ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అందరికీ జీవన్మరణమే!

ABN, Publish Date - Apr 18 , 2024 | 04:26 AM

ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు రాష్ట్రంలోని అన్ని పార్టీలకు పెను సవాల్‌గా మారాయి. ఈ ఎన్నికల్లో సాధించే ఫలితాలు రాబోయే రోజుల్లో జరగబోయే రాజకీయ పరిణామాలను నిర్దేశించబోతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఐదేళ్లపాటు సుస్థిర పాలన

అన్ని పార్టీలకూ పెను సవాల్‌గా మారిన లోక్‌సభ ఎన్నికలు

మెజారిటీ స్థానాలు గెలిస్తేనే కాంగ్రెస్‌ సర్కార్‌కు సుస్థిరత!

ప్రభుత్వం కూలిపోతుందంటూ ఇప్పటికే విపక్షాల ప్రచారం

ఎక్కువ సీట్లల్లో పాగా వేస్తేనే రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు

ప్రధాన ప్రతిపక్ష స్థానంపై కన్నేసిన కమలనాథులు

బీఆర్‌ఎస్‌ ఉనికి ఉండాలంటే కనీస స్థానాల్లో గెలవాల్సిందే

అధికారం కోల్పోయాక ఇబ్బందుల్లో గులాబీ పార్టీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు రాష్ట్రంలోని అన్ని పార్టీలకు పెను సవాల్‌గా మారాయి. ఈ ఎన్నికల్లో సాధించే ఫలితాలు రాబోయే రోజుల్లో జరగబోయే రాజకీయ పరిణామాలను నిర్దేశించబోతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఐదేళ్లపాటు సుస్థిర పాలన సాగించాలన్నా, బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలన్నా, బీఆర్‌ఎస్‌ తన ఉనికిని కాపాడుకోవాలన్నా.. ఈ ఎన్నికల ఫలితాలే గీటురాయిగా మారనున్నాయి. దాంతో ఈ ఎన్నికలు అన్ని పార్టీలకూ జీవన్మరణ సమస్యగా మారాయి. ఒక రకంగా చెప్పాలంటే.. రాష్ట్రంలోని రాజకీయ భవిష్యత్తు పరిణామాలకు ఈ ఎన్నికలు నాంది పలకనున్నాయి. రాష్ట్రంలో నాలుగు నెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికలు ముగియడం, నాటి అధికార బీఆర్‌ఎస్‌ ఓటమి చెంది.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా, కొత్త ప్రభుత్వం ఐదేళ్లపాటు కొనసాగాల్సి ఉన్నందున.. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల పట్ల అటు రాజకీయ పార్టీలతోపాటు నాయకులకు, ఇటు ఓటర్లకు పెద్దగా ఆసక్తి ఉండకూడదు. కానీ, ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు మించిన ప్రాధాన్యం పార్లమెంటు ఎన్నికలు సంతరించుకున్నాయి. ఆయా పార్టీలకు కత్తిమీద సాములా మారాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుపైనే పార్టీల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన నేతలు ఈ ఎన్నికలను సవాల్‌ గా తీసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 64 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పొత్తులో భాగంగా పోటీ చేసి సీపీఐ తరఫున గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి మద్దతుగానే ఉన్నారు. మరోవైపు ఏడు సీట్లలో గెలిచిన ఎంఐఎం కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అండగా ఉంటామని ప్రకటించింది. వీరికితోడు బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన ముగ్గు రు ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరారు. మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరడానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితులను బట్టి చూస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఐదేళ్లపాటు ఏలాంటి ఢోకా ఉండకూడదు. కానీ, పార్లమెంట్‌ ఎన్నికల తర్వా త రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందంటూ కొంతమంది రాజకీయ నేతలు ప్రచారం చేస్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎక్కువ మంది గెలవకపోతే.. రాజకీయంగా మార్పులు చోటుచేసుకుంటాయని, ప్రభుత్వం కూలిపోవడానికి అదే కారణమవుతుందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా బీజేపీ రూపంలో పెసుసవాల్‌ ఎదురవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో ప్రభుత్వ సుస్థిరతకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ పరిణామాలను అంచనా వేసిన కాంగ్రెస్‌ పెద్దలు.. పార్లమెంట్‌ ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలుచుకునేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా రెండంకెల స్థానాల్లో గెలుపొందడం ద్వారా ఐదేళ్లపాటు రాష్ట్రప్రభుత్వాన్ని సాఫీగా నడపవచ్చని భావిస్తున్నారు. దీంతోపాటు దక్షిణాదిన అత్యధిక సీట్లు గెలవాలనుకుంటున్న కాం గ్రెస్‌ జాతీయ నాయకత్వం.. తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ స్థానాలను ఆశిస్తోంది. ఇందుకు అనుగుణం గా రాష్ట్ర నాయకత్వం అనేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పలు పార్లమెంట్‌ స్థానాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించింది.

బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలంటే..

