కేసీఆర్ కుటుంబానికి రూ.2లక్షల కోట్ల ఆస్తులున్నాయ్!
ABN, Publish Date - Apr 06 , 2024 | 04:01 AM
కేసీఆర్ కుటుంబానికి రూ.2లక్షల కోట్ల ఆస్తులున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఆ ఆస్తుల తాలూకు చిట్టా అంతా తన దగ్గర ఉందని, దాన్ని బయటపెడతానని చెప్పారు. కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులపై క్యాబినెట్‌లో చర్చించి.. తీర్మానం
చిట్టా మొత్తం ఉంది.. బయటపెడతా.. సీబీఐతో విచారణ జరిపిస్తాం
ధరణి, కాళేశ్వరం పేర్లతో రాష్ట్రాన్ని నాశనం చేశారు
కేసీఆర్ ఈ యాత్రలు కాదు.. తిహాడ్ జైలు యాత్ర చేయాలి
ఆయన స్థానంలో నేనుంటే కచ్చితంగా ఉరి వేసుకునే వాణ్ని
నేను తప్పు చేసి ఉంటే పదేళ్లు చర్యలు తీసుకోకుండా ఏం చేశారు?
నేను కాంట్రాక్టర్‌ను అని రుజువు చేస్తే మంత్రి పదవి వదిలేస్తా
నా పేరు వాడుకుంటే బతకలేరు.. రాజకీయంగా తొక్కుకుంటూ పోతా
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటూ రాదు: మంత్రి కోమటిరెడ్డి
చిట్టా నా దగ్గర ఉంది: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ కుటుంబానికి రూ.2లక్షల కోట్ల ఆస్తులున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఆ ఆస్తుల తాలూకు చిట్టా అంతా తన దగ్గర ఉందని, దాన్ని బయటపెడతానని చెప్పారు. కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులపై క్యాబినెట్‌లో చర్చించి.. తీర్మానం చేసి, సీబీఐతో విచారణ జరిపించి.. అందర్నీ జైలుకు పంపుతామని హెచ్చరించారు. కేసీఆర్ ఓ సన్నాసి అని, ఏజెంట్లను, బ్రోకర్లను నియమించుకుని ధరణి, కాళేశ్వరం పేర్లతో రాష్ట్రాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుమార్తె కవితకు దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫాలోని 69వ అంతస్తులో ఫ్లాట్ ఉందని... గతంలో రూపాయికి లేని స్థాయి నుంచి, బూర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ తీసుకునే స్థాయికి ఆమె ఎలా ఎదిగారని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ ఆస్తులను రికవరీ చేసి ప్రజలకు పంచుతామని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ దీక్ష పేరుతో ఆస్పత్రుల్లో విటమిన్లు తీసుకున్నారని, ఆ విటమిన్లతో 50ఏళ్లు బతకొచ్చని చెప్పారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ టీవీ చానల్‌తో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ సిరిసిల్లలో మాట్లాడుతూ తనపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవన్నారు. తాను కాంట్రాక్టర్‌ను కాదని, కాంట్రాక్టర్‌ను అని రుజువు చేస్తే మంత్రి పదవిని వదులుకుంటానని స్పష్టం చేశారు. తాను మిడ్‌మానేరు ప్రాజెక్టులోని కట్ట కాంట్రాక్టులో తప్పు చేశానని కేసీఆర్ ఆరోపించారని, మరి.. పదేళ్లుగా చర్యలు తీసుకోకుండా ఏం చేశారని నిలదీశారు. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రె్‌సలో విలీనం చేస్తానని చెప్పి, చివరకు రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారని.. ఇపుడేమో కుక్కలు, నక్కలు, సన్నాసులని అంటున్నారని ధ్వజమెత్తారు. మద్యం విధానం కేసులో తన బిడ్డే అరెస్టరుతే గనక తాను కచ్చితంగా ఉరి వేసుకునేవాడినని అన్నారు. ఇపుడు కేసీఆర్.. రాజకీయ యాత్రలకన్నా, కూతురును చూసొచ్చేందుకు తిహాడ్ జైలు యాత్ర చేస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఆయన రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ఆస్తులన్నీ ప్రభుత్వానికి అప్పగించాలని అన్నారు. రేపో, మాపో కాళేశ్వరంపై నియమించిన కమిటీ విచారణకు వస్తోందని, ఆ కమిటీ రిపోర్టు రాగానే కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీశ్ అందరూ జైలుకు వెళ్తారని పేర్కొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒక్క సీటూ గెలవదని చెప్పారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి కూడా తన పేరును ప్రస్తావించే హక్కే లేదని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే నిప్పులాంటి వ్యక్తి అని అన్నారు. తన పేరును వాడుకున్నవారు బతకలేరని, రాజకీయంగా తొక్కుకుంటూపోతానని వ్యాఖ్యానించారు.
Updated Date - Apr 06 , 2024 | 04:01 AM