ఇంత నిర్లక్ష్యమా?
ABN, Publish Date - Nov 14 , 2024 | 12:53 AM
తెలంగాణలోనే మోడల్‌గా నిలిచే విధంగా గత ప్రభుత్వ హయాంలో ఆధునిక హంగులతో నాలుగేళ్ల క్రితం నిర్మించిన రైతు బజార్ సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్, అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు తీరంలో నిర్మించిన రైతు బజార్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావించినా లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
తెలంగాణలోనే మోడల్‌గా నిలిచే విధంగా గత ప్రభుత్వ హయాంలో ఆధునిక హంగులతో నాలుగేళ్ల క్రితం నిర్మించిన రైతు బజార్ సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్, అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు తీరంలో నిర్మించిన రైతు బజార్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావించినా లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. సిరిసిల్ల మార్కెట్‌కు జిల్లాలోని వివిధ మండలాల రైతులతోపాటు పొరుగున ఉన్న సిద్దిపేట, కామారెడ్డి, జగిత్యాల ప్రాంతాల రైతులు కూడా కూరగాయలు విక్రయించడానికి వస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వ హయాంలో అప్పటి పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రత్యేక చొరవతో ఎంతో ఆర్భాటంగా రైతు బజార్‌ను నిర్మించి 2020 జూన్ 23న ప్రారంభించారు. తొలిరోజు మాత్రమే రైతుబజార్‌లోని వివిధ షెడ్లలో కనిపించిన రైతులు మళ్లీ వాటిని వినియోగించకపోవడంతో నిరుపయోగంగా మారాయి. రైతు బజార్‌ను మొదట్లో మార్కెట్ కమిటీ ఆధీనంలో ఉండగా దానిని సిరిసిల్ల మున్సిపాలిటీకి బదలాయించారు. దీంతో మార్కెట్ పూర్తిగా వినియోగదారులకు, రైతులకు ఉపయోగకరంగా మారుతుందని భావించారు. కానీ కౌన్సిల్, మున్సిపల్ అధికారుల తీరును వెక్కిరిస్తోంది. రైతు బజార్ సిరిసిల్లకు అలంకార ప్రాయంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. సిరిసిల్ల గాంధీచౌక్ వద్ద గ్రామ పంచాయతీ కాలం నుంచి కొనసాగుతున్న పాత మార్కెట్‌లోనే ఉదయం నుంచి రాత్రి వరకు క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. రైతుబజార్‌లో మాత్రం ఉదయం వేళ 11 గంటల వరకు కూరగాయల అమ్మకాలు జరుగుతున్నాయి. రైతు బజార్‌కు కొద్దిమంది రైతులే వస్తుండడంతో మళ్లీ పాత మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కోనే పరిస్థితి వినియోగదారులకు వస్తుంది. రైతుబజార్‌లో షెడ్లు ఉన్నప్పటికీ అనువుగా లేవని, రైతుబజార్‌లోని రోడ్లపైనే రైతులు కూర్చొని అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో షెడ్లన్నీ వెలవెలబోవడం నిర్వహణ లేక పెచ్చులుడుతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి.
రూ.5.15 కోట్లతో రైతు బజార్ నిర్మాణం
రైతులు పండించిన కూరగాయలు నేరుగా అమ్ముకోవడం ద్వారా దళారుల ప్రమేయం తగ్గి కష్టానికి ఫలితం పొందుతారని భావించి సిరిసిల్లలో 2.14 ఎకరాల స్థలంలో రూ.5.15 కోట్లతో ఆధునిక హంగులు, సౌకర్యాలతో ప్రత్యేక ఆకర్షణగా రైతు బజార్ నిర్మించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మోడల్‌గా సిరిసిల్లలో నిర్మించిన రైతుబజార్‌ను పరిశీలించడానికి వివిధ ప్రాంతాల వారు సైతం వచ్చి చూసివెళ్లడం గమనార్హం. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థకు చెందిన 2.14 ఎకరాల స్థలాన్ని మాజీ మంత్రి కేటీఆర్ సెస్ పాలకవర్గాన్ని ఒప్పించి వారికి మరోచోట స్థలాన్ని కేటాయించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రైతు బజార్‌ను సిద్ధం చేశారు. కానీ అనుకున్న లక్ష్యం నెరవేరక ఆర్భాటమే మిగిలించింది.
38 కూరగాయలు... 34 మాంసం దుకాణాలు
మోడల్ రైతుబజార్‌లో రైతులు కూర్చోవడానికి వీలుగా నిర్మాణాలు, విక్రయాలకు అనువుగా దుకాణాలను నిర్మించారు. 38 కూరగాయల దుకాణాలు, 34 మాంసం విక్రయ దుకాణాలకు కేటాయించారు. పండ్లు, పూలకు ప్రత్యేక దుకాణాలు నిర్మించారు. రైతులకు, వినియోగదారులు ఉపయోగించే విధంగా మరుగుదొడ్లు. మినరల్ వాటర్ సౌకర్యం కల్పించారు. మున్సిపల్ నిర్లక్ష్యానికి మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడడమే కాకుండా ఇప్పటివరకు మాంసం దుకాణాలు ప్రారంభం కాలేదు. అడ్తీ వ్యాపారులు మాత్రం దుకాణాలు తీసుకొని తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. రైతులు మాత్రం రోడ్లపైన ఇబ్బందులు పడుతూ తాము తెచ్చిన కూరగాయలను అమ్ముకొని వెళ్తున్నారు.
వెక్కిరిస్తున్న పిచ్చిమొక్కలు
సిరిసిల్ల రైతుబజార్‌లో రైతు ప్రతిమలతోపాటు కూరగాయాలు, చేపలు, పండ్లు వంటి ప్రతిమలు వినియోగదారులు ఆకర్షిస్తున్నా సిరిసిల్ల బల్దియా పట్టించుకోకపోవడంతో మార్కెట్‌లో పిచ్చి మొక్కలతో ప్రతిమలు కనబడకుండా వెక్కిరిస్తున్నాయి. రాష్ట్రంలోనే ప్రత్యేకంగా నిలిచిన మోడల్ మార్కెట్ నిర్వహణ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
Updated Date - Nov 14 , 2024 | 12:53 AM