద్, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీలను 1,958 ఎలకో్ట్రల్ బ్లాక్‌లుగా విభజించి, సర్వేను పకడ్బందీగా నిర్వహించేందుకు 1,964 మంది ఎన్యూమరేటర్లను, 207 మంది సర్వేయర్లను నియమించారు. మున్సిపాలిటీల్లో కమిషనర్లు, మండలాల్లో తహసీల్దార్లు, ఎమ్యూనరేటర్లు, సర్వేయర్లను, ప్రత్యేకాధికారులను నియమించుకుని శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం ఈనెల 6 నుంచి ఇంటింటికి వెళ్లి కుటంబాల వివరాలను సేకరించి స్టిక్కరింగ్ చేస్తున్నారు. 8వ తేదీ సాయంత్రంలోగా స్టిక్కరింగ్ పూర్తి చేయాల్సి ఉండగా కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో చాలా మేరకు కుటుంబాల వివరాలను సేకరించలేదు.. మండలాలు, గ్రామాల్లోనూ కుటుంబాల వివరాల సేకరణ పూర్తి కాలేదని చెబుతున్నారు. దీంతో స్టిక్కరింగ్ అయిన ప్రాంతాల్లో సర్వే చేపడుతూనే మరోవైపు సమాచార సేకరణను శనివారం నుంచి ప్రారంభించి, గడువులోగా పూర్తి చేయవచ్చని అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం సాయంత్రం వరకు మండలాలకు సర్వేకు సంబంధించిన ప్రశ్నావళి చేరకపోవడంతో శనివారం సర్వేపై గందరగోళం నెలకొందని ఉద్యోగులు చెబుతున్నారు. ఓవైపు ప్రజలకు సందేహాలు, మరోవైపు ఇలాంటి గందరగోళ పరిస్థితుల మధ్య సర్వే ఎలా జరుగుతుందోననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Updated Date - Nov 09 , 2024 | 01:17 AM