ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వస్త్ర పరిశ్రమపై వరాలు కురిసేనా?

ABN, Publish Date - Nov 20 , 2024 | 12:49 AM

పొద్దస్తమానం పోగుపోగును పేని అందమైన రంగుల రంగుల చీరలు, బట్టలు నేసిన నేతన్నలు ఉపాధి కరువై అప్పుల్లో కూరుకుపోయారు. పడుగు పోగులు ఉరితాళ్లుగా వేలాడుతుంటే నిత్యం బతుకు చప్పుళ్లు వినిపించిన మరమగ్గాలు మూగబోయాయి.

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

ద్దస్తమానం పోగుపోగును పేని అందమైన రంగుల రంగుల చీరలు, బట్టలు నేసిన నేతన్నలు ఉపాధి కరువై అప్పుల్లో కూరుకుపోయారు. పడుగు పోగులు ఉరితాళ్లుగా వేలాడుతుంటే నిత్యం బతుకు చప్పుళ్లు వినిపించిన మరమగ్గాలు మూగబోయాయి. మళ్లీ బలిపీఠంపై నేతన్నలు నిలిచారు. చిన్నపిల్లలను అనాఽథలుగా మార్చి దంపతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు పునరావృతం అయ్యాయి. గడిచిన ఎనిమిది నెలల్లోనే 15 మంది కార్మికులు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని యారన్‌ డిపోతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపైనే సిరిసిల్ల నేతన్నలు ఆశలు పెంచుకున్నారు. చితికిపోతున్న మరమగ్గాలకు మళ్లీ జవసత్వాలు తెస్తాడని నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే వస్త్ర పరిశ్రమలో ఉపాధిని అందించే చర్యలు చేపట్టినా పూర్తిస్థాయిలో ఆర్డర్లు రాకపోవడంతో నేతన్నలకు ఎదురుచూపులే మిగిలాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దక్షిణాది రాష్ట్రాల్లోనే వస్త్ర పరిశ్రమగా విరాజిల్లుతున్న సిరిసిల్ల మళ్లీ ఉత్పత్తుల కోసం ఎదురుచూస్తోంది. జిల్లాలో 30,352 మరమగ్గాలు ఉండగా 200 వరకు వార్ఫిన్‌లు, సైజింగ్‌లు, డైయింగ్‌లపై ప్రత్యక్షంగా పరోక్షంగా 20 వేల కార్మిక కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. దీంతో పాటు బద్దెనపల్లిలో టెక్స్‌టైల్‌ పార్కులో కూడా ఆధునిక మరమగ్గాలపై కార్మికులు ఉపాధి పొందుతున్నారు. టెక్స్‌టైల్‌ పార్కు పలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతోంది. గతంలో అనేక సంక్షోభాలను ఎదుర్కొన్న వస్త్ర పరిశ్రమలో వందలాది మంది కార్మికులు చనిపోయారు. గత ప్రభుత్వం హయాంలో బతుకమ్మ చీరలు, కేసీఆర్‌ కిట్‌, రంజాన్‌, క్రిస్‌మస్‌ పర్వదినాల సందర్భంగా అందించే బట్టలతో పాటు ప్రభుత్వ సంస్థలకు అవసరమయ్యే ఉత్పత్తులను సిరిసిల్ల పరిశ్రమకు కేటాయించారు. దీంతో నిరంతరం కార్మికులకు పని దొరికింది. బతుకమ్మ చీరలపై పలు ఆరోపణలు ఉన్నప్పటికి కార్మికులకు మాత్రం చేతి నిండాపని, కడుపు నిండా తిండి అన్నట్లుగా మారింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత బతుకమ్మ చీరల ఆర్డర్లను నిలిపివేసింది. ఈ పరిస్థితుల్లో గత మార్కెట్‌ను కోల్పోయిన సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమ ఉత్పత్తులు లేక మూతపడ్డాయి. ఈ పరిస్థితుల్లో మరమగ్గాలను అమ్ముకున్నారు. సంక్షోభంలో కూరుకుపోయిన వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని కార్మిక సంఘాలు, కార్మికులు రోడ్డునెక్కారు. దీంతో ప్రభుత్వం పరిశ్రమను ఆదుకునే దిశగా చర్యలు చేపట్టింది. సిరిసిల్లకు రావాల్సిన రూ 275 కోట్లలో రూ 200 కోట్లు విడుదల చేశారు. తాత్కాలికంగా విద్యార్థులకు అవసరమయ్యే యూనిఫాం బట్ట ఉత్పత్తుల ఆర్డర్లను అందించారు. బతుకమ్మ చీరల తరహాలో స్వశక్తి సంఘాల మహిళలకు 1.30 కోట్ల చీరలు అందించడానికి నిర్ణయించారు. డిజైన్లు ఖరారు చేసినా ఆర్డర్లు అందించలేదు. దీంతో పాటు 50 శాతం సబ్సిడీతో పది హెచ్‌పీల వరకు ఉన్న రాయితీని 25 హెచ్‌పీలకు పెంచారు. దీంతో పరిశ్రమలో మళ్లీ ఉపాధి ఆశలు మెరుగుపడుతాయని భావిస్తున్నారు. 50 కోట్ల రూపాయలతో వేములవాడలో ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్న యారన్‌ డిపో ఊరటను ఇవ్వనుంది.

