మహిళా ఉద్యోగులు, విద్యార్థినులకు ‘మహాలక్ష్మి’ వరం..
ABN, Publish Date - Nov 08 , 2024 | 01:05 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మహాలక్ష్మి పథకం ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు వరంగా మారింది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మహాలక్ష్మి పథకం ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు వరంగా మారింది. ప్రతినెలా తల్లిదండ్రులకు బస్‌పాసుల రూపేణా, ప్రైవేట్ బస్సులకు చెల్లించే డబ్బులు ఆదా అవుతున్నాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా 15 నుంచి 20 లక్షల రూపాయలకు పైగా ఆదా అవుతున్నాయి. గత ఏడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా మహాలక్ష్మి పథకం ఒకటి. దీని ద్వారా ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. డిసెంబర్ 7వ తేదీన కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 9వ తేదీ నుంచి మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకాన్ని ప్రారంభించారు. అలాగే 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షలకు పెంచారు. మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీ బస్సులు మహిళలు, విద్యార్థినులతో కిటకిటలాలడుతున్నాయి. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు సుమారు 350 కోట్ల రూపాయల వరకు భారం పడుతున్నది. ఈ పథకం ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు ఆర్థిక భారం తప్పింది. తాము నివసిస్తున్న ప్రాంతం నుంచి పనిచేసే చోటికి ఆర్టీసీ బస్సుల్లో గానీ, ప్రైవేట్ వాహనాల్లో గానీ వెళ్లేందుకు నెలకు 2వేల నుంచి 3వేల రూపాయల వరకు వెచ్చిస్తున్నారు. ఉచిత ప్రయాణం వల్ల వారందరికీ డబ్బులు ఆదా అవుతున్నాయి.
విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు
అలాగే జిల్లాలోని పెద్దపల్లి, గోదావరిఖని, సుల్తానాబాద్, మంథని, ధర్మారం, తదితర ప్రాంతాల్లో గల ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలు ఉన్నాయి. నిత్యం కళాశాలలు, పాఠశాలలకు గ్రామాల నుంచి 10 వేల మంది విద్యార్థినుల్లో కొందరు బస్ పాస్‌లు తీసుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండగా, మరికొందరు ప్రైవేట్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసే వ్యాన్లలో ప్రయాణిస్తున్నారు. బస్ పాస్‌లకు వెచ్చించే డబ్బులు, వ్యాన్లకు చెల్లించే డబ్బులు తల్లిదండ్రులకు ఆదా అవుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్దపల్లి, గోదావరిఖని, మంథని, సుల్తానాబాద్ బస్టాండ్లు విద్యార్థులతో కిక్కిరిసిపోతున్నాయి. విద్యార్థినులకు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించడం వల్ల వారి తల్లిదండ్రులకు ఆర్థిక భారం తప్పుతున్నది. అయితే విద్యార్థులు కళాశాలలు, పాఠశాలలకు ఉదయం వచ్చేటప్పుడు, సాయంత్రం ఇళ్లకు వెళ్లేటప్పుడు ఆయా రూట్లలో సరిపడా బస్సులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీట్లు నిండడమే గాకుండా, బస్సులో మరో 30మంది వరకు కిక్కిరిసి ఎక్కుతుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. నిలబడేందుకు చోటు లేకుండా జనం ఎక్కుతుండడంతో చాలా ఇబ్బంది పడాల్సి వస్తున్నదని విద్యార్థినులు చెబుతున్నారు. పెద్దపల్లి నుంచి మంథని రూట్‌కు, పెద్దపల్లి నుంచి యైుటింక్లయిన్ కాలనీ రూట్‌కు, పెద్దపల్లి నుంచి కాల్వశ్రీరాంపూర్, ఓదెలకు వెళ్లే రూట్లలో, సుల్తానాబాద్ నుంచి కాల్వశ్రీరాంపూర్, ఓదెలకు వెళ్లే రూట్లలో సరిపడా బస్సులు లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి రద్దీగా ఉన్న రూట్లలో అదనపు బస్సులను నడపాలని విద్యార్థినులతో పాటు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
Updated Date - Nov 08 , 2024 | 01:05 AM