తెలంగాణలో బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తున్న బీజేపీకి కూడా పార్లమెంటు ఎన్నికలు సవాల్‌గా మారాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచారు. అయితే ఆ వెంటనే 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏకంగా నలుగురు ఎంపీలు గెలుపొందారు. అనంతరం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలను గెలుచుకుంది. అయితే బీఆర్‌ఎస్‌ అధికారాన్ని కోల్పోవడంతో రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించుకోవాలని భావిస్తోంది. అప్పుడే.. తదుపరి అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. ఇదంతా జరగాలంటే ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల్లో అధిక సీట్లను గెలుచుకోవాలని భావిస్తోంది. 2019 ఎన్నికల్లోనే నాలుగు ఎంపీ సీట్లు గెలిచినందున.. ఇప్పుడు అంతకు రెట్టింపు కంటే ఎక్కువ సీట్లను కైవసం చేసుకోవాలనే ఉద్దేశాన్ని బీజేపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ హవా కొనసాగుతోందని, అది కూడా తమకు రాష్ట్రంలో సానుకూలాంశం కానుందని పేర్కొంటున్నారు. మరోవైపు ఈసారి ఉత్తరాదిన పార్టీకి సీట్లు తగ్గితే.. ఆ లోటును దక్షిణాదిలో పూడ్చుకోవాల ని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. దాంతో తెలంగాణపై జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది.

బీఆర్‌ఎస్‌ ఉనికి కాపాడుకోవాలంటే..

మొన్నటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పరిస్థితి విచిత్రంగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై అధికారం కోల్పోయాక తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. సిటింగ్‌ ఎంపీలు కూడా పార్లమెంటు ఎన్నికల్లో తిరిగి పోటీ చేయడానికి ముందుకు రాలేదు. దాంతో చాలా సిటింగ్‌ స్థానాల్లో ఇతరులను రంగంలోకి దింపాల్సి వచ్చింది. మరోవైపు పార్టీ క్యాడర్‌ కూడా పూర్తి స్థాయి నమ్మకంలో లేదు. ఎంపీలు, ఎమ్మెల్యేల దగ్గర్నుంచి కింది ్థాయి కార్యకర్తల దాకా చాలా చోట్ల పార్టీ మారారు. ఇంకా పార్టీలో ఉన్నవారు కూడా రంగంలోకి దిగి పోరాడే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే.. భవిష్యత్తులో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ ఎన్నికలు బీఆర్‌ఎ్‌సకు పెను సవాల్‌గా మారాయి. ముఖ్యంగా వచ్చే ఐదేళ్లపాటు పార్టీ ఉనికిలో ఉండాలంటే గౌరవప్రదమైన సంఖ్యలో ఎంపీ స్థానాలను గెలుచుకోవాల్సి ఉంటుంది. కనీసం గౌరవ ప్రదమైన సంఖ్యలోనైనా ఎంపీ స్థానాలను గెలుచుకోవాల్సి ఉంటుంది. అలా జరగని పక్షంలో ఓవైపు నుంచి కాంగ్రెస్‌, మరోవైపు నుంచి బీజేపీతో బీఆర్‌ఎ్‌సకు ముప్పు పొంచి ఉంటుంది.

నేటి నుంచే నామినేషన్లు

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికలకు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలను ఏడు దశల్లో నిర్వహిస్తుండగా.. తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ట్రాల్లో నాలుగో దశలో జరగనున్నాయి. ఈ దశలో దేశంలోని 96 స్థానాలకు మే 13న పోలింగ్‌ జరగనుంది. వీటికి ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 29న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగుస్తుంది. కాగా, గురువారం.. క్రోధి నామ సంవత్సరం.. చైత్రమాసం.. శుక్లపక్షం.. మఖ నక్షత్రం.. దశమి.. మంచిరోజు కావడంతో తెలంగాణలో ఎక్కువ మంది తొలి రోజే నామిషన్లు దాఖలు చేయటానికి సిద్ధమవుతున్నారు. పండితులు చెబుతున్న దాని ప్రకారం.. ఈ నెల 26 తేదీ వరకే మంచి రోజులు, ముహూర్తాలు ఉన్నాయి. అయితే మంగళ, బుధవారాల్లో అష్టమి, నవమి కూడా వెళ్లిపోయింది. మరుసటి రోజు దశమిని విజయానికి సంకేతంగా భావిస్తారు. గురువారం ఉదయం 9.40 గంటల నుంచి శుభఘడియలు ప్రారంభమవుతాయి. దీంతో అభ్యర్థులు ఇదే రోజు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, తొలిరోజు మాత్రం పెద్దగా జన సమీకరణ లేకుండా ముహూర్త సమయం చూసుకొని నామినేషన్లు దాఖలు చేసేందుకు కొందరు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత మందీమార్బలంతో అట్టహాసంగా నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మంచిరోజు కావటంతో గురువారం ఒక సెట్‌ నామినేషన్‌ వేసి.. ఆ తర్వాత మరో ఒకటి, రెండు సెట్ల నామిషన్లు దాఖలు చేయనున్నారు. కాగా, నాలుగో దశలో తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలతోపాటు ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుండగా, ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలతోపాటు 175 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి.

నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి

పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. నోటిఫికేషన్‌ వెలువడిన వెంటనే ఎలాంటి అవాంతరాలు లేకుండా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించాలని రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆర్వోలు, ఏఆర్వోలు, కలెక్టర్లను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన మాట్లాడారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా బందోబస్తు చేపట్టాలని సూచించారు. 18వ తేదీ ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపారు. అదనపు సీఈవో లోకేశ్‌కుమార్‌ మాట్లాడుతూ పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలను అన్ని కార్యాలయాల్లో అందుబాటులోకి తేవాలని చెప్పారు.

Updated Date - Apr 18 , 2024 | 04:26 AM

Advertising
Advertising