ఖబడ్దార్ రేవంత్.. నోటికొచ్చింది మాట్లాడొద్దు
ABN, Publish Date - Apr 29 , 2024 | 05:27 AM
కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందన్న సీఎం రేవంత్ ఆరోపణలపై ఆ పార్టీ సీనియర్ నేత, మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు.
మైనారిటీ, దళిత, ఆదివాసీ బిడ్డలను రాష్ట్రపతులను చేసిందే బీజేపీనే: ఈటల
పేట్‌బషీరాబాద్, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందన్న సీఎం రేవంత్ ఆరోపణలపై ఆ పార్టీ సీనియర్ నేత, మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. ‘‘ఖబడ్దార్ రేవంత్‌రెడ్డి.. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం మంచిది కాదు’’ అంటూ హెచ్చరించారు. ‘‘మైనారిటీ బిడ్డ అబ్దుల్‌కలామ్, దళిత బిడ్డ రామ్‌నాథ్ కోవింద్, ఆదివాసీ బిడ్డ ముర్మును రాష్ట్రపతులను చేసిన బీజేపీ గురించా నువ్వు మాట్లాడేది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓబీసీని ప్రధానిని చేసిన ఘనత బీజేపీదేనని చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొంపల్లి మున్సిపల్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఈటల ప్రసంగించారు. కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలు, 12 మంది దళితులు, 8 మంది గిరిజనులు, ఐదుగురు మైనార్టీలు ఉన్నారని గుర్తు చేశారు. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఏనాడైనా ఇలా అన్ని వర్గాలకు అవకాశం కల్పించిందా అని ప్రశ్నించారు. దీనిపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేసి తీరుతామన్నారు. రేవంత్ విమర్శలను ప్రజలు నమ్మబోరని పేర్కొన్నారు. ‘‘కేసీఆర్ అక్షింతలు పంచితే.. జైశ్రీరామ్ అంటే.. కడుపు నిండుతుందా.. అని అడుగుతున్నారు. కరీంనగర్‌లో హిందూగాళ్లు.. బొందుగాళ్లు అని మాట్లాడినందుకే ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టారని ఈటల అన్నారు.
Updated Date - Apr 29 , 2024 | 05:27 AM