‘పీఎం సూర్యఘర్’తో సౌర వెలుగులు
ABN, Publish Date - Nov 14 , 2024 | 12:32 AM
చలికాలమైనా, ఎండ కాలమైనా ఫ్యాన్లు, ఏసీలు వేసుకోక తప్పని వాతావరణం... దిగువ మధ్య తరగతి కుటుంబమైనా.. అల్పాదాయ కుటుంబమైనా కూలర్, రిఫ్రిజిరేటర్, టీవీ సాధారణమైన రోజులు ఇవి.... నీరు తోడుకునేందుకు ప్రతి ఇంటికి మోటారు తప్పనిసరి. దీంతో రోజురోజుకు విద్యుత్ వినియోగం ఎక్కువైపోయి చార్జీల భారం తడిసిమోపెడవుతోంది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
చలికాలమైనా, ఎండ కాలమైనా ఫ్యాన్లు, ఏసీలు వేసుకోక తప్పని వాతావరణం... దిగువ మధ్య తరగతి కుటుంబమైనా.. అల్పాదాయ కుటుంబమైనా కూలర్, రిఫ్రిజిరేటర్, టీవీ సాధారణమైన రోజులు ఇవి.... నీరు తోడుకునేందుకు ప్రతి ఇంటికి మోటారు తప్పనిసరి. దీంతో రోజురోజుకు విద్యుత్ వినియోగం ఎక్కువైపోయి చార్జీల భారం తడిసిమోపెడవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నెలకు 200 యూనిట్ల వినియోగం వరకు జీరో బిల్ ఇస్తూ ఆ చార్జీల భారాన్ని మోస్తున్నా దిగువ మధ్యతరగతి కుటుంబానికి నెలకు 250 నుంచి 300 యూనిట్లకు వరకు విద్యుత్ వినియోగం తప్పనిసరి అవుతోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ‘‘సూర్యఘర్.. ముఫ్త్ బిజిలీ యోజన’’ ప్రజలకు వరంగా మారింది. ఈ పథకంతో సౌరవిద్యుత్‌ను పొందే సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలు తమ అవసరాలకు వినియోగించుకోవడమే కాకుండా మిగిలిన విద్యుత్‌ను డిస్కమ్‌లకు అమ్ముకునే అవకాశం ఉంది.
ఫ కేంద్ర ప్రభుత్వ సబ్సిడీలు
సౌరవిద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద రెండు కిలో వాట్ల సామర్థ్యం గల సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకునేందుకు కిలో వాట్‌కు 30 వేల రూపాయలు సబ్సిడీగా ఇస్తోంది. రెండు కిలో వాట్స్ ప్యానళ్ల ఏర్పాటుకు 60 వేల రూపాయల సబ్సిడీ లభిస్తుంది. అదనంగా మరో కిలో వాట్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకుంటే 18 వేల సబ్సిడీని ఇస్తుంది. మూడు కిలో వాట్స్ సామర్థ్యం వరకు గృహావసరాల కోసం ప్యానళ్లను ఏర్పాటు చేసుకుంటే 78 వేల సబ్సిడీని పొందే అవకాశం ఉన్నది. ఆపై కెపాసిటీ ఉన్న ప్యానళ్లను అమర్చుకుంటే 78 వేల రూపాయల సీలింగ్‌తో సబ్సిడీ అందజేస్తున్నది. 150 యూనిట్ల విద్యుత్ వినియోగం ఉన్నవారు రెండు కిలో వాట్స్ వరకు 150 నుంచి 300 విద్యుత్ వినియోగం ఉన్నవారు రెండు నుంచి మూడు కిలో వాట్స్ వరకు, 300 యూనిట్లపై వినియోగం ఉన్నవారు మూడు కిలో వాట్స్ సామర్థ్యం ఉన్న ప్యానళ్లను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. మూడు కిలోవాట్స్ సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకోవడానికి 2.10 లక్షల నుంచి 2.35 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇందులో 78 వేల రూపాయలు కేంద్రం సబ్సిడీగా సమకూర్చుతుంది. వినియోగదారుడు 1.52 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది.
ఫ మిగులు విద్యుత్‌ను అమ్ముకునే అవకాశం
మూడు కిలో వాట్‌ల సోలార్ ప్యానళ్ల నుంచి నెలకు వాతావరణ పరిస్థితుల మేరకు 320 నుంచి 340 యూనిట్ల సోలార్ పవర్ ఉత్పత్తి అవుతుంది. వినియోగదారుడు అందులో 250 యూనిట్లను వినియోగించుకుంటే మిగిలిన 90 యూనిట్ల విద్యుత్‌ను డిస్కమ్ కొనుగోలు చేస్తుంది. 250 యూనిట్ల విద్యుత్ వినియోగించుకుంటే యూనిట్ చార్జీలు, ఇతర చార్జీలు కలుపుకొని 2,500 రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తుంది. ఈ బిల్లు తప్పడంతోపాటు మిగిలిన 90 యూనిట్ల విద్యుత్‌కు డిస్కమ్ యూనిట్‌కు ఐదు రూపాయల చొప్పున 450 రూపాయలు చెల్లిస్తుంది. వినియోగదారుడు సోలార్ విద్యుత్ ప్యానళ్ల ఏర్పాటుకు 1.52 లక్షలు వెచ్చిస్తే నెలకు మూడు వేల రూపాయల విలువ చేసే విద్యుత్‌ను పొందే అవకాశమున్నది.