- ఎదురుచూపుల్లోనే వర్కర్‌ టు ఓనర్‌ పథకం...

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల కార్మికులను యజమానులుగా మార్చడానికి వర్కర్‌ టు ఓనర్‌ పథకానికి శ్రీకారం చుట్టారు. మహిళలకు గార్మెంట్‌ రంగంలో ఉపాధి కల్పించడానికి అపెరల్‌ పార్కు ఏర్పాటు చేశారు. అపెరల్‌ పార్కులో బహుళ జాతి కంపెనీలు ఉత్పత్తులు ప్రారంభించడంతో మహిళలకు ఉపాధి చేరువైన మరమగ్గాల కార్మికులు వర్కర్‌ టు ఓనర్‌ పథకం కోసం ఎదురు చూస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం మున్సిపల్‌ పరిధిలోని పెద్దూర్‌ వద్ద 88 ఎకరాల్లో 374 కోట్ల రూపాయలతో వీవింగ్‌ పార్కు నిర్మాణాలు చేపట్టారు. మొదటి విడతలో 1,104 మంది కార్మికులకు వర్క్‌షెడ్లను నిర్మించి అందించాలనే లక్ష్యంగా పనులు ప్రారంభించారు. రోడ్లు, నీటి వసతి, కరెంట్‌, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించారు. 46 వర్క్‌షెడ్లను నిర్మించాలనే లక్ష్యంగా పెట్టుకొని నిర్మాణాలు చేపట్టారు. వర్క్‌ షెడ్లు పూర్తి చేశారు. మోడల్‌ కోసం మరమగ్గాలను ఏర్పాటు చేశారు. వర్కర్‌ టు ఓనర్‌ పథకంలో మొదటి విడతలో 4,416 మరమగ్గాలను గ్రూప్‌ షెడ్ల కింద అందించాలని నిర్ణయించారు. ఒక్కో కార్మికుడికి 800 చదరపు అడుగుల్లో స్టోర్‌రూంతో కలిపి కేటాయించనున్నారు. ఇందులో నాలుగు సెమీ ఆటోమేటిక్‌ మరమగ్గాలు, కండెలు చుట్టే యంత్రం ఇస్తారు. పార్కులో 60 వార్ఫిన్‌ మిషన్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఒక్కో యూనిట్‌ ధర ఎనిమిది లక్షల రూపాయలుగా ముందుగా నిర్ణయించారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణం గా 15 లక్షల రూపాయల వరకు చేరుకునే అవకాశం ఉంది. ఇందులో పది శాతం లబ్ధిదారుడి వాటాధనం, 50 శాతం ప్రభుత్వ రాయితీ, 40 శాతం బ్యాంక్‌ రుణం ఉండే విధంగా పథకం ఏర్పాటు చేశారు. మరమగ్గాల ఎంపిక కోసం తాత్కాలికంగా నాలుగు ఆటోమేటిక్‌ మగ్గాలను కూడా పార్కులో ఉంచారు. విభిన్నమైన వస్త్రాలను ఇందులో తయారు చేసే అవకాశం ఉంటుంది. కానీ నేత కార్మికులను యజమానులుగా మార్చే పథకం చేరువ కాబోతుందని భావిస్తున్న క్రమంలో ప్రభుత్వం మారిపోయింది. వర్కర్‌ టు ఓనర్‌ విధి విఽధానాల్లో మార్పులు వస్తాయా లేదా పథకమే ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడిచిపోయినా వర్కర్‌టు ఓనర్‌ పథకంపై ప్రభుత్వ నిర్ణయం తేలకపోవడంతో నేత కుటుంబాల్లో సందిగ్ధం నెలకొంది. మరోవైపు పూర్తయిన షెడ్లు ఇతర అవసరాలకు కేటాయిస్తుండడంతో వర్కర్‌ టు ఓనర్‌ పథకం దూరమవుతుందనే భావన కార్మికుల్లో నెలకొంది. ముఖ్యమంత్రి కార్మికులకు మళ్లీ భరోసాను ఇచ్చే ప్రకటనలు చేస్తారనే ఆశతో ఉన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 12:49 AM