ఉదయం బడి.. మధ్యాహ్నం సర్వే
ABN, Publish Date - Nov 08 , 2024 | 01:03 AM
ఈ ఫోటో జిల్లాలోని గొల్లపల్లి మండలం పైడిపల్లి గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందినది.
ఈ ఫోటో జిల్లాలోని గొల్లపల్లి మండలం పైడిపల్లి గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందినది. పాఠశాలలో 40 విద్యార్థులున్నారు. వీరికి నలుగురు ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు తులసి ఆగమయ్య ఉదయం వేళల్లో పాఠశాలలో బోధన విధులు నిర్వర్తించాడు. మధ్యాహ్నం విద్యార్థులకు భోజనం అందించిన అనంతరం గ్రామంలోని ఓ వార్డులో సమగ్ర కుటుంబ సర్వే బాధ్యతలను నిర్వహిస్తూ ఇళ్లను గుర్తించి స్టిక్కర్లు వేసే పనులు నిర్వర్తించాడు. ఇదే మాదిరిగా పాఠశాలకు చెందిన మిగిలిన ముగ్గురు ఉపాధ్యాయులు సైతం సర్వే విధుల్లో పాల్గొన్నారు. దీంతో మధ్యాహ్న భోజనం అనంతరం పాఠశాలకు తాళం వేయాల్సి వచ్చింది. ఇలా ఒక్క పాఠశాలనే కాదు..దాదాపుగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల పరిస్థితి ఇలాగే ఉంది.
సాధారణంగా వేసవి కాలం ప్రారంభంలో నెలరోజుల పాటు ఒంటిపూట బడులను నిర్వహిస్తారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఒంటిపూట కొనసాగుతున్నాయి. దీంతో ప్రాథమిక విద్య కుంటుపడుతుందని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 1,126 మంది టీచర్లకు సర్వే విధులు..
జిల్లాలో దాదాపు వివిధ ప్రాంతాల్లో పలు పాఠశాలల్లో పనిచేస్తున్న 1,126 మంది ఉపాధ్యాయులు సమగ్ర కుటుంబ సర్వే విధులను నిర్వర్తిస్తున్నారు. ఇందులో 131 పీఎస్ టీచర్లు, 995 సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్‌జీటీ)లకు సర్వే విధులు కేటాయించారు. వీరు పాఠశాలల నుంచి మధ్యాహ్నమే నేరుగా సర్వేకు వెళ్లాల్సి వస్తోంది. ఉన్నత పాఠశాలల్లో నెలరోజుల క్రితం విధుల్లో చేరిన జూనియర్లను సర్వే విధులకు కేటాయించకుండా, వయసు పైబడిన వారికి విధులు కేటాయించడంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగులు, గర్భిణులు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా చాలా చోట్ల సర్వే విధులు కేటాయించని వారు కూడా పాఠశాలను మూసివేసి వెళ్తున్నట్లు తెలుస్తోంది. సర్వే విధులు లేనివారు పాఠశాల నిర్వహించాల్సి ఉండగా.. మధ్యాహ్నమే పాఠశాలలను మూసివేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
విద్యార్థులకు ఇబ్బందులు...
ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సమార్థాన్ని పరీక్షించేందుకు న్యాస్ (నేషనల్ అసిస్‌మెంట్ సర్వే)ను ప్రభుత్వం ఈ నెల 8న నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. చదువులో వెనుకబడిన వారి అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు త్రీఆర్స్ కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతోంది. అందుకు సైతం ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. గ్రామీణస్థాయిలో చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు వ్యవసాయంతో పాటు వివిధ కూలీ పనులకు వెళ్తుంటారు. వారు ఉదయం వెళ్లి, సాయంత్రం ఇంటికి వస్తారు. ఆ సమయంలో విద్యార్థులు పాఠశాలలో ఉండేవారు. ప్రస్తుతం మధ్యాహ్నమే విద్యార్థులు ఇళ్లకు వెళ్తున్నారు. ఈక్రమంలో ఇళ్ల వద్ద పిల్లల బాగోగులు చూసేవారు లేకుండా పోతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒంటిపూట బడి ఉంటే విద్యార్థులు పాఠశాలకు రెగ్యులర్‌గా వచ్చే అవకాశాలు తగ్గుతాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
సర్వే జరిగినన్ని రోజులు ఉపాధ్యాయులు ఉదయం 9.05 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం 2 గంటల నుంచి సాయంత్రం వరకు ఇంటింటి సర్వే చేపడుతున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు పలు ప్రాథమిక పాఠశాలలు మూతపడటంతో విద్యార్థులు ఇంటి ముఖం పడుతున్నారు. ఒంటిపూట బడులను ఇటు విద్యార్థి సంఘాలు, అటు ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. విద్యార్థుల చదువుపై ప్రభావం చూపకుండా యఽథావిధిగా బడులను నిర్వహించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
యథావిధిగా బడులను నిర్వహించాలి
- నీలం సంపత్, డీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు
మధ్యాహ్నం వేళలో తల్లిదండ్రులు పనులకు వెళ్తుంటారు. విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రతి పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఒంటిపూట బడి వల్ల విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతారు. నవంబరు మాసంలో జాతీయ స్థాయిలో నిర్వహించే ఎన్‌ఏఎస్ సర్వే ఉన్నందున పాఠశాల నిర్వహణకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు వహించాలి.
సర్వే వల్ల సర్వం ఇబ్బందులే
- తులసి ఆగమయ్య, యూటీఎఫ్ నాయకులు
ప్రభుత్వం సర్వే పేరుతో పాఠశాలలను ఒంటిపూట నిర్వహిస్తే, ప్రభుత్వ విద్యాసంస్థలు దెబ్బతింటాయి. ఉదయం పూట పాఠశాల నిర్వహణ, మధ్యాహ్నం పూట కులగణన సర్వే ఉండటం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. తల్లిదండ్రులు మధ్యాహ్నా సమయంలో ఇంటి వద్ద ఉండకపోవడంతో అటు పిల్లకు రక్షణ కరువు అవుతోంది. మధ్యాహ్నాం వ్యవసాయ పనులకు వెళుతుండడం వల్ల ఇళ్ల వద్ద సర్వే ఎన్యూమరేటర్లకు సమాచారం ఇచ్చే వారు సైతం అందుబాటులో ఉండడం లేదు. దీంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొవలసి వస్తోంది.
Updated Date - Nov 08 , 2024 | 01:03 AM