ఫ బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం
సోలార్ విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవడానికి వినియోగదారులు తమ ఇళ్లలో ఎలక్ర్టిసిటీ ఫిట్టింగ్‌ల్లో ఎలాంటి మార్పులు చేసుకోవలసిన అవసరం లేదు. ఏసీ, ఫ్రిడ్జ్‌లు, టీవీలు వాడుకోవచ్చు. ఇంటికి ఉన్న మీటర్‌ను మాత్రమే మార్చి దాని స్థానంలో ఇన్‌పుట్, అవుట్‌పుట్ సదుపాయముండే ప్రత్యేకమైన మీటరును అమర్చుతారు. ఈ మీటరుతో సోలార్ ప్యానళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను వినియోగించుకోగా మిగిలింది ఎప్పటికప్పుడు డిస్కమ్‌లకు చెందిన గ్రిడ్‌కు వెళ్లిపోతుంది. రాత్రి పూట వినియోగదారులు డిస్కమ్‌ల నుంచి సరఫరా అయ్యే విద్యుత్‌ను వినియోగించుకోవచ్చు. డిస్కమ్‌లు నెలలో మొత్తంగా ఇంటిలో ఉత్పత్తి అయ్యే సోలార్ విద్యుత్ ఎంత, వినియోగించుకున్నది ఎంత...లెక్కించి మిగిలిన విద్యుత్‌కు యూనిట్‌కు ఐదు రూపాయల చొప్పున యజమానికి చెల్లిస్తారు. సోలార్ విద్యుత్‌ను ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకులు కూడా రుణ సౌకర్యాన్ని ఏడు శాత ం వడ్డీపై అందిస్తున్నాయి. వ్యక్తిగత ఇళ్లకు మాత్రమే కాకుండా హౌసింగ్ సొసైటీ గ్రూపులకు, అపార్టుమెంట్లకు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లకు కేంద్ర ప్రభుత్వం కిలో వాట్‌కు 18 వేల రూపాయల చొప్పున మూడు కిలో వాట్‌ల సోలార్ ప్యానళ్ల వరకు 54 వేల సబ్సిడీని అందజేస్తుంది. ఈ సంస్థలు రిజిస్టర్ అయి ఉండాల్సి ఉంటుంది. బ్యాంకు రుణం పొందే వారు ఐటీ రిటర్న్స్ కలిగి ఉండి ఇంటి పన్ను, విద్యుత్ బిల్లులు చెల్లించి ఉండాల్సి ఉంటుంది.
ఫ సౌర విద్యుత్‌కు పెరుగుతున్న ఆదరణ
కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో రాజన్న సిరిసిల్ల జిల్లా (సెస్) పరిధిలో ఉన్నది. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలు ఉత్తర విద్యుత్ పం పిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్) పరిధిలో ఉండడంతో ఈ జిల్లాల్లో తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధనవనరుల అభివృద్ధి సంస్థ (టీజీఆర్‌ఈడీసీవో) లిమిటెడ్ ద్వారా పీఎం సూర్యఘర్.. ముఫ్త్ బిజిలీ యోజనను అమలుచేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద సోలార్ విద్యుత్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకోవడానికి కరీంనగర్ జిల్లాలో 529 మంది, జగిత్యాల జిల్లాలో 205 మంది, పెద్దపల్లి జిల్లాలో 208 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 942 దరఖాస్తులు రాగా, వారి ఇళ్లలో సోలార్ విద్యుత్ ప్యానళ్లను అమర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫ ప్రభుత్వ కార్యాలయాల్లో సౌరవిద్యుత్
పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ ప్యానళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏర్పాటును తప్పనిసరి చేస్తూ కలెక్టర్లకు లేఖలు రాశారు. ఈ అంశంపై టీజీ రెడ్‌కో అధికారులు అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై, రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు, మార్కెట్ గోడౌన్లు, కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్లలో సోలార్ విద్యుత్ ప్యానళ్ల ఏర్పాటుకు అవకాశాలున్నాయని రెడ్‌కో జిల్లా మేనేజర్ సందీప్‌కుమార్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ కె లక్ష్మీకాంతరావు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించే విద్యుత్‌కు ఎన్‌పీడీసీఎల్‌కు యూనిట్‌కు తొమ్మిది రూపాయల చొప్పున చెల్లిస్తున్నారు. ఈ పథకం కింద సోలార్ విద్యుత్ యూనిట్‌కు 3.74 రూపాయల మాత్రమే చార్జీలుగా తీసుకోనున్నారు. ఈ విద్యుత్ వినియోగంతో ఒక్కో యూనిట్‌పై ప్రభుత్వానికి ఐదు రూపాయలపైగానే ఆదా అయ్యే అవకాశముండడంతో అన్ని కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయని చెప్పారు. గృహ వినియోగానికి సోలార్ విద్యుత్ ప్యానల్ ఏర్పాటు విషయంలో ప్రజలకు అవగాహన పెరిగిందని, ఇప్పుడిప్పుడే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా సబ్సిడీ పొందేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారని తెలిపారు.
Updated Date - Nov 14 , 2024 | 12:32 AM