ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యాసంగికి భరోసా

ABN, Publish Date - Oct 20 , 2024 | 01:02 AM

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో యాసంగి సాగుకు రంది లేకుండాపోయింది. పూర్తిస్థాయి ఆయకట్టు రెండో పంటకు నీరందించడానికి సరిపడా ప్రాజెక్టులో పుష్కలంగా నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ఎస్సారెస్పీలోకి స్వల్పంగా 20 వేల క్యూసెక్కుల వరద నీరు కొనసాగుతోంది.

- నిండుకుండలా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు

- ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 251.720 టీఎంసీల రాక

- ప్రస్తుతం 20 వేల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో

- యాసంగిలో పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందించే అవకాశం

జగిత్యాల, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో యాసంగి సాగుకు రంది లేకుండాపోయింది. పూర్తిస్థాయి ఆయకట్టు రెండో పంటకు నీరందించడానికి సరిపడా ప్రాజెక్టులో పుష్కలంగా నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ఎస్సారెస్పీలోకి స్వల్పంగా 20 వేల క్యూసెక్కుల వరద నీరు కొనసాగుతోంది. కాలువల ద్వారా ప్రస్తుతం ఆయకట్టుకు నీరు అంతగా డిమాండ్‌ లేదు. నవంబరు మొదటి వారం వరకు వానాకాలం సీజన్‌కు నీటి విడుదల నిలిపివేసే అవకాశం ఉంది. అప్పటి వరకు వరి పంటలు పూర్తిగా కోతకు వస్తాయి. ప్రాజెక్టులోకి వానాకాలం సీజన్‌ ప్రారంభం నుంచే ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరదలు రావడంతో జూలై మాసంలోనే నిండిపోయింది. 80.501 టీఎంసీల పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. అప్పటి నుంచి మిగులు జలాలను దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. ప్రస్తుత యేడాది జూన్‌ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు డ్యామ్‌లోకి 251.720 టీఎంసీల వరద నీరు వచ్చింది. ప్రాజెక్టు నుంచి దిగువకు ప్రస్తుత సీజన్‌లో 178.619 టీఎంసీల నీటిని వదిలారు. నవంబరు చివరి వారం నుంచి యాసంగి ప్రణాళిక చేసి కాలువల ద్వారా నీటి విడుదల చేపట్టే అవకాశం ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకు గోదావరి నదిలోని గుంతల్లో నిలిచిపోయిన నీరు ప్రాజెక్టులోకి చేరుకుంటుంది. ఈ ఏడాది ప్రాజెక్టునకు పుష్కలంగా వరదనీరు రావడంపై ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- తగ్గుతూ....పెరుగుతూ....

ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గ్గుతూ పెరుగుతూ ఉంది. దీంతో ప్రాజెక్టు నుంచి గోదావరి నీటి విడుదలను తగ్గిస్తూ పెంచుతున్నారు. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద రావడం 20 వేల క్యూసెక్కులకు పడిపోయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 80.501 టీఎంసీలు కాగా ప్రస్తుత పూర్తి స్థాయి నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం కాకతీయ కాలువ ద్వారా 5,800 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 3,542 క్యూసెక్కులు, ఎస్కెప్‌ గేట్ల ద్వారా 2,200 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూసెక్కులు, సరస్వతీ కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, మిషన్‌ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి ఆవడం ద్వారా 573 క్యూసెక్కులు వ్యయం అవుతోంది.

- డ్యామ్‌లోకి భారీస్థాయిలో నీరు..

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి ప్రస్తుత సీజన్‌లో రికార్డు స్థాయిలో నీరు వచ్చి చేరింది. 1983-84 సంవత్సరంలో ప్రాజెక్టులోకి 1,165 టీఎంసీలు, 1988-89 సంవత్సరంలో 912.95 టీఎంసీలు, 1989-90 సంవత్సరంలో 576.28 టీఎంసీలు, 1990-91 సంవత్సరంలో 687.69 టీఎంసీలు, 1998-99 సంవత్సరంలో 552.44 టీఎంసీలు, 2005-06 సంవత్సరంలో 374.42 టీఎంసీలు, 2006-07 సంవత్సరంలో 515.48 టీఎంసీలు, 2021-22 సంవత్సరంలో 480 టీఎంసీలు, 2022-23 సంవత్సరంలో 200.682 టీఎంసీలు, 2023-24 సంవత్సరంలో ఇప్పటివరకు 251.720 టీఎంసీల నీరు వచ్చినట్లు రికార్డులు తెలుపుతున్నాయి.

- బాబ్లీ మూసినా...

సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఈ నెల 28వ తేదీ వరకు గోదావరి ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్రలో గల బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉంచుతారు. మహరాష్ట్ర సర్కార్‌ బాబ్లీ ప్రాజెక్టును 2.4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తలెత్తి కోర్టుకు ఎక్కారు. ప్రతీ నెల జూలై 1వ తేదీన బాబ్లీ గేట్లు ఎత్తి అక్టోబరు 28వ తేదీ వరకు తెరిచి ఉంచాలని కోర్టు తీర్పులో పేర్కోంది. ఈ నెల 29న ఉదయం బాబ్లీ గేట్లను మూసి వేస్తారు. అయితే మరింత వరద నీరు పెరిగితే బాబ్లీ గేట్లు మూసివేయడం కష్టమే. మూసేసినా ఎస్సారెస్పీ ఆయుకట్టుకు యాసంగికి ఢోకా లేకుండా నీటి సరఫరా చేయవచ్చు. వానాకాలంలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయి ఆయకట్టుకు కాలువల ద్వారా నీటి విడుదలను చేపట్టారు. ప్రస్తుతం యాసంగిలో కూడా అంతేస్థాయి ఆయకట్టు నీటి సరఫరా చేపట్టే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

- ఎస్సారెస్పీ ఆయకట్టు ఎకరాల్లో...

ఎస్సారెస్పీ మొదటి దశ ఆయకట్టు 9,68,640 ఎకరాలు, రెండో దశ 4,40,000 ఎకరాలు, వరద కాలువ 2,20,000 ఎకరాలు, సదర్‌మాట్‌ ఆయుకట్టు 12,000 ఎకరాలు, కడెం ప్రాజెక్టు 68,000 ఎకరాలు, అలీసాగర్‌ ఎత్తిపోతలు 57,793 ఎకరాలు, గుత్ప ఎత్తిపోతల పథకం 38,967 ఎకరాలు, చౌటుపల్లి హన్మంత్‌రెడ్ది ఎత్తిపోతలు 11,600 ఎకరాలు, నిజామాబాద్‌ జిల్లాలో 14 ఎత్తిపోతలు పథకాలకు 34,948 ఎకరాలు, ఆదిలాబాద్‌ జిల్లాలో తొమ్మిది ఎత్తిపోతలతో 30,417 ఎకరాలు ఆయకట్టు ఉంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో మొత్తం ఆయకట్టు 18,66,765 ఎకరాలు ఉంది.

Updated Date - Oct 20 , 2024 | 01:03 AM