ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తెప్పలపై తప్పని తిప్పలు..

ABN, Publish Date - Nov 21 , 2024 | 01:36 AM

ఎన్నో ఏళ్ల కల సాకారమవుతుందనుకున్న తరుణంలో గత ప్రభుత్వం అరకొర నిధులు విడుదల చేయడంతో గొల్లపల్లి మండలంలోని దట్నుర్‌ చెరువు పై నిర్మించతలపెట్టిన వంతెన నిర్మాణం పనులు పిల్లర్ల దశకే పరిమితమవడంతో గ్రామస్థుల కల కలగానే మిగిలిపోయింది. దట్నుర్‌ వాగు పై వంతెన నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు కొన్ని దశాబ్దాలుగా ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు.

నీటిలో తెప్పల పై వస్తున్న రైతులు, నీటిలో వస్తున్న ఎద్దులు

అసంపూర్తిగా వంతెన నిర్మాణ పనులు

ఆంచనా వ్యయం రూ. 6 కోట్లు..

అప్పటి ప్రభుత్వం విడుదల చేసింది రూ. 3 కోట్లు

పిల్లర్లకే పరిమితమైన నిర్మాణ పనులు

దశాబ్దాల తరబడి గ్రామస్థులు, రైతులను వెంటాడుతున్న కష్టాలు

===========================

గొల్లపల్లి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : ఎన్నో ఏళ్ల కల సాకారమవుతుందనుకున్న తరుణంలో గత ప్రభుత్వం అరకొర నిధులు విడుదల చేయడంతో గొల్లపల్లి మండలంలోని దట్నుర్‌ చెరువు పై నిర్మించతలపెట్టిన వంతెన నిర్మాణం పనులు పిల్లర్ల దశకే పరిమితమవడంతో గ్రామస్థుల కల కలగానే మిగిలిపోయింది. దట్నుర్‌ వాగు పై వంతెన నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు కొన్ని దశాబ్దాలుగా ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వాగు అవతలి పక్కన గ్రామానికి చెందిన రైతుల వ్యవసాయ భూములు సుమారుగా వెయ్యి ఎకరాల వరకు ఉన్నది. పంటలను సాగు చేయాలంటే తప్పనిసరిగా వాగు దాటాల్సిందే. వేసవి కాలంలో మాత్రమే వాగులో నీటి నిల్వలు తక్కువ ఉంటాయి. మిగితా కాలాల్లో పై నుంచి వచ్చే వరద నీటితో నిత్యం వాగులో నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. దీంతో రైతులు, కూలీలు, మహిళా రైతులు, కూలీలు తప్పనిసరిగా తెప్పల పై వాగు దాటడం అలవాటు చేసుకున్నారు. అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు వంతెన నిర్మాణానికి రూ. 6 కోట్లు వ్యయం అవుతుందని సంబంధిత ఉన్నతాధికారులు ఆంచనా వేశారు. అంత పెద్ద మొత్తం ఒకేసారి ప్రభుత్వం మంజూరు చేయకుండా 2022 ఆర్థిక సంవత్సరంలో సీఆర్‌ఆర్‌ గ్రాంటు కింద రూ. 3 కోట్లను మంజూరు చేసింది. వంతెన నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో మొదటి విడతగా రూ. 3 కోట్లు మంజూరు చేయగా, ఆ మేరకు సదరు కాంట్రాక్టర్‌ చెరువులో నిర్మాణం పనులు మొదలుపెట్టి పిల్లర్ల దశలో నిర్మాణం పనులను నిలిపివేశారు.

నిలిచిపోయిన వంతెన నిర్మాణం పనులు :

నాలుగు దశాబ్ధాలుగా మండలంలోని దట్నుర్‌ వాగుపై వంతెనను నిర్మించాలని గ్రామస్థులు కోరుతూ వస్తున్నారు. గ్రామస్థుల మొరను ఆలకించిన గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేయించగా 2022 సంవత్సరంలో నిర్మాణం పనులను ప్రారంభించారు. దీంతో వంతెన నిర్మాణం పూర్తవుతుందని భ్రమించిన గ్రామస్థుల ఆశలు నిధుల లేమితో అడియాశలయ్యాయి. దీంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది.

తెప్పల పై ప్రయాణం..

రైతులకు చెందిన పంట భూములు వాగు అవతలి పక్కన ఉండడంతో రైతులు, కూలీలు తెప్పలను ఆశ్రయిస్తూ వాగు దాటుతున్నారు. తెప్పల పైనే కూలీలను తరలించడం, ఎద్దులను నీటిలోనుంచే దాటించడం, పశు గ్రాసం, ఎరువులు, విత్తనాలను తరలిస్తున్నారు. వరి కోతలప్పుడు పక్కనే ఉన్న చిల్వకోడూర్‌ నుంచి అబ్బాపూర్‌ మీదుగా తమ పంట భూముల్లోకి వాహనాలను తరిలిస్తూ ఆర్థిక భారంలోకి కూరుకుపోతున్నారు. సుమారు 5 కిలో మీటర్ల దూరం తిరగాల్సిన పరిస్థితి రావడంతో గ్రామస్థులను తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తోంది.

వంతెన పూర్తవడానికి మరో రూ. 3 కోట్లు అవసరం :

వంతెన నిర్మాణం అంచనా వ్యయం మొత్తం రూ. 6 కోట్లని అధికారులు ఆంచనా వేశారు. ప్రస్తుతం ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 3 కోట్లతో పిల్లర్ల దశలో నిర్మాణం పనులు నిలిచిపోయాయి. మరో రూ. 3 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తే గ్రామస్థుల కల సాకారమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. బెడ్‌ బ్లాక్స్‌ వరకు నిర్మాణం పూర్తవగా స్లాబ్‌, రిఫార్మింగ్‌ వాల్స్‌కు అదనపు నిధులతో నిర్మాణం పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. యుద్ద ప్రతిపాదికన వంతెన నిర్మాణంను పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

తెప్పలె మాకు దిక్కు..

-గుడికందుల పోచయ్య, రైతు, దట్నుర్‌

నాగు వాగు అవలి పక్కన రెండున్నర ఎకరాల పంట భూమి ఉంది. మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకున్న. అండ్ల పొలం పండించి కుటుంబాన్ని పోషించుకుంటున్న. ఇప్పుడు వాగులో నీళ్లు ఉన్నాయి. అరిగోస పడి పంట పండించిన. చేతికంది వచ్చే సమయం. పంటను చూసుకునేందుకు, పంటల సాగు అప్పుడు, ఎప్పుడైనా తెప్పలె మాకు దిక్కు. ఎడ్లు, ఎగుసం అంతా తెప్పల మీద పోయి ఎల్లదీసుకుంటున్నాం. బ్రిడ్జ్‌ అయితే మాకు తిప్పలు తప్పుతాయి.

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం..

-ప్రభాకర్‌, ఏఈ, పీఆర్‌

గొల్లపల్లి మండలంలోని దట్నుర్‌ వాగు పై నిర్మిస్తున్న వంతెన నిర్మాణానికి ఇప్పటివరకు రూ. 3 కోట్లను అప్పటి ప్రభుత్వం మంజూరు చేయడంతో ఆ మేరకు నిర్మాణం పనులు పూర్తయ్యాయి. అదనంగా మరో రూ. 3 కోట్ల నిధులు అవసరమని ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం. ప్రభుత్వం నిధులు మంజూరు చేయగానే టెండర్లు పిలిచి నిర్మాణం పనులు పూర్తి చేయిస్తాం. నిధుల లేమితోనే వంతెన నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది.

Updated Date - Nov 21 , 2024 | 01:36 AM